Idols:పూజ గదిలో ఈ విగ్రహాలను ఉంచకూడదట..అవేంటో చూడండి
Idols: పురాణాలు చెబుతున్న దాని ప్రకారం కొన్ని విగ్రహాలు పూజ గదిలో ఉంటే అవి నెగటివ్ ఎనర్జీని పెంచే అవకాశం ఉంటుందట.
Idols
సాధారణంగా ప్రతి హిందూ కుటుంబంలో దేవుడి గది కానీ, పూజా మందిరం కానీ ఉంటుంది. దానిని ఆ ఇంటికి ఒక శక్తి కేంద్రంలా వారంతా భావిస్తారు. ఉదయాన్నే స్నానం చేసి దీపం వెలిగించినప్పుడు అక్కడి నుంచి వచ్చే సానుకూల ప్రకంపనలు రోజంతా మనల్ని ఉత్సాహంగా ఉంచుతాయి.
అయితే పూజ గదిలో మనం ఉంచే విగ్రహాల( Idols) విషయంలో కొన్ని కఠినమైన నియమాలు ఉన్నాయని చాలామందికి తెలియదు. కేవలం భక్తి ఉంటే సరిపోదు.. ఆ విగ్రహాల స్వభావం కూడా మన గృహస్థాశ్రమానికి సరిపోతుందా లేదా అనేది కూడా చూసుకోవాలట. పురాణాలు చెబుతున్న దాని ప్రకారం కొన్ని విగ్రహాలు పూజ గదిలో ఉంటే అవి నెగటివ్ ఎనర్జీని పెంచే అవకాశం ఉంటుందట.
ముఖ్యంగా శివుని నటరాజ విగ్రహం గురించి మనం చెప్పుకోవాలి. నటరాజ రూపం చూడటానికి కళాత్మకంగా, ఎంతో అద్భుతంగా చూడగానే అందరికీ నచ్చేలా ఉంటుంది. కానీ అది శివుని తాండవ నృత్యానికి సంకేతం. తాండవం అంటే వినాశనం లేదా లయం. ఇవి డ్యాన్స్ స్కూల్స్ వంటి ప్రదేశాలలో ఉండొచ్చు కానీ ఇళ్లలో పెట్టుకోకూడదు.

ఎందుకంటే గృహస్థులు ఉండే ఇంట్లో ఎప్పుడూ ప్రశాంతమైన విగ్రహాలే( Idols) ఉండాలి తప్ప, ఇలాంటి ఉగ్ర రూపాలు ఉండకూడదు. దీనివల్ల ఇంట్లో కలహాలు, అశాంతి ఏర్పడే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు.
అలాగే, శని దేవుడి విగ్రహాన్ని కూడా ఇంట్లో ఉంచకూడదు. శని దేవుడు విగ్రహం కానీ,ఫోటో కానీ ఎప్పుడూ బయట గుడిలోనే ఉండాలి. ఆయన చూపు నేరుగా మన మీద పడకూడదని శాస్త్రం చెబుతోంది. ఇంట్లో శని దేవుడిని పూజించాలనుకుంటే మాత్రం కేవలం దీపం వెలిగించి మనసులో స్మరించుకోవాలి తప్ప విగ్రహాన్ని పెట్టుకోకూడదని పండితులు అంటున్నారు.
మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఒకే దేవుడికి సంబంధించిన రెండు విగ్రహాలు కానీ ఫోటోలు కానీ ఎదురెదురుగా ఉండకూడదట. ఉదాహరణకు ఇద్దరు గణపతులు, ఇద్దరు హనుమంతుల విగ్రహాలు ఒకదానికొకటి అభిముఖంగా ఉంటే ఆ ఇంట్లో ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువగా ఉంటాయట.
అలాగే, మూడు గణపతి విగ్రహాలు (Idols) కూడా ఒకే చోట ఉండకూడదు. మనం నిత్యం పూజించే పూజ గదిలో ఉంచే విగ్రహం పరిమాణం కూడా జానెడు (సుమారు 9 అంగుళాలు) కంటే ఎక్కువగా ఉండకూడదు. అంతకంటే పెద్ద విగ్రహాలు ఉంటే మాత్రం నిత్యం షోడశోపచార పూజలు, నైవేద్యాలు శాస్త్రోక్తంగా జరపాలి. అది ఎలాగూ చేయడానికి అవదు..దీంతో అది దోషంగా మారుతుంది.
అంతేకాదు పగిలిన, విరిగిన లేదా రంగు వెలిసిన ఫోటోలను,విగ్రహాలను ఎట్టి పరిస్థితుల్లోనూ పూజగదిలో ఉంచకూడదు. వాటిని గౌరవప్రదంగా పారే నీటిలో కలపడం కానీ, దేవుని గుడిలో రావి చెట్టుకింద పెట్టడం కానీ చేయాలి.
పూజ గది ఎప్పుడూ ఈశాన్య మూల ఉండటం, దేవుళ్లు తూర్పు ముఖంగా ఉండటం వల్ల ఆ ఇంట్లో లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుందని పండితులు చెబుతూ ఉంటారు.



