Story Day:నేషనల్ టెల్ ఏ స్టోరీ డే.. తరాలను కలిపే మధుర జ్ఞాపకం..మనసుల్ని పలకరించే అక్షర రూపం
Story Day: ఒక కథ చెబుతున్నప్పుడు మన ఊహల రెక్కలు ఒక్కసారిగా విప్పుకుంటాయి, ఆ ఊహలే మన జీవితాంతం తోడుంటాయి.
Story Day
కథలు వినడం అందరికీ ఇష్టమే. ఎంత మారాం చేసిన పిల్లలు అయినా నీకూ కథ చెబుతాను రా అంటే వెంటనే కామ్ అయిపోవడం చూస్తూనే ఉంటాం. చిన్నప్పుడు అమ్మ చెప్పిన చందమామ కథలు, అమ్మమ్మ, నాన్నమ్మ వినిపించిన పురాణ గాథలు, నాన్న చెప్పే రియల్ స్టోరీలు మన జీవితంపై చెరగని ముద్ర వేస్తూనే ఉంటాయి. అలా ఈరోజును అంటే ఏప్రిల్ 27వ తేదీని ‘నేషనల్ టెల్ ఏ స్టోరీ డే(Story Day)గా జరుపుకోవడంతో ఎన్నో తరాలు ఆ మధుర జ్ఞాపకాలలోకి ఒక్కసారిగా వెళుతున్నారు.
వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా వీలయితే ఒకచోట చేరి తమ అనుభవాలను, ఊహలను, జ్ఞాపకాలను కథల రూపంలో పంచుకోవడమే ఈ రోజు ముఖ్య ఉద్దేశంగా అమెరికాలో నేషనల్ టెల్ ఏ స్టోరీ డే ను ప్రారంభించారు . ఒక పుస్తకాన్ని చూసి చదవడం అయినా, సొంతంగా కథను సృష్టించి చెప్పడం అయినా.. రూపం ఏదైనా కావచ్చు, కానీ ఆ కథ వెనుక ఉండే భావం మాత్రం అందరి మనసులను దగ్గర చేస్తుంది.
పూర్వం నుంచి జ్ఞానాన్ని, ఆసక్తిని,జీవిత పాఠాలను ఒక తరం నుంచి మరొక తరానికి చేరవేసే అద్భుతమైన సాధనం కథలే అంటే ఎవరూ కాదనలేరు. కుటుంబ సంప్రదాయాలు, చరిత్రలో ఏళ్ల తరబడి చెప్పుకునే జానపద గాథలు మన మూలాలను గుర్తు చేస్తూనే ఉంటాయి. కథల నుంచి కేవలం వినోదాన్ని మాత్రమే కాదు, జీవిత పాఠాలను కూడా నేర్చుకున్నవారు ఎంతోమంది ఉన్నారు.
నిజానికి ఒక మంచి స్టోరీ టెల్లర్కు తెలిసిన రహస్యం ఏంటంటే, ప్రపంచంలోని గొప్ప కథలన్నీ మన నిజ జీవిత అనుభవాల నుంచే పుడతాయని తెలుసుకోవడమే. మన చుట్టూ జరిగే చిన్న చిన్న సంఘటనలను మరింత ఆసక్తికరంగా చెప్పగలిగితే చాలు, అవి వినేవారి మనసులో ఎప్పటికీ నిలిచిపోతాయన్న విషయం వారికి బాగా తెలుసు.
నేషనల్ టెల్ ఏ స్టోరీ డే(Story Day)లో ముఖ్యమైన విషయం ఏంటంటే.. చిన్న పిల్లల నుంచి ముసలివారి వరకు అందరూ దీనిలో భాగస్వాములు కావచ్చు. తాతా- మనవళ్లు, అమ్మమ్మ-మనవరాళ్లు ఒకచోట కూర్చుని ఒకరి కథలు ఒకరు వినడం వల్ల వారి మధ్య అనుబంధం మరింత బలపడుతుంది. పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడం వల్ల గతానికి, వర్తమానానికి ఒక వంతెన ఏర్పడినట్లు అవుతుంది.
కథ అంటే కేవలం కాలక్షేపం కాదు, పిల్లల్లో క్రియేటివిటీని, ఊహాశక్తిని పెంచుతుంది. సొసైటీలో రోజురోజుకు బంధాలు బలహీనపడుతున్న ఇలాంటి సమయంలో , ఇలా కథలు వినడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య ఆత్మీయత పెరిగి, అందరినీ ఒక తాటిపైకి వచ్చేలా చేస్తాయి.

అంతేకాదు కథలు చెప్పడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. భావ వ్యక్తీకరణలో కావాల్సినంత క్లారిటీ వస్తుంది. ఒక కథ చెబుతున్నప్పుడు మన ఊహల రెక్కలు ఒక్కసారిగా విప్పుకుంటాయి, ఆ ఊహలే మన జీవితాంతం తోడుంటాయి.
కాబట్టి ఈ రోజును కేవలం ఒక క్యాలెండర్ డే లా కాకుండా, మనసుల్ని పలకరించే అక్షర రూపాన్ని గుర్తుకు తెచ్చుకుని, మన ప్రియమైన వారితో గడిపే ఒక అద్భుతమైన అవకాశంగా మార్చుకోండి. మీ దగ్గర ఉన్న ఒక పాత పుస్తకాన్ని తీయండి లేదంటే మీ చిన్ననాటి జ్ఞాపకాన్ని గుర్తు చేసుకుని దానినే ఒక ఒక కథగా చెప్పడం మొదలుపెట్టండి.
Carnivore Diet:కార్నివోర్ డైట్ అంటే ఏంటి? కేవలం మాంసాహారం తింటే బరువు తగ్గుతారా?





