Amaravati: అప్పుడు మై బ్రిక్, మై అమరావతి..ఇప్పుడు డొనేట్ ఫర్ అమరావతి..
Amaravati: అమరావతి నిర్మాణంలో ప్రజల భాగస్వామ్యం.. రాజధాని కోసం విరాళాల వెబ్‌సైట్

Amaravati
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధాని అమరావతి నిర్మాణం కోసం ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాజధాని అభివృద్ధిలో ప్రజలందరినీ భాగస్వాములను చేయాలనే ఉద్దేశంతో “అమరావతి కోసం విరాళం ఇవ్వండి” (Donate for Amaravati) అనే పేరుతో కొత్త డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా ప్రజలు తమకు వీలైనంత సహాయం నేరుగా అందించవచ్చు.
రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (CRDA) యొక్క అధికారిక వెబ్‌సైట్ అయిన crda.ap.gov.in లో ఈ కొత్త విరాళాల విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఈ విభాగంలో QR కోడ్ ను ఉపయోగించి చాలా సులభంగా విరాళాలు ఇవ్వవచ్చు. ఏ విధమైన ఇబ్బందులు లేకుండా, డిజిటల్ పద్ధతిలో విరాళాలు స్వీకరించేలా ఈ వ్యవస్థను రూపొందించారు. విరాళం ఇచ్చిన మొత్తం నేరుగా CRDA ఖాతాలోకి జమ అవుతుంది, దీంతో ప్రక్రియలో పూర్తి పారదర్శకత ఉంటుంది.
అమరావతి (Amaravati) నిర్మాణం కోసం ప్రజల భాగస్వామ్యాన్ని కోరడం ఇది మొదటిసారి కాదు. గతంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో 2015లో ప్రారంభించిన “మై బ్రిక్, మై అమరావతి” కార్యక్రమం దేశవ్యాప్తంగా, ముఖ్యంగా ప్రవాసాంధ్రుల నుండి అద్భుతమైన స్పందన పొందింది. ఆ సమయంలో ఒక్కో ఇటుకకు రూ.10 చొప్పున విరాళాలు సేకరించారు. ప్రజలు, సంస్థలు పెద్ద ఎత్తున ముందుకు వచ్చి ఈ నిర్మాణంలో భాగమయ్యారు.
ఇప్పుడు కొత్తగా తీసుకువచ్చిన ఈ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ద్వారా ఎటువంటి పేపర్‌వర్క్ లేకుండానే ప్రజలు తమ విరాళాలను అందించవచ్చు. ఈ వ్యవస్థ ప్రజల మద్దతుతో అమరావతిని నిర్మించాలనే ప్రభుత్వ సంకల్పానికి మరింత బలం చేకూరుస్తుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది. కుల, మత, వర్గాలకు అతీతంగా ప్రజలందరి సహకారంతో రాజధాని నిర్మాణం పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

విరాళం ఇవ్వాలనుకుంటే…
- ముందుగా crda.ap.gov.in వెబ్‌సైట్‌కి వెళ్లాలి.
- అక్కడ కనిపించే “Donate for Amaravati” అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
- యూపీఐ క్యూఆర్ కోడ్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.
- మీ ఫోన్‌లోని UPI యాప్ ద్వారా ఆ కోడ్‌ను స్కాన్ చేయాలి.
- మీరు ఇవ్వాలనుకున్న విరాళం మొత్తాన్ని ఎంటర్ చేసి, UPI PIN నమోదు చేస్తే లావాదేవీ పూర్తవుతుంది.
- ఈ మొత్తం నేరుగా CRDA ఖాతాలోకి జమ అవుతుంది.
ఈ కొత్త డిజిటల్ వ్యవస్థ ద్వారా అమరావతి నిర్మాణంలో ప్రతి ఒక్కరూ తమ వంతు భాగస్వామ్యం అందించే అవకాశం కల్పించింది.
Also Read: Army rally : ఆగస్ట్ 5 నుంచే కాకినాడలో ఆర్మీ ర్యాలీ.. 15 వేలకు పైగా యువత సిద్ధం
One Comment