Angkor Wat : జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిన అంకోర్ వాట్.. సూర్యోదయ వేళ ఆ దృశ్యాన్ని అస్సలు మిస్ అవ్వొద్దు
Angkor Wat : సియెం రీప్ టూర్లో వాతావరణం నవంబర్ నుంచి ఫిబ్రవరి నెలల మధ్య సమయం ఈ నగర సందర్శనకు మరింత అనుకూలంగా మారుతుంది.
Angkor Wat
ప్రపంచంలోనే అద్భుతమైన, అతి పెద్ద చారిత్రక నిర్మాణాలలో అంకోర్ వాట్(Angkor Wat) ఒకటి. కంబోడియాలోని సియెం రీప్ సిటీకి కాస్త దూరంలో ఉండే ఈ పురాతన ఆలయం ప్రతి ఏడాది లక్షలాది మంది ప్రపంచ పర్యాటకులను ఆకట్టుకుంటోంది. ఖ్మేర్ చక్రవర్తుల అద్భుత శిల్పకళా నైపుణ్యానికి, హిస్టరీకి సాక్ష్యంగా నిలిచే ఈ కట్టడం యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా కూడా గుర్తింపు పొందింది.
ఈ విజ్ఞానంతో కూడిన అద్భుతాన్ని 12వ శతాబ్దంలో ఖ్మేర్ సామ్రాజ్యానికి చెందిన ప్రసిద్ధ రాజు సూర్యవర్మన్-II నిర్మించినట్లు చరిత్ర చెబుతుంది. ప్రారంభంలో ఇది శ్రీమహావిష్ణువుకు అంకితం చేయబడిన మహా హిందూ ఆలయంగా రూపు దిద్దుకుంది. ఆ తర్వాతి కాలంలో మెల్లగా ప్రాచుర్యం పొందుతూ బౌద్ధ ఆరాధనా కేంద్రంగా పరిణామం చెందింది. ఆకాశాన్ని తాకాయా అన్నట్లుండే ఐదు ప్రధాన గోపురాలు, విశాలమైన ప్రాకారాలతో పాటు గోడలపై చెక్కిన అపురూప శిల్పాలు ఈ దేవాలయానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి.
అంకోర్ వాట్(Angkor Wat) వద్ద సూర్యోదయ ఘట్టాన్ని చూడటం పర్యాటకులకు జీవితంలో మర్చిపోలేని ఒక మధురానుభూతి. తెల్లవారుజామున చీకట్లు వీడుతున్న వేళ, ఆలయ ప్రధార గోపురాల వెనుక నుంచి మెల్లగా సూర్యభగవానుడు పైకి వస్తుంటే పక్కనే ఉన్న దిగుడు బావులు, నీటి కుంటల్లో పడే ఆ ప్రతిబింబం చూడటానికి ఎవరికీ రెండు కళ్లూ సరిపోవంటే అది అతి శయోక్తి కాదు. ఇలాంటి అద్బుత దృశ్యాన్ని తమ కెమెరాలలో బంధించడానికి ఫోటోగ్రాఫర్లతో పాటు సందర్శకులు కూడా పోటీ పడుతుంటారు.
అలాగే సియెం రీప్ టూర్లో కేవలం అంకోర్ వాట్ మాత్రమే కాకుండా దగ్గరలో ఉన్న అంకోర్ థామ్, బయోన్ దేవాలయం , టా ప్రోమ్ వంటి ఇతర చారిత్రక ప్రదేశాలను కూడా తప్పక సందర్శించాలి. ముఖ్యంగా టా ప్రోమ్ ఆలయంలో స్టోన్ వాల్స్‌ను చుట్టుముట్టి ఆవరించిన రావి, మర్రి వృక్షాల భారీ వేర్లు చూసేవారికి వింతైన, అద్భుతమైన అనుభూతిని కలిగిస్తాయి.
ఇక్కడి వాతావరణం నవంబర్ నుంచి ఫిబ్రవరి నెలల మధ్య నగర సందర్శనకు మరింత అనుకూలంగా మారుతుంది.అయితే ఇక్కడికి వెళ్లే ప్రయాణికులు కొన్ని ముఖ్యమైన విషయాలను తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి.

ఇవి పవిత్రమైన ఆధ్యాత్మిక ప్రదేశాలు కాబట్టి భుజాలతో పాటు, మోకాళ్లు పూర్తిగా కప్పేలా గౌరవప్రదమైన బట్టలు ధరించాలి. చాలా దూరం నడవాల్సి ఉంటుంది కాబట్టి సౌకర్యవంతమైన వాకింగ్ షూస్ వాడటం, ఎండ దెబ్బ తగలకుండా మంచి నీళ్ల బాటిల్స్ వంటి వాటిని వెంట ఉంచుకోవడం మంచిది. అంతేకాకుండా ఈ మహాద్భుత నగరాన్ని పూర్తిగా ఆస్వాదించాలంటే కనీసం 2 నుంచి 3 రోజుల సమయం కేటాయించుకుని వెళ్లడం మంచిది.
మొత్తానికి ప్రాచీనమైన సంస్కృతి, హిందూ-బౌద్ధ చారిత్రక సంపద, అద్భుత శిల్పకళను ఒకేచోట చూడాలనుకునే పర్యాటకులకు కంబోడియాలోని సియెం రీప్, అంకోర్ వాట్ ఒక కలల గమ్యస్థానం అనే చెప్పాలి. ప్రాచీన ఖ్మేర్ నాగరికత వైభవాన్ని కళ్ల ముందే నిలిపే ఈ ఆధ్యాత్మిక ప్రదేశం ప్రతి ఒక్కరి ట్రావెల్ బకెట్ లిస్ట్‌లో తప్పక ఉండాలి.
Date Of Birth : ఈ నెంబర్ వారికి కొత్త అవకాశాలు తలుపు తడతాయి.. వీరికి మాత్రం ఆటంకాలు





