WhatsApp Web: ఆఫీస్ ల్యాప్‌టాప్‌లో వాట్సాప్ వెబ్ వాడుతున్నారా? అయితే ఇది తెలుసుకోండి.
WhatsApp Web: ఆఫీస్ కంప్యూటర్లలో వాట్సాప్ వెబ్‌ను పూర్తిగా మానేయడమే ఉత్తమం. ఒకవేళ తప్పనిసరి అయితే, చాలా జాగ్రత్తగా, అత్యవసరమైన సందర్భాల్లో మాత్రమే వాడాలి.

WhatsApp Web
ఆఫీసు పనిలో ఉన్నప్పుడు పర్సనల్ మెసేజ్‌లు చూడటానికి లేదా ముఖ్యమైన ఫైల్స్ షేర్ చేసుకోవడానికి చాలామంది వాట్సాప్ వెబ్‌ను ఆఫీస్ కంప్యూటర్లలో వాడటం సర్వసాధారణమైపోయింది. ఇది సౌకర్యంగా అనిపించవచ్చు, కానీ అత్యంత ప్రమాదకరమైన సైబర్ భద్రతా తప్పిదమని కేంద్ర ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అవేర్‌నెస్ (ISEA) బృందం విడుదల చేసిన ఒక వీడియో ద్వారా కూడా ఈ ప్రమాదాలను స్పష్టం చేసింది.
కార్పొరేట్ పరికరాల్లో వాట్సాప్ వెబ్ (WhatsApp Web)వాడకం సంస్థలకు, ఉద్యోగులకు అనేక రకాలుగా నష్టాలను కలిగిస్తుంది. మీ ఆఫీస్ ల్యాప్‌టాప్ హ్యాక్ అయితే, మీ వ్యక్తిగత వాట్సాప్ చాట్‌లు, ఫైల్స్ హ్యాకర్ల చేతికి చిక్కే అవకాశం ఉంది. ఈ చాట్స్‌లో కంపెనీకి సంబంధించిన గోప్యమైన సమాచారం ఉంటే, అది సంస్థకు చాలా పెద్ద నష్టాన్ని కలిగిస్తుంది.
మీరు ఆఫీసులోని పబ్లిక్ వైఫై లేదా అసురక్షిత నెట్‌వర్క్‌లో వాట్సాప్ వెబ్(WhatsApp Web) ఉపయోగిస్తే, సైబర్ నేరగాళ్లు మీ డేటాను సులభంగా అడ్డగించగలరు. ఇది బ్రౌజర్ హైజాకింగ్‌కు దారితీసి, మీ పరికరం ద్వారా మొత్తం ఆఫీస్ నెట్‌వర్క్‌పై దాడి చేయడానికి మార్గం చూపుతుంది.
అన్నింటి కంటే ముందు చాలా కంపెనీలు భద్రతా కారణాల దృష్ట్యా ఉద్యోగుల పరికరాలపై మానిటరింగ్ సాఫ్ట్‌వేర్, స్క్రీన్ రికార్డింగ్ టూల్స్‌ను వాడతాయి. ఈ అడ్మిన్ యాక్సెస్ ద్వారా మీ వాట్సాప్ చాట్స్, షేర్ చేసిన ఫైల్స్, లాగిన్ వివరాలు అన్నీ కంపెనీకి తెలిసిపోతాయి. మీ ప్రైవసీ పూర్తిగా కోల్పోతారు.

వాట్సాప్‌లో వచ్చే తెలియని లింకులు, అటాచ్‌మెంట్‌లు తెరవడం వల్ల మీ ఫోన్‌కు మాత్రమే కాకుండా, మీరు వాడే ఆఫీస్ కంప్యూటర్‌కు కూడా మాల్వేర్, రాన్సమ్‌వేర్ వంటి వైరస్‌లు సోకే ప్రమాదం ఉంది. ఇది సంస్థ నెట్‌వర్క్‌కు తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తుంది.
అత్యవసర పరిస్థితుల్లో ఆఫీస్ కంప్యూటర్‌లో వాట్సాప్ వెబ్ (WhatsApp Web)వాడాల్సి వస్తే.. పని పూర్తయిన వెంటనే బ్రౌజర్ నుంచి తప్పనిసరిగా లాగౌట్ చేయండి. లేకపోతే మీ తర్వాత ఆ కంప్యూటర్ వాడేవారు మీ వాట్సాప్ చాట్స్‌ను యాక్సెస్ చేయగలరు.
గుర్తు తెలియని వారి నుంచి వచ్చే లింక్‌లను, అటాచ్‌మెంట్లను అస్సలు క్లిక్ చేయవద్దు. అది మీ వ్యక్తిగత లేదా కార్పొరేట్ డేటాకు చాలా ప్రమాదకరం.
మీ కంపెనీ ఐటీ, డేటా గోప్యత విధానాల గురించి పూర్తిగా తెలుసుకోండి. చాలా సంస్థలు వ్యక్తిగత మెసేజింగ్ యాప్‌ల వాడకాన్ని, మానిటర్ చేస్తుంటాయి.
నిపుణుల సూచన ప్రకారం, ఆఫీస్ కంప్యూటర్లలో వాట్సాప్ వెబ్‌ను పూర్తిగా మానేయడమే ఉత్తమం. ఒకవేళ తప్పనిసరి అయితే, చాలా జాగ్రత్తగా, అత్యవసరమైన సందర్భాల్లో మాత్రమే వాడాలి. మీ డేటా,ప్రైవసీ , కంపెంనీ సేఫ్టీ కోసం ఈ నియమాలు పాటించడం చాలా అవసరం.