Silence Fails Relationships : గొడవలు కావు, మౌనమే బంధాలను తెంపేస్తోంది..సైలెన్స్ గోడలు బద్దలు కొట్టే లైఫ్ హాక్స్
Silence Fails Relationships : కొన్నిసార్లు మనం చేసిన తప్పుల కంటే, చేయాల్సిన టైమ్‌లో చేయకుండా వదిలేసే పనులే రిలేషన్‌ను పూర్తిగా దూరం చేస్తాయి.
Silence Fails Relationships
ప్రతీ రిలేషన్షిప్లో కూడా అభిప్రాయ భేదాలు రావడం, గొడవ పడటం చాలా సాధారణమైన విషయం. కానీ చాలామంది అనుకుంటున్నట్లు గొడవలే బంధాలను తెంచేయవు. అసలు సమస్యల్లా గొడవ ముగిసాక ఇద్దరి మధ్య అలుముకునే సైలెన్స్‌తోనే బంధం తెగడం మొదలవుతుంది. ఆ నిశ్శబ్దాన్ని బ్రేక్ చేసి, మళ్లీ సంభాషణను ఎలా మొదలుపెట్టాలో తెలియకపోవడంతోనే ఎన్నో మంచి బంధాలు ముగిసిపోతుంటాయి.
గొడవ పడటమనేది ఇద్దరి వ్యక్తులు వ్యక్తపరిచే ఫీలింగ్స్ మాత్రమే, కానీ గొడవ తర్వాత వచ్చే సైలెన్స్ ఇద్దరి మధ్య ఒక పెద్ద భావోద్వేగ గోడనే కట్టేస్తుంది. కాలం గడిచిన కొద్దీ ఆ గోడ మరింత ఎత్తు పెరిగిపోతుంది. ఇద్దరు మనుషులు మాట్లాడుకోవడం ఆపేసినప్పుడు.. ఎదుటివారు ఏం ఆలోచిస్తున్నారో అనుకుంటే ఇవతలి వారు తమకు తోచినట్లు ఊహించుకోవడం స్టార్ట్ చేస్తారు. తనకు నేనంటే ఇక ప్రేమే లేదని ఒకరు, తను నన్ను అర్థం చేసుకునే మూడ్‌లోనే లేరని మరొకరు ఆలోచిస్తుంటారు. ఈ నెగిటివ్ ఆలోచనలు వారిద్దరి మధ్య ఉన్న దూరాన్ని మరింత పెంచుతాయి.
నిజానికి చాలామందికి తమ మధ్య చెరిగిపోయిన రిలేషన్‌ను నిలబెట్టుకోవాలనే ఉంటుంది, కానీ ఈగో అలాగే రిజెక్షన్ భయం వారిని ముందుకు పోనివ్వవు. నేనే ఎందుకు తగ్గాలని కొందరు.. నేనే ఎందుకు ఫస్ట్ మాట్లాడాలని మరికొందరు ఈగోకు పోతారు. నేను మాట్లాడితే తను సరిగ్గా స్పందించకపోతే పరిస్థితి ఏంటనే భయం ఇంకోవైపు వారిని ఆపేస్తుంది. ఇక్కడ సమస్య వారిద్దరి మనసులో ప్రేమ లేకపోవడం కాదు, ఆ సంభాషణను మళ్లీ ఎలా రీస్టార్ట్ చేయాలో తెలీకపోవడమే అంటారు సైకాలజిస్టులు. మనం సంభాషణను మొదలుపెట్టే విధానమే ఆ రిలేషన్ నిలుస్తుందో లేదో నిర్ణయిస్తుందని చెబుతారు.
ఉదాహరణకు నీ కోపం ఇంకా తగ్గలేదా అనో, లేదంటే నువ్వు ఆ రోజు అన్న మాటలకు నువ్వు నన్ను సారీ అడగాలనో మాట్లాడితే అది మళ్లీ పాత గొడవను రాజేస్తుంది. అలా కాకుండా మన మధ్యనున్న ఈ గ్యాప్ నాకు నచ్చడం లేదని.. మనం కాసేపు మాట్లాడుకుందామా అని అనడమో లేదంటే ఆ రోజు గొడవ అంత పెద్దది అవ్వడంలో నా వైపున్న తప్పుకు నేను సారీ చెప్తున్నానని స్టార్ట్ చేస్తే ఎదుటివారు వెంటనే కరిగిపోతారు.

అంటే ఇక్కడ ఎవరు గెలిచారనే పాయింట్ పక్కన పెట్టి, బంధాన్ని కాపాడుకోవడానికే మొదటి ప్రాధాన్యత ఇవ్వడం అనేది ఇంపార్టెంట్. ఒకవేళ మాటలతో చెప్పడం కష్టంగా అనిపించినట్లయితే .. వారికి నచ్చిన స్నాక్స్ కొనివ్వడం, లేదంటే వారి పక్కకు వెళ్లి ప్రశాంతంగా కూర్చోవడం వంటి చిన్న చిన్న పనులు (Non-verbal gestures) కూడా నేను మాట్లాడటానికి రెడీగా ఉన్నాననే పాజిటివ్ సిగ్నల్‌ని అందిస్తాయి.
ఒక మనిషిని కోల్పోవడానికి అన్నిసార్లు మోసం చేయాల్సిన అవసరమే లేదు. కొన్నిసార్లు సరైన కమ్యూనికేషన్ లేకపోవడం, కేర్ తీసుకోకపోవడం , గౌరవం ఇవ్వకపోవడం వల్ల కూడా బంధాలు విడిపోతాయి(Silence Fails Relationships). కొన్నిసార్లు మనం చేసిన తప్పుల కంటే, చేయాల్సిన టైమ్‌లో చేయకుండా వదిలేసే పనులే రిలేషన్‌ను పూర్తిగా దూరం చేస్తాయి. కాబట్టి ఈగోలను పక్కన పెట్టి మౌనాన్ని వీడితే మీ రిలేషన్‌షిప్‌కి ఎలాంటి ఢోకా ఉండదు.
Self Identity : క్రౌడ్‌తో పాటు కొట్టుకుపోతున్నారా? మీ ఓన్ ఐడెంటిటీని కాపాడుకోలేకపోతున్నారా?





