Telangana Assembly: కేసీఆర్ ప్లాన్ పై ఉత్కంఠ.. అసెంబ్లీకి మళ్లీ వస్తారా ?
Telangana Assembly: మరి కొత్త ఏడాదిలో రెండోరోజు నుంచి జరగనున్న తెలంగాణ అసెంబ్లీ(Telangana Assembly)కి కేసీఆర్ వస్తారా.. ప్రభుత్వంపై నీటిప్రాజెక్టుల అస్త్రాలతో విరుచుకుపడతారా.. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో ఇదే హాట్ టాపిక్..
Telangana Assembly
చాలా రోజుల తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ అసెంబ్లీ (Telangana Assembly)సమావేశాలకు వచ్చారు. తొలిరోజు కదా అటెండెన్స్ వేసుకుని సీఎం రేవంత్ రెడ్డి కు షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్లిపోయారు. పట్టుమని 10 నిమిషాలు కూడా సభలో లేరే అంటూ విమర్శలు వచ్చాయి. దీనికి కౌంటర్ గా అసలు కథ ముందుంది జర వెయిట్ చేయండి అంటూ గులాబీ పార్టీ కార్యకర్తలు చెబుతున్నారు.
మరి కొత్త ఏడాదిలో రెండోరోజు నుంచి జరగనున్న తెలంగాణ అసెంబ్లీ(Telangana Assembly)కి కేసీఆర్ వస్తారా.. ప్రభుత్వంపై నీటిప్రాజెక్టుల అస్త్రాలతో విరుచుకుపడతారా.. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో ఇదే హాట్ టాపిక్.. చాలా రోజుల తర్వాత ఫామ్ హౌస్ నుంచి హైదరాబాద్ కు వచ్చిన కేసీఆర్ ఇటీవల పాలమూరు, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలకు నాయకులతో మాట్లాడి శాసనసభ సమావేశాల అనంతరం బహిరంగ సభలు నిర్వహించేందుకు కూడా పిలుపునిచ్చారు. తర్వాత మీడియా సమావేశంలో ప్రాజెక్టుల అంశం ఎత్తుకోవడంతో అటు రేవంత్ సర్కారు కూడా దానిమీద చర్చకే సిద్ధమైంది.

దీంతో జనవరి 2 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో జలయుద్ధమే ప్రధాన ఎజెండా కాబోతోంది. ఈ సారి అధికార పార్టీపైకి గులాబీ బాస్ పక్కా ప్లాన్ తోనే మాటల దాడికి సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఇటీవల నిర్వహించిన ప్రెస్ మీట్ లో కేసీఆర్ చంద్రబాబునాయుడు పేరు పదేపదే ప్రస్తావిస్తూ నదీజలాల పంపిణీ విషయంలో మరొకసారి ప్రాంతీయ సెంటిమెంటును ముందుకు తెచ్చే ప్రయత్నం చేశారు.
2018లో కూడా కెసిఆర్ ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు అనే ఆయుధంతోనే ప్రజల ముందుకు వెళ్ళారు. ఇప్పుడు కూడా ఆ ఆయుధాన్నే ప్రయోగించడానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది.. అయితే 2018 నాటికీ ఇప్పటికీ పరిస్థితులు చాలా మారాయి. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి దాదాపు తొమ్మిదిన్నర సంవత్సరాలు కేసీఆర్ అధికారంలో ఉన్నారు. తెలంగాణ ఏర్పడక ముందు కేసీఆర్ ఎంపీగా నీటి ప్రాజెక్టుల గురించి పెద్దగా మాట్లాడలేదు.
దీంతో ఇటీవల ఆయన వ్యాఖ్యలను మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఖండిస్తూ మాట్లాడారు. గతంలో ఎప్పుడూ నీటి పంపకాలపై ఈ స్థాయిలో మాట్లాడని కేసీఆర్ ఇప్పుడు ప్రాంతీయవాదానికి ముడిపెడుతూ దానిని ఆయుధంగా మలుచుకునేందుకు ప్రయత్నిస్తుండడంతో దానికి కౌంటర్ ఇవ్వాలని కాంగ్రెస్ కూడా పట్టుదలతో ఉంది.
అయితే ఈ శాసనసభ సమావేశాల్లో తెలంగాణకు అత్యంత అవసరమైన నది జలాల పంపిణీలో ఎవరి పాత్ర ఎంత అన్న విషయంలో… ఏ మేరకు చర్చ జరుగుతుందో అన్నది చూడాలి. ప్రెస్ మీట్స్‌లో కాదు అసెంబ్లీకి రండి డిస్కస్ చేద్దామంటూ సవాల్ విసిరిన సీఎం రేవంత్ ఆటకట్టించేందుకు లేదా ఫేస్ చేసేందుకు కేసీఆర్ మళ్లీ వస్తారా… వస్తే ఎలాంటి మాటల తూటాలు పేలుస్తారో అన్న ఆసక్తి అందరిలోనూ ఉంది.



