Lord Shiva: పరమశివుడికి ఓ సొంతూరుందట.. తిరు ఉత్తర కోసమాంగై ఆలయం విశేషాలివే..
Lord Shiva: ఈ దేవాలయం సుమారు 3000 సంవత్సరాలకు పూర్వమే నిర్మించబడిందని చరిత్ర చెబుతోంది.

Lord Shiva
శివాలయం మొట్టమొదట వెలిసిన ప్రాంతంగా భావించబడే అద్భుత క్షేత్రం తిరుఉత్తర కోసమాంగై. ఈ పవిత్ర స్థలం తమిళనాడులోని ఒక చిన్న గ్రామంలో, రామేశ్వరం నుంచి సుమారు 75 కిలోమీటర్ల దూరంలో, మధురై వెళ్లే మార్గంలో ఉంది. మనందరికీ సొంతూరు ఉన్నట్లే, పరమేశ్వరుడి(Lord Shiva)కి కూడా ఈ కుగ్రామం సొంతూరుగా ప్రసిద్ధి చెందింది. ఈ దేవాలయం సుమారు 3000 సంవత్సరాలకు పూర్వమే నిర్మించబడిందని చరిత్ర చెబుతోంది.
ఈ ఆలయం అనేక చారిత్రక , ఆధ్యాత్మిక విశేషాలను కలిగి ఉంది.
రావణ-మండోదరి వివాహం.. శివభక్తురాలైన మండోదరి ఈశ్వరుడి(Lord Shiva)ని ప్రార్థించి, ‘ఒక గొప్ప శివభక్తుడిని భర్తగా ప్రసాదించు’ అని వేడుకోగా, పరమశివుడు తన భక్తుడైన రావణబ్రహ్మను మండోదరికిచ్చి ఇక్కడే వివాహం జరిపారు. ఈ క్షేత్రం రావణుడికి అల్లుడిగా మారిన పవిత్ర స్థలంగా కూడా గుర్తింపు పొందింది.
మొగలిపువ్వు అలంకరణ..సాధారణంగా ఏ ఇతర దేవాలయంలోనూ పూజకు ఉపయోగించని మొగలిపువ్వును (Screw Pine Flower) ఇక్కడ మాత్రమే స్వామి వారికి అలంకరించి పూజిస్తారు.
ప్రాచీన వృక్షం..ఈ ప్రాంతంలో వెలసిన రేగిపండు చెట్టు కూడా 3000 సంవత్సరాలకు పూర్వమే ఉండి, ఆలయ ప్రాచీనతకు నిదర్శనంగా నిలుస్తోంది.
దర్శన రూపాలు:..ఈ ఆలయంలో శివుడు ప్రధానంగా శివలింగ రూపంలో, అద్భుతమైన మరకత రూపంలోను,అలాగే స్ఫటికలింగంలో భక్తులకు దర్శనమిస్తారు.
నటరాజ మరకత విగ్రహం రహస్యం..తిరుఉత్తర కోసమాంగై ఆలయంలో వెలసిన నటరాజ రూపంలోని విగ్రహం అత్యంత విశిష్టమైనది.

ఈ విగ్రహం సుమారు 5 అడుగుల ఎత్తు కలిగి, పూర్తిగా మరకతంతో (Emerald) చేయబడింది. ఈ మరకత విగ్రహం నుండి వెలువడే తీవ్రమైన కిరణాలను (Radiations) మానవ శరీరం తట్టుకోలేదు కాబట్టి, స్వామివారిని ఎప్పుడూ విభూది మరియు గంధపు పూతతో కప్పి ఉంచుతారు.
ఈ నటరాజ విగ్రహం యొక్క నిజరూప దర్శనం కేవలం సంవత్సరానికి ఒక్కసారి, ఆరుద్ర నక్షత్రం రోజు మాత్రమే ఉంటుంది. ఆ రోజున మాత్రమే స్వామివారికి ఉన్న పూతను తొలగిస్తారు. అలాగే, ప్రతిరోజూ మధ్యాహ్నం 12 గంటలకు స్వామివారి స్ఫటికలింగానికి అభిషేకం నిర్వహించి, అనంతరం దాన్ని భద్రత కోసం లాకర్లో ఉంచుతారు.
సుమారు 20 ఎకరాల సువిశాల ప్రాంగణంలో విస్తరించిన ఈ అత్యంత ప్రాచీనమైన శివాలయ దర్శనం మన పూర్వజన్మ సుకృతంగా భావించబడుతుంది.ఈ ఆలయానికి సమీపంలోనే అమ్మవారు వారాహి రూపంలో వెలిశారు.వారాహి అమ్మవారికి భక్తులు పసుపు కొమ్ములను ఆ ప్రాంగణంలోనే నూరి, ముద్దచేసి, పవిత్రమైన నైవేద్యంగా సమర్పిస్తారు.
ఇలాంటి ఎన్నో అద్భుతమైన విశేషాలు , చారిత్రక నేపథ్యం ఉన్నా కూడా తిరుఉత్తర కోసమాంగై ఆలయం గురించి మన ఆంధ్ర ప్రాంత భక్తులకు పెద్దగా తెలియదు. అందుకే, మీరు ఎప్పుడైనా రామేశ్వరం యాత్రకు వెళ్లినట్లయితే, తప్పక ఈ దేవాలయాన్ని దర్శించి స్వామివారి కృపకు పాత్రులు కండి.