Thousand Pillar Temple: వేయి స్తంభాల గుడి.. కాకతీయుల కళా వైభవం,చరిత్రకు సాక్ష్యం
Thousand Pillar Temple: వరంగల్‌లోని హన్మకొండ నడిబొడ్డున ఉన్న వేయి స్తంభాల ఆలయాన్ని 11వ శతాబ్దంలో కాకతీయ వంశానికి చెందిన రుద్రదేవుడు నిర్మించారు.

Thousand Pillar Temple
అద్భుతమైన నిర్మాణ శైలి, అపురూపమైన శిల్పకళ… వేయి స్తంభాల గుడి (Thousand Pillar Temple) అంటే మనకు గుర్తొచ్చేది ఇదే. వరంగల్‌కు మకుటాయమానంగా నిలిచిన ఈ గుడి, కేవలం ఒక పుణ్యక్షేత్రం మాత్రమే కాదు, వేల సంవత్సరాల చరిత్రను తనలో నిక్షిప్తం చేసుకున్న ఒక అద్భుతం. ప్రతి పండుగ, ప్రతి పౌర్ణమి వేళ వేల సంఖ్యలో భక్తులు ఇక్కడికి తరలివస్తారు. మరి కాకతీయుల ఈ కళాఖండం వెనుక ఉన్న కథ, దాని విశిష్టత ఏమిటో వివరంగా తెలుసుకుందాం.
వరంగల్‌లోని హన్మకొండ నడిబొడ్డున ఉన్న ఈ ఆలయాన్ని 11వ శతాబ్దంలో కాకతీయ వంశానికి చెందిన రుద్రదేవుడు నిర్మించారు. ఆ కాలంలో ఈ ఆలయ నిర్మాణం కాకతీయుల కీర్తి ప్రతిష్టలను ప్రపంచ నలుదిశలా చాటి చెప్పింది. ఆలయం పేరుకు తగ్గట్టుగానే, ఇందులో దాదాపు వేయి స్తంభాలు (Thousand Pillar Temple)ఉన్నాయి. ప్రతి స్తంభంపై అద్భుతమైన శిల్పాలు చెక్కబడి ఉంటాయి.

ఈ ఆలయంలో ప్రధానంగా ముగ్గురు దేవతలు కొలువై ఉన్నారు. రుద్రేశ్వరుడు (శివుడు), విష్ణువు, సూర్య భగవానుడు. ఈ ఆలయం త్రికూటాలయ శైలిలో నిర్మించబడింది.ఆలయానికి ఉత్తరాన ఉన్న నల్లరాతితో చెక్కిన భారీ నంది విగ్రహం ఈ ఆలయానికే ప్రత్యేక ఆకర్షణ. ఈ నంది శిల్పం ఎంత జీవం ఉట్టిపడేలా ఉంటుందంటే, దానిని చూసిన భక్తులు మంత్రముగ్ధులవుతారు. నందిని దర్శించుకున్న తర్వాతే భక్తులు ఆలయంలోకి ప్రవేశిస్తారు.చాళుక్యుల శైలిలో నిర్మించిన ఈ ఆలయ గోడలపై నాట్య భంగిమల్లో ఉన్న స్త్రీమూర్తులు, పురాణ ఘట్టాలను తెలిపే అనేక శిల్పాలు కళ్లు చెదిరిపోయేలా ఉంటాయి. ప్రతి శిల్పం ఒక కథను చెబుతుంది.
మహాశివరాత్రి, కార్తీక మాసం వంటి పర్వదినాల్లో ఆలయాని(Thousand Pillar Temple)కి భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తారు. ఈ మాసాల్లో ఆలయాన్ని సందర్శిస్తే సిరిసంపదలు, ఆయురారోగ్యాలు లభిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. కేవలం వరంగల్ నుంచే కాకుండా హైదరాబాద్, కరీంనగర్ వంటి ప్రాంతాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారు. మొత్తంగా వేయి స్తంభాల గుడి కేవలం ఒక ప్రార్థనా స్థలం కాదు, అది ఒక కళా నిలయం. కాకతీయుల శిల్పకళ, వారి ఆధ్యాత్మిక చింతనను ఇది ప్రతిబింబిస్తుంది.
One Comment