Telangana: గ్రేట్ వాల్ ఆఫ్ తెలంగాణ.. మీకు తెలియని చరిత్ర తెలుసుకోండి
Telangana: ఫరహాబాద్ అటవీ ప్రాంతంలోని వ్యూ పాయింట్‌కు ఇరువైపులా ఉన్న కోటగోడలు చెక్కుచెదరకుండా ఉన్నాయి.
Telangana
చరిత్రలో మరుగునపడి ఉన్న తెలంగాణ(Telangana) వైభవాన్ని చాటిచెప్పే అద్భుతాలలో ‘గ్రేట్ వాల్ ఆఫ్ తెలంగాణ’ ఒకటి. ఇది నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలంలోని దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలో ఉంది. ఈ చారిత్రక గోడ పొడవు ఏకంగా 120 కిలోమీటర్లు. అమ్రాబాద్ మండలంలోని మన్ననూర్ నుంచి ప్రారంభమై ఫరహాబాద్ మీదుగా కొల్లాపూర్ వరకు ఇది విస్తరించి ఉంది.
ఎనిమిదవ శతాబ్దంలో అమ్రాబాద్ ప్రాంతానికి చెందిన సామంతరాజు పట్టభద్రుడు ఈ గోడ నిర్మాణానికి పునాది వేశారట. ఆ తర్వాత 13వ శతాబ్దంలో కాకతీయుల (Telangana)ఆధీనంలోకి వచ్చిన ఈ కోటను రాణి రుద్రమదేవి కొంత నిర్మాణం చేపట్టగా, ఆ తర్వాత ప్రతాపరుద్రుడి పాలనా కాలంలో కోట నిర్మాణం పూర్తయింది. శ్రీశైలం పుణ్యక్షేత్రానికి ఉత్తరాన ఉన్న కోటను శత్రువుల నుంచి రక్షించడానికి, అక్కడి భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా నల్లమలలోని కృష్ణానది తీరం మీదుగా ప్రతాపరుద్రుడు ఈ గోడను నిర్మించారు. కాకతీయ సామ్రాజ్యం పతనమైన తర్వాత కూడా ఈ గోడ శత్రు దాడులను తట్టుకుని నిలబడింది.

ప్రస్తుతం ఈ చారిత్రక గోడ శిథిలావస్థలో ఉంది. ప్రకృతి వైపరీత్యాలు, నిధుల కోసం దొంగల తవ్వకాలు, దాడుల వల్ల ఈ గోడ చాలావరకు దెబ్బతింది. ఐదు, ఆరు కిలోమీటర్ల మేర కూలిపోయిన స్థితిలో ఉంది. అయితే, మన్ననూరుకు దగ్గర్లోని కొండపై సుమారు ఒక కిలోమీటరు వరకు ఎక్కిన తర్వాత, కోటగోడ ఆనవాళ్లు చూడొచ్చు.
అలాగే, ఫరహాబాద్ అటవీ ప్రాంతంలోని వ్యూ పాయింట్‌కు ఇరువైపులా ఉన్న కోటగోడలు చెక్కుచెదరకుండా ఉన్నాయి. ఈ చారిత్రక ప్రదేశాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. పర్యాటకులను ఆకర్షించేందుకు వ్యూ పాయింట్లను, మరియు గిరిజనులు తయారు చేసే వస్తువులను విక్రయించేందుకు ప్రత్యేక స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నారు.



