Ganesha: వినాయకుడి బొజ్జ చుట్టూ పాము ఎందుకు ఉంటుంది? గణనాథుడి రూపం వెనుక ఉన్న రహస్యం మీకు తెలుసా?
Ganesha: ఒకసారి వినాయకుడు ఇష్టమైన పదార్థాలను కడుపు నిండా తిని, తన వాహనమైన మూషికం (ఎలుక)పై వెళ్తుండగా, దారిలో గణేషుడికి ఒక పాము అడ్డం వచ్చిందట.
Ganesha
మనం ఏ పూజ చేసినా మొదట ఆరాధించేది, తలచుకునేది వినాయకుడినే. గణేషుడు (Ganesha) పేరు చెప్పగానే అందరి కళ్ల ముందు పెద్ద బొజ్జ , ఏనుగు ముఖం గుర్తుకు వస్తాయి.
అయితే వినాయకుడి విగ్రహాన్ని కాస్త జాగ్రత్తగా గమనిస్తే ఆయన ఉదరానికి (బొజ్జకు) ఒక పాము చుట్టబడి ఉంటుంది. దీనిని ‘నాగబంధం’ అని పిలుస్తారు. అసలు వినాయకుడు అలా పామును ఎందుకు కట్టుకున్నాడనే దాని వెనుక ఒక ఆసక్తికరమైన కథలు కూడా ఉన్నాయి.
పురాణ గాథ..ఒకసారి వినాయకుడు ఇష్టమైన పదార్థాలను కడుపు నిండా తిని, తన వాహనమైన మూషికం (ఎలుక)పై వెళ్తుండగా, దారిలో గణేషుడికి ఒక పాము అడ్డం వచ్చిందట.
దాంతో ఎలుక భయపడి ఒక్కసారి పక్కకు తప్పుకోవడంతో వినాయకుడు కింద పడిపోయాడట. ఆ సమయంలో ఆయన బొజ్జ నుంచి తాను తిన్న పదార్థాలు బయటకు రాకుండా ఉండటానికి, వెంటనే అక్కడ ఉన్న పామును త్రాడులా తన బొజ్జకు చుట్టుకున్నాడట.

కేవలం ఇలా కథగానే కాకుండా, దీని వెనుక ఒక గొప్ప ఆధ్యాత్మిక సందేశం కూడా ఉందంటారు పండితులు. వినాయకుడి బొజ్జ ఈ బ్రహ్మాండానికి ప్రతీకగా చెప్పిన పండితులు.. ఆ బ్రహ్మాండాన్ని పట్టి ఉంచే శక్తికి సంకేతంగా పాము గురించి చెబుతారు.
పాము అనేది కుండలిని శక్తికి గుర్తు. కుండలిని శక్తిని అదుపులో ఉంచుకుని, జ్ఞానాన్ని ప్రసాదించే దేవుడు వినాయకుడు అని చెప్పడమే ఈ రూపం వెనుక ఉన్న అసలు ఉద్దేశం.



