Jyothi Yarraji: ఆసియా అథ్లెటిక్స్ లో తెలుగమ్మాయి జ్యోతి యర్రాజీ సంచలనం.. భారత్ ఖాతాలో చారిత్రాత్మక స్వర్ణాలు
Jyothi Yarraji: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన జ్యోతి యర్రాజీ 100 మీటర్ల హర్డిల్స్‌లో అద్భుత ప్రదర్శన చేసి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నారు.

Jyothi Yarraji
దక్షిణ కొరియాలోని గుమి వేదికగా జరుగుతున్న 26వ ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ 2025లో భారత అథ్లెట్లు సంచలనం సృష్టించారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన జ్యోతి యర్రాజీ(Jyothi Yarraji)100 మీటర్ల హర్డిల్స్‌లో అద్భుత ప్రదర్శన చేసి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నారు. కేవలం 12.96 సెకన్లలోనే లక్ష్యాన్ని చేరుకుని సరికొత్త ఛాంపియన్‌షిప్ రికార్డును నెలకొల్పారు.
జ్యోతి(Jyothi Yarraji)తో పాటు మరో భారత అథ్లెట్ అవినాష్ సాబుల్ కూడా 3000 మీటర్ల స్టీపుల్‌చేజ్‌లో బంగారు పతకం సాధించి చరిత్ర సృష్టించారు. గడిచిన 36 ఏళ్లలో ఈ విభాగంలో టైటిల్ గెలుచుకున్న తొలి భారతీయుడిగా అవినాష్ రికార్డులకు ఎక్కారు. ఈ ఇద్దరు అథ్లెట్ల విజయంతో అంతర్జాతీయ వేదికపై భారత కీర్తి పతాకం ఎగిరింది.
పేదరికాన్ని జయించి ప్రపంచాన్ని జయించిన జ్యోతి(Jyothi Yarraji)…జ్యోతి యర్రాజీ విజయ ప్రస్థానం ఎందరో యువ అథ్లెట్లకు ఆదర్శం. విశాఖపట్నానికి చెందిన ఒక నిరుపేద కుటుంబంలో జన్మించిన జ్యోతి, ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొని ఈ స్థాయికి చేరుకున్నారు. ఆమె తండ్రి సెక్యూరిటీ గార్డుగా, తల్లి ఇళ్లల్లో పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించేవారు. సరైన వసతులు, ఆర్థిక స్థోమత లేకపోయినా జ్యోతిలోని పట్టుదలను ఆమె కోచ్ గుర్తించి ప్రోత్సహించారు. అంచెలంచెలుగా ఎదిగి ఇవాళ భారత దేశం గర్వించదగ్గ అథ్లెట్‌గా ప్రపంచ వేదికపై తన ఉనికిని చాటుకుంది. తన కఠోర శ్రమతో దారిద్ర్యాన్ని పారదోలి, దేశానికి బంగారు పతకాన్ని కానుకగా ఇచ్చింది.
View this post on Instagram
మౌనంగా సాగిన విజయం సామాజిక మాధ్యమాల్లో వైరల్..ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, జ్యోతి యర్రాజీ ఈ ఘనత సాధించిన సమయంలో స్టేడియంలో భారీగా ప్రేక్షకులు లేరు, పెద్దగా హంగామా లేదు. ఎటువంటి హడావుడి లేకుండా మౌనంగా పరుగెత్తిన జ్యోతి, తన విజయంతో ప్రపంచం మొత్తం వినేలా గెలుపు ఢంకా మోగించారు. ప్రస్తుతం ఆమె పరుగుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది. ఎవరూ గుర్తించకపోయినా, అభినందించే వారు లేకపోయినా దేశం కోసం ప్రాణం పెట్టి పోరాడే క్రీడాకారుల మనస్తత్వానికి జ్యోతి విజయం ఒక నిదర్శనం. నెటిజన్లు ఆమెను “రియల్ ఛాంపియన్” అంటూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

భారత అథ్లెటిక్స్‌లో కొత్త శకం..ఒకే ఏడాది ఇద్దరు భారత అథ్లెట్లు ఆసియా ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకాలు సాధించడం అనేది ఒక అరుదైన ఘనత. అవినాష్ సాబుల్ , జ్యోతి యర్రాజీల ప్రదర్శనతో రాబోయే ఒలింపిక్స్ పై భారత్ ఆశలు రెట్టింపు అయ్యాయి. నిరుపేద కుటుంబాల నుంచి వచ్చిన ఈ అథ్లెట్లు సాధించిన విజయాలు, ప్రభుత్వాలు క్రీడలకు ఇస్తున్న ప్రాధాన్యతను, క్రీడాకారుల అంకితభావాన్ని చాటుతున్నాయి. చారిత్రాత్మక రికార్డులు సృష్టించిన ఈ క్రీడాకారులపై దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. తెలుగమ్మాయి జ్యోతి సాధించిన ఈ విజయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రమే కాకుండా యావత్ భారత దేశానికి గర్వకారణం.
సవాళ్లను అవకాశాలుగా మార్చుకోవడం జ్యోతి యర్రాజీకి వెన్నతో పెట్టిన విద్య. తన కుటుంబ బ్యాక్ గ్రౌండ్ ఎంత బలహీనంగా ఉన్నా, తన సంకల్పం మాత్రం కొండంత బలంగా ఉందని ఆమె నిరూపించింది. ఈ ఆసియా ఛాంపియన్‌షిప్ విజయం కేవలం ఒక పతకానికే పరిమితం కాదు, ఇది కోట్ల మంది క్రీడాకారుల కలల ప్రతిరూపం. భవిష్యత్తులో జ్యోతి మరిన్ని అంతర్జాతీయ పథకాలు సాధించి దేశ కీర్తిని దశదిశలా వ్యాపింపజేయాలని కోరుకుందాం.



