Ind vs Aus: సిడ్నీలో ”రోకో” సూపర్ హిట్.. చివరి వన్డేలో ఆసీస్ చిత్తు
Ind vs Aus:మూడు వన్డేల సిరీస్ లో వరుసగా రెండు పరాజయాలతో సిరీస్ కోల్పోయిన టీమిండియా సిడ్నీలో మాత్రం అదరగొట్టింది.
Ind vs Aus
ఆస్ట్రేలియా టూర్(Ind vs Aus) లో భారత్ తొలి విజయాన్ని అందుకుంది. మూడు వన్డేల సిరీస్ లో వరుసగా రెండు పరాజయాలతో సిరీస్ కోల్పోయిన టీమిండియా సిడ్నీలో మాత్రం అదరగొట్టింది. ఆస్ట్రేలియాను 9 వికెట్ల తేడాతో చిత్తు చేసి క్లీన్ స్వీప్ పరాభవాన్ని తప్పించుకుంది. అంతే కాదు టీ ట్వంటీ సిరీస్ కు ముందు కాన్ఫిడెన్స్ పెంచుకుంది. ఎందుకంటే ఈ మ్యాచ్ కు ముందు సిరీస్ కోల్పోయినా ఒత్తిడంతా భారత్ పైనే ఉంది.
తొలి రెండు మ్యాచ్ (Ind vs Aus)లలో భారత్ ఆటతీరు అనుకున్న స్థాయిలో లేదు. రోహిత్ పర్వాలేదనిపించినా , కోహ్లీతో పాటు మిగిలిన బ్యాటర్లు ఫ్లాప్ అయ్యారు. అటు బౌలింగ్ లోనూ పేలవ ప్రదర్శన నిరాశపరిచింది. ఫలితంగా క్లీన్ స్వీప్ పరాభవం కూడా తప్పదేమోనని అందరూ అనుకున్నారు. కానీ ఒత్తిడిలోనే అద్భుతంగా రాణించిన టీమిండియా ఆల్ రౌండ్ షోతో అదరగొట్టింది. మొదట బౌలింగ్ లో హర్షిత్ రాణా రఫ్ఫాడిస్తే… తర్వాత బ్యాటింగ్ లో రోహిత్ , కోహ్లీ దుమ్మురేపారు.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా (Ind vs Aus)భారీ స్కోర్ చేయాలన్న లక్ష్యంతోనే ధాటిగా ఆడింది. ఓపెనర్లు హెడ్, మార్ష్ తొలి వికెట్ కు 61 రన్స్ జోడించారు. అయితే పవర్ ప్లే తర్వాత భారత బౌలర్లు అదరగొట్టారు. ముఖ్యంగా హర్షిత్ రాణా , సిరాజ్ లైన్ అండ్ లెంగ్త్ తో బౌలింగ్ చేస్తూ ఆసీస్ ను కట్టడి చేశారు. రాణా వరుస వికెట్లు తీసి ఆసీస్ ను దెబ్బ కొడితే.. మధ్యలో స్పిన్నర్లు కూడా తలో చేయి వేశారు. ఫలితంగా ఆస్ట్రేలియా క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది.
ఒకవైపు వికెట్లు పడుతున్నా రెన్షా హాఫ్ సెంచరీ చేయడంతో స్కోర్ 200 దాటింది. చివర్లో కూపర్ కన్నోలి, ఎల్లిస్ కాసేపు క్రీజులో నిలిచినప్పటకీ ఆసీస్ పూర్తి ఓవర్లు ఆడలేకపోయింది. చివరికి ఆస్ట్రేలియా 46.4 ఓవర్లలో 236 పరుగులకు ఆలౌటైంది. హర్షిత్ రాణా 4 వికెట్లు తీయగా.. వాషింగ్టన్ సుందర్ 2, సిరాజ్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ ఒక్కో వికెట్ పడగొట్టారు.

ఛేజింగ్ లో భారత్ కు ఓపెనర్లు శుభమన్ గిల్, రోహిత్ శర్మ మెరుపు ఆరంభాన్నిచ్చారు. తొలి వికెట్ కు 10.1 ఓవర్లలోనే 69 పరుగులు జోడించారు. గిల్ 24 రన్స్ కు ఔటైనా కోహ్లీతో కలిసి రోహిత్ శర్మ ఇన్నింగ్స్ నడిపించాడు. ఈ క్రమంలో పాత హిట్ మ్యాన్ ను గుర్తు చేస్తూ శతక్కొట్టాడు. 105 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అటు విరాట్ కోహ్లీ కూడా క్లాస్ ఇన్నింగ్స్ తో మునుపటి కింగ్ ను గుర్తు చేశాడు.
ఇటు రోహిత్ సెంచరీ, అటు కోహ్లీ హాఫ్ సెంచరీతో ఆసీస్ బౌలర్లు ప్రేక్షకుల్లా మిగిలారు. వీరిద్దరూ రెండో వికెట్ కు 168 పరుగులు జోడించగా… భారత్ 38.3 ఓవర్లలోనే టార్గెట్ ను అందుకుంది. తద్వారా సిరీస్ ను 1-2తో ముగించింది. రోహిత్ 121 ( 13 ఫోర్లు, 4 సిక్సర్లు) , కోహ్లీ 74 (7 ఫోర్లు) రన్స్ తో అజేయంగా నిలిచారు. రోహిత్ శర్మకే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు లభించాయి. ఇరు జట్ల మధ్య ఐదు టీ ట్వంటీల సిరీస్ బుధవారం నుంచి ప్రారంభమవుతుంది.



