Markram : దంచికొట్టిన మాక్ర్రమ్..సఫారీల చేతిలో కివీస్ చిత్తు
Markram : మాక్ర్రమ్ కేవలం 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
Markram
టీ20 ప్రపంచకప్ లో సౌతాఫ్రికా హ్యాట్రిక్ విక్టరీ కొట్టింది. న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. బౌలర్లు కివీస్ ను భారీస్కోరు చేయకుండా కట్టడి చేస్తే.. బ్యాటింగ్ లో మాక్ర్రమ్(Markram) విధ్వంసకర ఇన్నింగ్స్ తో రెచ్చిపోయాడు. ఫలితంగా సౌతాఫ్రికా సూపర్-8కు మరింత చేరువైంది. మొదట బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ ఇన్నింగ్స్ తడబడుతూ సాగింది. దూకుడుగానే ఇన్నింగ్స్ ఆరంభించినప్పటకీ కేవలం 64 పరుగులకే 4 వికెట్లు చేజార్చుకుంది.
సిఫర్ట్ 13, ఫిన్ అలెన్ 31, రచిన్ రవీంద్ర 13, గ్లెన్ ఫిలిప్స్ 1 పరుగుకే వెనుదిరిగారు. ఈ దశలో చాప్ మన్, డారిల్ మిఛెల్ కివీస్ ను ఆదుకున్నారు. వీరిద్దరూ ఐదో వికెట్ కు 74 పరుగులు జోడించారు. చాప్ మన్ 26 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 48 , మిఛెల్ 24 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్సర్ తో 32 పరుగులకు ఔటయ్యారు.వీరిద్దరూ క్రీజులో ఉన్నంతసేపూ న్యూజిలాండ్ 200కు పైగా స్కోరు సాధిస్తుందని అంతా అనుకున్నారు.
అయితే సౌతాఫ్రికా బౌలర్లు అద్భుతంగా పుంజుకుని కివీస్ ను కట్టడి చేశారు. వరుస వికెట్లు తీసి ఒత్తిడి పెంచారు. దీంతో న్యూజిలాండ్ 20 ఓవర్లలో 175 పరుగులే చేయగలిగింది. చివర్లో నీషమ్ (23) ధాటిగా ఆడకుంటే ఆ స్కోరు కూడా వచ్చేది కాదు. సఫారీ బౌలర్లలో మార్కో యెన్సన్ 4 వికెట్లు పడగొట్టాడు.

ఛేజింగ్ లో సౌతాఫ్రికా ఓపెనర్లు దుమ్మురేపారు. క్వింటన్ డికాక్, కెప్టెన్ మార్క్ రమ్ చెలరేగిపోయారు. తొలి బంతి నుంచే భారీ షాట్లతో విరుచుకుపడ్డారు. పిచ్ ఫ్లాట్ గా ఉండడం, ఔట్ ఫీల్డ్ వేగంగా ఉండడంతో వీరిద్దరినీ ఆపడం కివీస్ బౌలర్ల వల్ల కాలేదు. ముఖ్యంగా మార్క్ రమ్(Markram) అయితే కొడితే బౌండరీ, లేకుంటా సిక్సర్ అన్న తరహాలో ఆడాడు. కేవలం 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
డికాక్(20), రికెల్టన్(21) , బ్రెవిస్ (21) పరుగులకే ఔటయ్యారు. అప్పటికే సౌతాఫ్రికా విజయానికి ఖాయమైంది. చివరి వరకూ క్రీజులో ఉండి జట్టును గెలిపించిన కెప్టెన్ మార్క్ రమ్ 44 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 86 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. దీంతో సౌతాఫ్రికా 17.1 ఓవర్లలోనే టార్గెట్ ఫినిష్ చేసింది.ఇప్పటి వరకూ ఆడిన మూడు మ్యాచ్ లలోనూ సౌతాఫ్రికా విజయం సాధించి సూపర్ 8 బెర్తును దాదాపుగా ఖాయం చేసుకుంది.



