Carnivore Diet:కార్నివోర్ డైట్ అంటే ఏంటి? కేవలం మాంసాహారం తింటే బరువు తగ్గుతారా?
Carnivore Diet: కార్నివోర్ డైట్ వల్ల బరువు తగ్గడం వెనుకున్న అసలు రహస్యం క్యాలరీలను కంట్రోల్ చేయడం మాత్రమే.
Carnivore Diet
ఇప్పుడు హెల్త్, న్యూట్రిషన్ అనేది ఒక పెద్ద మార్కెటింగ్ స్కామ్‌లా మారిపోయింది. సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్లు ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఓవర్‌లోడ్ వల్ల ఏది నిజమో, ఏది కాదో తెలియని పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా కొన్ని నెలల నుంచి గూగుల్ సెర్చ్‌లలో టాప్‌లో ఉన్న ..కార్నివోర్ డైట్ గురించి ఇప్పుడు అందరూ కూడా చర్చించుకుంటున్నారు.
కార్నివోర్ డైట్(Carnivore Diet) అంటే కేవలం జంతు సంబంధిత ఆహారాలైన మాంసం, చేపలు, గుడ్లు, పాల పదార్థాలను మాత్రమే తీసుకోవడం అన్నమాట. ఈ డైట్లో కూరగాయలు, ధాన్యాలు, గింజలు, విత్తనాలను తినే ఫుడ్ నుంచి పూర్తిగా తొలగించాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల శరీరంలోని ప్రమాదకరమైన ఫ్యాట్ తగ్గుతుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
అయితే, కార్నివోర్ డైట్(Carnivore Diet) వల్ల కేవలం మొండి కొవ్వు (విసెరల్ ఫ్యాట్) మాత్రమే తగ్గుతుందనడానికి..సైంటిఫిక్‌గా పరిమితమైన ఆధారాలు మాత్రమే ఉన్నాయని పోషకాహార నిపుణులు క్లారిటీ ఇస్తున్నారు. కార్బోహైడ్రేట్లు తీసుకోకపోవడం వల్ల ఇన్సులిన్ స్థాయిలు స్థిరంగా ఉండి, బాడీలోని నీటి శాతం తగ్గిపోవడం వల్ల స్టార్టింగ్‌లో వెయిట్ తగ్గినట్లు అనిపిస్తుంది.
కానీ ఈ డైట్ బాడీలోని మొత్తం కొవ్వు మీద ప్రభావం చూపిస్తుంది తప్ప, కేవలం మొండి కొవ్వును మాత్రమే టార్గెట్ చేయదు. నిజానికి ఈ డైట్ వల్ల బరువు తగ్గడం వెనుకున్న అసలు రహస్యం క్యాలరీలను కంట్రోల్ చేయడం మాత్రమే. మాంసాహారంలో ప్రోటీన్ ఎక్కువగా ఉండటం వల్ల కడుపు త్వరగా నిండినట్లు అనిపించి, తక్కువ ఆహారం తీసుకుంటారు. ఇది మన ఆహారపు అలవాట్ల మార్పు వల్ల వచ్చే మార్పు తప్ప, కార్నివోర్ డైట్లో ఏదో అద్భుతం ఉందని మాత్రం కాదంటున్నారు నిపుణులు.
అంతేకాదు అతిగా మాంసాహారం తీసుకోవడం వల్ల కలిగే దీర్ఘకాలిక నష్టాలు ఎక్కువ ఉంటాయి. మొక్కల నుంచి లభించే ఫైబర్ (పీచు పదార్థం) లేకపోవడం వల్ల పేగు ఆరోగ్యం ఎక్కువగా దెబ్బతింటుంది. జీర్ణవ్యవస్థలోని సూక్ష్మజీవులు ఆరోగ్యంగా ఉండాలంటే అన్నిరకాల ఆహారాలు తీసుకోవడం చాలా అవసరం.
కేవలం నాన్ వెజ్‌కే పరిమితమవ్వడం వల్ల చెడు కొలెస్ట్రాల్ (LDL) పెరిగి, గుండె జబ్బుల ముప్పు పెరుగుతుంది. అలాగే విటమిన్-సి, యాంటీ ఆక్సిడెంట్ల లోపం కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది. గర్భిణీలు, పాలిచ్చే తల్లులు , ఇప్పటికే కిడ్నీ లేదా కాలేయ సమస్యలు ఉన్నవారు ఈ డైట్ చేయడానికి అస్సలు ప్రయత్నించకూడదు. థైరాయిడ్ అలాగే తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నవారు కూడా ఇటువంటి ఎక్స్ట్రీమ్ డైట్ల వల్ల మరింత ఇబ్బంది పడే ప్రమాదం ఉంటుంది.

పర్మనెంట్‌గా, హెల్దీగా వెయిట్ తగ్గడం కోసం కార్నివోర్ డైట్ కంటే ఇంకా మంచి ప్రత్యామ్నాయాలు చాలానే ఉన్నాయి. కేవలం మాంసాహారం మీద ఆధారపడకుండా, ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్ , లీన్ ప్రోటీన్ కలిపిన మెడిటరేనియన్ డైట్ వంటివి మొండి కొవ్వును తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తాయని నిపుణులు చెబుతున్నారు.
రక్తంలోని గ్లూకోజ్ లెవెల్స్‌ను స్థిరంగా ఉంచుకోవడం, నాణ్యమైన నిద్ర, క్రమం తప్పకుండా చేసే వ్యాయామం ద్వారానే నిజమైన ఫిట్నెస్ లభిస్తుంది. కార్నివోర్ డైట్‌ను అనుసరించాలనుకునే వారు కూడా దానిలో కొన్ని మార్పులు చేసుకోవడం మంచిది. పూర్తిగా కార్బోహైడ్రేట్లు మానేయకుండా, తక్కువ క్వాంటిటీలలో కూరగాయలు, పండ్లు తీసుకుంటూ మాంసాహారాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఫుడ్ తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల డైట్ అనేది కష్టంగా కాకుండా, ఆరోగ్యానికి మేలు చేసే ఒక లైఫ్ స్టైల్‌గా మారుతుంది.





