Kedarnath: చార్ధామ్ యాత్రలో కేదార్నాథ్ ప్రాముఖ్యత: శివుడి దివ్య తపోభూమి
Kedarnath: ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఐదవదిగా, ఉత్తర భారతదేశంలోని చార్ధామ్ యాత్రలో ఒకటిగా ఈ క్షేత్రం అత్యంత పవిత్రమైనది.

Kedarnath
హిమాలయాల గంభీరమైన కొండల మధ్య, మంచు శిఖరాల నీడలో ప్రశాంతంగా వెలసిన కేదార్నాథ్ (Kedarnath) ఆలయం, శివభక్తులకు కేవలం ఒక దేవాలయం కాదు. ఇది ఆధ్యాత్మిక సాధన, అచంచలమైన విశ్వాసం , ప్రకృతితో మమేకమయ్యే ఒక దివ్యమైన అనుభవం. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఐదవదిగా, ఉత్తర భారతదేశంలోని చార్ధామ్ యాత్రలో ఒకటిగా ఈ క్షేత్రం అత్యంత పవిత్రమైనది. అత్యంత కష్టతరమైన ప్రయాణ మార్గంలో ఉన్నా కూడా..లక్షలాది మంది భక్తులు ప్రతి సంవత్సరం స్వామివారిని దర్శించుకోవడానికి వస్తుంటారు.
పురాణాల ప్రకారం, ఒకప్పుడు నరుడు ,నారాయణుడు (శ్రీకృష్ణుని రూపం) ఇక్కడ శివుడి కోసం తీవ్ర తపస్సు చేశారట. వారి భక్తికి మెచ్చిన శివుడు హిమాలయ పర్వతంలో స్వయంగా జ్యోతి రూపంలో వెలిశాడు. ఈ క్షేత్రంలో శివుడు “కేదార్” (Kedarnath)అనే రూపంలో ఉంటాడు, అంటే భక్తులను సన్మార్గంలో నడిపించే మార్గదర్శకుడని అర్థం. అందుకే ఈ క్షేత్ర దర్శనం భక్తులకు భయాన్ని పోగొట్టి, ధైర్యాన్ని, ఆశీర్వాదాన్ని అందిస్తుంది.

కేదార్నాథ్ (Kedarnath)ఆలయ సందర్శన కేవలం ఒక సాధారణ యాత్ర కాదు. ఇది రిషికేశ్ నుంచి గౌరీకుండ్‌కు బస్సులో ప్రయాణించి, అక్కడి నుంచి సుమారు 16 కిలోమీటర్ల దూరం కాలినడకన సాగించాల్సిన ఒక కఠినమైన ప్రయాణం. అయితే, చుట్టూ ఉన్న హిమాలయాల అందాలు, స్వచ్ఛమైన వాతావరణం, నదుల శబ్దం భక్తులను అలసిపోకుండా ముందుకు నడిపిస్తాయి. ఈ యాత్రలో పల్లకీలు, హెలికాప్టర్ వంటి సౌకర్యాలు అందుబాటులో ఉన్నప్పటికీ, కాలినడకన సాగే భక్తులు పొందే ఆధ్యాత్మిక ఆనందం వర్ణించలేనిది. ఆలయ కవాటాలు మే నెలలో తెరిచి, అక్టోబర్ చివరలో మూసివేస్తారు, ఎందుకంటే మిగిలిన సమయంలో వాతావరణం చాలా ప్రతికూలంగా ఉంటుంది.
ఈ క్షేత్రంలో శివరాత్రి, కార్తీక మాసం వంటి రోజులలో ప్రత్యేక పూజలు జరుగుతాయి. అలాగే, ప్రతి మంగళవారం జరిగే మహా ఆరతి చాలా ప్రత్యేకంగా ఉంటుంది. చాలామంది భక్తులు కేదార్నాథ్ దర్శనం తర్వాత తమ జీవితం పూర్తిగా మారిపోయిందని, మనసుకు ప్రశాంతత లభించిందని చెబుతుంటారు. బయట ఉన్న కష్టం, లోపల ఉన్న ప్రశాంతత ఈ క్షేత్రంలో కలిసిపోతాయని భక్తుల అనుభవం. కేదార్నాథ్ దర్శనం మన జీవితానికి ఒక కొత్త దిశను, ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. ఇది కేవలం ఒక ఆలయం కాదు.. జీవనంలో ఎదురయ్యే ప్రతి సవాలును ధైర్యంగా ఎదుర్కోవడానికి ప్రేరణ ఇచ్చే పవిత్ర శక్తి కేంద్రం.