IND VS SA: టీమిండియాకు కొత్త టెన్షన్.. నెం.4లో ఎవరికో ఛాన్స్ ?
IND VS SA: గుహావటి వేదికగా శనివారం నుంచి భారత్, సౌతాఫ్రికా రెండో టెస్ట్ ఆరంభం కానుంది.
IND VS SA
తొలి టెస్టు(IND VS SA)లో అనూహ్యంగా పరాజయం పాలైన టీమిండియా ఇప్పుడు రెండో మ్యాచ్ కు రెడీ అవుతోంది. గుహావటి వేదికగా శనివారం నుంచి భారత్, సౌతాఫ్రికా రెండో టెస్ట్ ఆరంభం కానుంది. ప్రస్తుతానికి కోల్ కత్తాలోనే ప్రాక్టీస్ చేస్తున్న భారత్ బుధవారం గుహావటికి బయలుదేరుతుంది. మెడనొప్పితో తొలి టెస్ట్ మధ్యలోనే తప్పుకున్న కెప్టెన్ శుభమన్ గిల్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాడు.
ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్న గిల్ రెండో టెస్టులో ఆడడం అనుమానంగానే ఉంది. వైద్యులు మరో వారం విశ్రాంతి అవసరరమని సూచించినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ తెలుగుతేజం, ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్‌రెడ్డికి పిలుపునిచ్చింది. ప్రస్తుతం నితీశ్ సౌతాఫ్రికా ఏ జట్టుతో జరుగుతున్న అనధికార వన్డే సిరీస్ లో భారత్ ఏకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. మొదట నితీశ్ ఈ టెస్ట్ (IND VS SA)సిరీస్ కు ఎంపికయ్యాడు. అయితే ఈడెన్ టెస్టులో స్పిన్నర్లకే ప్రాధాన్యత ఇవ్వడంతో అతనికి చోటు దక్కలేదు. దీంతో ఆ ఆల్ రౌండర్ ను భారత్ ఏ జట్టులోకి పంపించారు. ఇప్పుడు గిల్ గాయపడడం, రెండో టెస్టులో ఆడడం పై అనుమానాలు నెలకొన్న నేపథ్యంలో మళ్లీ టెస్ట్ జట్టులో చేరమని బీసీసీఐ ఆదేశించింది.

ఒకవేళ గిల్ గుహావటి టెస్టు(IND VS SA)కు దూరమైతే నితీశ్ తుది జట్టులోకి రానున్నాడు. రెండో టెస్ట్ మ్యాచ్ భారత్ కు చాలా కీలకం. తొలి టెస్ట్ ఓడిపోవడంతో ఇప్పుడు సిరీస్ చేజారకుండా ఉండాలంటే భారత్ ఖచ్చితంగా గెలిచి తీరాలి. అటు సౌతాఫ్రికా ఈ మ్యాచ్ డ్రా చేసుకున్నా చాలు సిరీస్ వారి సొంతమవుతుంది. ఈ నేపథ్యంలో ఎట్టిపరిస్థితుల్లోనూ గుహావటిలో గెలవాలని భారత్ పట్టుదలగా ఉంది. గిల్ దూరమైతే పంత్ జట్టుకు తాత్కాలిక సారథిగా వ్యవహరించనున్నాడు. అయితే గిల్ స్థానంలో బ్యాటింగ్ చేసేది ఎవరనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం భారత స్క్వాడ్‌లో ఈ స్థానానికి సాయి సుదర్శన్, పడిక్కల్ మాత్రమే ఆప్షన్లుగా ఉన్నారు. సౌతాఫ్రికా ఏతో జరిగిన టెస్ట్ సిరీస్ లో వీరిద్దరూ పెద్దగా రాణించలేదు.
ఒకవేళ వీరిద్దరిలో ఒక్కరిని తుది జట్టులోకి తీసుకున్నా మొత్తం ఏడుగురు ఎడమచేతి వాటం బ్యాటర్లు ఆడుతున్నట్టవుతుంది. లెఫ్ట్ హ్యాండర్లను ఔట్ చేయడంలో సఫారీ స్పిన్నర్ పైచేయి సాధిస్తున్నాడు. అందుకే జట్టులో ఎక్కువ మంది లెఫ్ట్ హ్యాండర్లు వద్దని పలువురు మాజీలు సూచిస్తున్నారు. మంగళవారం ప్రాక్టీస్ లో సాయి సుదర్శన్, పడిక్కల్ స్పిన్ బౌలింగ్ లోనే ఎక్కువ ప్రాక్టీస్ చేస్తూ కనిపించారు.
రైట్ ఆర్మ్ ఆఫ్ బ్రేక్ బౌలర్ అయిన హార్మర్ ను దృష్టిలో ఉంచుకునే వీరిద్దరూ ప్రాక్టీస్ చేసినట్టు అర్ధమవుతోంది. గంభీర్ కూడా వీరిద్దరికీ సలహాలు ఇస్తూ కనిపించాడు. ఇదిలా ఉంటే నెంబర్ 4లో జురెల్ ను కూడా ఆడించే ఆప్షన్ కూడా ఉంది. ఎందుకంటే తొలి టెస్టులో వాషింగ్టన్ సుండర్ ను మూడో స్థానంలో ఆడించి ప్రయోగం చేసిన గంభీర్ ఓ మాదిరి ఫలితాన్ని సాధించాడు. మొత్తం మీద సఫారీలను తక్కువ అంచనా వేసి తొలి టెస్టులో మూల్యం చెల్లించుకున్న భారత్ ఎలాగైనా సిరీస్ నమం చేయాలని పట్టుదలతో తుది జట్టుపై మరింత ఫోకస్ పెట్టిందని చెప్పొచ్చు.



