IND Vs SA :టీమిండియా ఫ్లాప్ షో..సఫారీల చేతిలో చిత్తు
IND Vs SA: టీ20 ప్రపంచకప్ లో డిఫెండింగ్ ఛాంపియన్ భారత జట్టు జైత్రయాత్రకు బ్రేక్ పడింది. గ్రూప్ స్టేజ్ లో ఆల్ రౌండ్ షోతో అదరగొట్టిన టీమిండియా సూపర్ 8 రౌండ్ ను ఓటమితో ఆరంభించింది.
IND Vs SA
టీ20 ప్రపంచకప్ లో డిఫెండింగ్ ఛాంపియన్ భారత జట్టు జైత్రయాత్రకు బ్రేక్ పడింది. గ్రూప్ స్టేజ్ లో ఆల్ రౌండ్ షోతో అదరగొట్టిన టీమిండియా సూపర్ 8 రౌండ్ ను ఓటమితో ఆరంభించింది. బ్యాటింగ్ , బౌలింగ్, ఫీల్డింగ్ అన్ని విభాగాల్లోనూ నిరాశపరిచింది. ఫలితంగా సౌతాఫ్రికా(IND Vs SA) చేతిలో 76 పరుగుల తేడాతో ఘోరపరాజయాన్ని చవిచూసింది.
సౌతాఫ్రికా బ్యాటింగ్ లో మిల్లర్ విధ్వంసానికి బ్రెవిస్ , స్టబ్స్ మెరుపులు కూడా తోడవగా.. బౌలింగ్ లో మార్కో యెన్సన్ , కేశవ్ మహారాజ్ భారత్ ను దెబ్బకొట్టారు. ఈ మ్యాచ్ లో సౌతాఫ్రికా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. సఫారీ జట్టులో నాలుగు మార్పులు చేయగా.. భారత్ అదే జట్టుతో బరిలోకి దిగింది. దీంతో సంజూ శాంసన్ , అక్షర్ పటేల్ కు నిరాశే మిగిలింది. ఛేజింగ్ పిచ్ పై మార్క్ క్రమ్ బ్యాటింగ్ ఎంచుకోవడం ఆశ్చర్యపరిచింది. దీనికి తోడు పవర్ ప్లేలోనే ముగ్గురు సఫారీ బ్యాటర్లు ఔటయ్యారు.
ఈ నేపథ్యంలో కనీసం 150 పరుగులైనా స్కోరు చేస్తుందా అనుకున్నారు. అయితే డేవిడ్ మిల్లర్, బ్రెవిస్ సఫారీ ఇన్నింగ్స్ ను మలుపు తిప్పారు. వీరిద్దరూ భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగి పరుగులు రాబట్టారు. వీరి జోడీ నాలుగో వికెట్ కు కేవలం 50 బంతుల్లోనే 97 పరుగులు జోడించింది. బ్రెవిస్ 29 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 45 పరుగులు చేసి ఔటయ్యాడు. మరోవైపు భారీ షాట్లతో విరుచుకుపడ్డ మిల్లర్ 35 బంతుల్లో 63( 7 ఫోర్లు,3 సిక్సర్లు) పరుగులకు వెనుదిరిగాడు.
తర్వాత స్టబ్స్ కూడా భారత బౌలర్లకు చుక్కలు చూపించాడు. చివరి ఓవర్లలో వరుస సిక్సర్లతో అదరగొట్టాడు. స్టబ్స్ 24 బంతుల్లో 44 (1 ఫోర్, 3 సిక్సర్లు) రన్స్ కు ఔటవగా.. సౌతాఫ్రికా 20 ఓవర్లలో 7 వికెట్లకు 187 పరుగులు చేసింది. భారత బౌలర్లలో బుమ్రా 3, అర్షదీప్ 2, వరుణ్ చక్రవర్తి 1, దూబే 1 వికెట్ తీశారు.

అహ్మదాహాజ్ ఛేజింగ్ పిచ్ కావడంతో భారత్ విజయం నల్లేరుపై నడకేనని భావించారు. తీరా చూస్తే సీన్ మొత్తం రివర్సయింది. ఇషాన్ కిషన్ డకౌటవగా.. తిలక్ వర్మ(1), అభిషేక్ శర్మ (15) పవర్ ప్లేలోనే ఔటయ్యారు. ఈ దశలో సూర్యకుమార్ యాదవ్ , వాషింగ్టన్ సుందర్ ఆదుకునే ప్రయత్నం చేసినా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయారు.
సూర్యకుమార్ (18), వాషింగ్టన్ సుందర్(11) ఔటైన తర్వాత శివమ్ దూబే, హార్థిక్ పాండ్యా ఏదైనా విధ్వంసం సృష్టిస్తారేమోనని అభిమానులు ఎదురుచూసారు. అయితే హార్థిక్ వేగంగా ఆడే క్రమంలో ఔటవగా.. రింకూ సింగ్ డకౌటయ్యాడు. దీంతో భారత్ ఓటమి ఖాయమైంది. చివరికి భారత్ 111 పరుగులకే కుప్పకూలింది. సౌతాఫ్రికా(IND Vs SA) బౌలర్లలో మార్కో యెన్సన్ 4 , కేశవ్ మహారాజ్ 3 ,కార్బిన్ బోస్చ్ 2 వికెట్లు తీశారు. ఈ భారీ ఓటమితో భారత్ సెమీస్ రేసులో వెనుకబడింది.



