Fatty Liver:ఫ్యాటీ లివర్ – నిశ్శబ్దంగా ముంచుకొచ్చే ముప్పు..ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిందే..
Fatty Liver: శరీరం గ్లూకోజ్‌ను వాడుకోగా మిగిలినదంతా కాలేయం వద్దకు చేరుతుంది. లివర్ ఆ అదనపు గ్లూకోజ్‌ను ట్రైగ్లిజరైడ్స్ గా మార్చి త నలోనే దాచుకుంటుంది.
Fatty Liver
ఇప్పుడు చాలా మంది అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించుకున్నప్పుడు కామన్‌గా ఫ్యాటీ లివర్ ( Fatty Liver)ఉన్నట్లు తేలుతోంది. వినడానికి ఇది సాధారణంగానే కూడా అనిపించినా, సరైన సమయంలో జాగ్రత్త పడకపోతే మాత్రం ఇది కాలేయాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుంది. ఇవి రెండు రకాలు..ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్, నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ (NAFLD). మొదటిది ఆల్కహాల్ తాగేవారిలో, రెండోది మద్యం తాగని వారిలో కూడా వస్తుంది.
సాధారణంగా మన కాలేయంలో (Liver) కొద్దిగా ఫ్యాట్ ఉండటం మామూలే. కానీ, లివర్ బరువులో 5 నుంచి 10 శాతం కంటే ఎక్కువ కొవ్వు పేరుకుపోతే దానిని ఫ్యాటీ లివర్ ( Fatty Liver) అంటారు. దీనివల్ల కాలేయంలో వాపు వచ్చి, మెల్లమెల్లగా అది తన పనితీరును కోల్పోతుంది.
రక్తంలో చెడు కొలెస్ట్రాల్ , ట్రైగ్లిజరైడ్స్ పెరగడంతో పాటు డయాబెటిస్ ఉన్నవారిలో ఫ్యాటీ లివర్ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది.
తక్కువ ఆహారం తినే వారిలో ఫ్యాటీ లివర్ రావడానికి కారణం తినే పరిమాణం కాదు..వారు తినే ఫుడ్ కారణం అంటున్నారు డాక్టర్లు. వాళ్లు తక్కువ తిన్నా.. ఆ తినేది వైట్ రైస్, స్వీట్లు, బిస్కెట్లు వంటివి శరీరంలోకి వెళ్లాక గ్లూకోజ్‌గా మారుతాయి. శరీరం ఆ గ్లూకోజ్‌ను వాడుకోగా మిగిలినదంతా కాలేయం (Liver) వద్దకు చేరుతుంది. లివర్ ఆ అదనపు గ్లూకోజ్‌ను ట్రైగ్లిజరైడ్స్ గా మార్చి త నలోనే దాచుకుంటుంది.
మరి కొందరు తక్కువ తింటారు కానీ అందులో ప్రోటీన్ ఉండదు. లివర్ తన వద్ద ఉన్న కొవ్వును బయటకు పంపాలంటే లిపోప్రోటీన్స్ అనే వాహకాల సాయం తీసుకుంటుంది. అయితే ప్రోటీన్ సరిగ్గా లేనప్పుడు,ఆ కొవ్వు లివర్ లోనే ఆగిపోయి ఫ్యాటీ లివర్‌గా మారుతుంది.
ఊబకాయం ఉన్నవారిలో ఫ్యాటీ లివర్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంవి. అంటే బరువు పెరగడమనేది ఫ్యాటీ లివర్ రావడానికి ఒక మెయిన్ రీజన్. ఒకవేళ ఫ్యాటీ లివర్ ముదిరి గ్రేడ్ 3 కానీ సిర్రోసిస్ దశకు కానీ చేరుకుంటే, లివర్ తన పనితీరును కోల్పోతుంది. అప్పుడు ఆహారం అరగక, పోషకాలు అందక మనిషి హఠాత్తుగా నీరసించిపోయి బరువు తగ్గిపోతారు. ఇది వ్యాధి ముదిరినప్పుడు కనిపించే లక్షణం (Symptom).
వీరిలో పొట్ట భాగంలో అవయవాల చుట్టూ పేరుకుపోయే ఫ్యాట్‌ను విసెరల్ ఫ్యాట్ అంటారు. ఈ కొవ్వు నేరుగా లివర్‌పైన ప్రభావం చూపిస్తుంది. అందుకే వీరిలో కాళ్లు, చేతులు సన్నగా ఉన్నా.. కేవలం పొట్ట మాత్రమే ముందుకు వస్తుంది. ఇలా పాట్ బెల్లీ (Pot Belly) ఉండేవారిలో ఫ్యాటీ లివర్ ఉండే అవకాశం చాలా ఎక్కువ.
అంతేకాకుండా లివర్ సమస్య తీవ్రమైనప్పుడు కడుపులో నీరు చేరడం (Ascites) వల్ల కూడా పొట్ట సైజు అసాధారణంగా పెరుగుతుంది.
అయితే ఫ్యాటీ లివర్ ప్రారంభ దశలో ఎలాంటి లక్షణాలు కనిపించవు. అందుకే దీనిని నిశ్శబ్ద వ్యాధి అంటారు. అయితే కొంతమందిలో కడుపులో కుడివైపు పైభాగంలో చిన్నపాటి నొప్పి ,విపరీతమైన నీరసం -అలసట,ఆకలి తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

ఫ్యాటీ లివర్ ( Fatty Liver) ఒక్కసారిగా రాదు. ఇది మూడు దశల్లో ఉంటుంది. కాలేయంపై కొవ్వు ఇప్పుడిప్పుడే చేరుతుంటే అది గ్రేడ్ 1 . కొవ్వు పెరిగి కాలేయంలో వాపు మొదలవుతే అది గ్రేడ్ 2..ఇక గ్రేడ్ 3లో అయితే కాలేయం గట్టిపడి మచ్చలు ఏర్పడతాయి (Fibrosis). ఇది ముదిరితే లివర్ సిర్రోసిస్‌కు దారితీస్తుంది.
ఫ్యాటీ లివర్‌ను మందుల కంటే లైఫ్ స్టైల్‌లోని మార్పులతోనే సమర్థవంతంగా తగ్గించుకోవచ్చు. పంచదార, స్వీట్లు, కూల్ డ్రింక్స్ వంటివి పూర్తిగా మానేయాలి. వైట్ రైస్ తగ్గించి జొన్నలు,రాగులు, సజ్జలు వంటి మిల్లెట్లు తీసుకోవాలి.
డీప్ ఫ్రై చేసిన పదార్థాలను తినకూడదు.మీ బరువులో కనీసం 7 నుంచి 10 శాతం తగ్గినా కూడా లివర్ మళ్లీ ఆరోగ్యంగా మారుతుంది. రోజుకు 30-40 నిమిషాల వేగవంతమైన బ్రిస్క్ వాకింగ్ లేదా యోగా లివర్‌లోని ఫ్యాట్‌ను కరిగిస్తుంది.ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారమే కాలేయానికి రక్షణ ఇస్తుంది అన్న సంగతి మర్చిపోకండి.
ఫ్యాటీ లివర్ అనేది మనం భయపడాల్సినంత జబ్బు కాదు, కానీ మనం మారాలని మన బాడీకి ఇచ్చే ఒక హెచ్చరిక అనుకోవాలి. సరైన ఫుడ్, డైలీ ఎక్సర్‌సైజులు ఉంటే మీ కాలేయం మళ్లీ ఆరోగ్యంగా మారుతుంది.
మరిన్ని హెల్త్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి



