Just LifestyleLatest News

Reactive Abuse:రియాక్టివ్ అబ్యూస్ అంటే ఏంటి? మీరూ బాధితులేనా?

Reactive Abuse : ఎదుటి వ్యక్తిని అంతలా రెచ్చగొట్టేలా చేసింది ఎవరనేది ఎవరూ గమనించరు. కానీ బాధితులు తట్టుకోలేక అనే మాటలు మాత్రం అందరికీ కనిపిస్తాయి.

Reactive Abuse

కొంతమంది పదే పదే తమ మాటలతో, చేతలతో ఎదుటివారిని చిన్నచూపు చూస్తున్నట్లుగా , అవకాశం దొరికినప్పుడల్లా అవమానిస్తూ ఉంటారు.అయితే ఇలాంటి సమయాల్లో అవతలి వ్యక్తి ఎంత భరించినా, ఒకానొక దశలో ఓపిక నశించి గట్టిగా అరవడం, ఎదురు తిరగడం చేస్తారు. సరిగ్గా ఆ క్షణం కోసమే ఎదురుచూసే అవతలి వ్యక్తి(Abuser), వెంటనే తను చేసిన తప్పులన్నిటినీ పక్కన పెట్టి, ఎదుటి వ్యక్తి ప్రవర్తనను భూతద్దంలో చూపించడానికి రెడీ అయిపోతారు.

చూశారా తను ఎంత కోపిష్టో.. నన్ను ఎలా తిడుతున్నారో అంటూ అందరి ముందు బాధితులుగా మారడానికి రెడీ అయిపోతారు. దీనినే ‘రియాక్టివ్ అబ్యూస్’ అంటారు. సింపుల్‌గా చెప్పాలంటే రియాక్టివ్ అబ్యూస్’ (Reactive Abuse)అంటే ఒక వ్యక్తిని రెచ్చగొట్టి, ఆ వ్యక్తి సహనం కోల్పోయి రియాక్ట్ అయినపుడు, ఆ స్పందననే తప్పుగా చూపిస్తూ వారిని నిందించడం అన్నమాట.

ఇక్కడ అసలు విషయం ఏంటంటే, ఎదుటి వ్యక్తిని అంతలా రెచ్చగొట్టేలా చేసింది ఎవరనేది ఎవరూ గమనించరు. వేధించే వ్యక్తి చాలా తెలివిగా, ఎవరికీ తెలియకుండా సూటిపోటి మాటలతో మానసిక దాడి చేస్తారు. కానీ బాధితులు తట్టుకోలేక అనే మాటలు మాత్రం అందరికీ కనిపిస్తాయి. అంతేకాదు చివరకు సొసైటీ కూడా అతను లేదా ఆమె అలా ప్రవర్తించి ఉండాల్సింది కాదని బాధితులనే తప్పుబడుతుంది. ఇది బాధితులని మరింత కుంగదీస్తుంది. నిజంగా తానే తప్పు చేశానేమో అన్న ఆత్మన్యూనత భావానికి గురి అయ్యేలా చేస్తుంది.

సైకాలజీ చెబుతున్నదాని ప్రకారం, ఇలా రెచ్చగొట్టే వ్యక్తులు ఇతరుల భావోద్వేగాలతో ఆడుకోవడంలో బాగా ఆనందాన్ని పొందుతారు. దీనిని DARVO టెక్నిక్ లో భాగంగా కూడా చూడొచ్చు. అంటే తప్పును తిరస్కరించడం (Deny), ఎదురు దాడి చేయడం (Attack), చివరకు తప్పు చేసిన వారే బాధితులుగా మారిపోవడం (Reverse Victim and Offender) అన్నమాట. దీనివల్ల అసలు సమస్య పక్కకు పోయి, బాధితుల కోపం కానీ ప్రవర్తన కానీ అందరిలో చర్చనీయాంశం అవుతుంది.

Reactive Abuse
Reactive Abuse

దీని నుంచి బయటపడాలంటే, ముందుగా మనం రియాక్టివ్ అబ్యూస్ వలలో చిక్కుకున్నామని గుర్తించాలి. ఒక్కోసారి గుర్తించేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. అందుకే ఎదుటి వ్యక్తి అలాంటి మైండ్ సెట్ కలవారని ముందే తెలుసుకుని.. వారు మనల్ని కావాలనే రెచ్చగొడుతున్నారని తెలుసుకోవాలి. అలాంటపుడే మనం స్పందించే తీరుపై కంట్రోల్ కలిగి ఉండేలా చేసుకోగలం.

ఎందుకంటే ఎప్పుడూ కూడా మన కోపాన్ని , బాధను ఎదుటి వారు ఆయుధంగా వాడుకోకుండా చూసుకోవాలి. అలాంటి వ్యక్తులతో వాదించడం కంటే, మౌనంగా వారి నుంచి దూరం జరగడమే మన మానసిక ఆరోగ్యానికి మంచిదన్న విషయాన్ని గ్రహించాలి. ఇలా నిందలు వేసే వాళ్లు మన బంధువులైనా, స్నేహితులైనా మన సెల్ఫ్ రెస్పెక్ట్ కంటే ఏదీ ఎక్కువ కాదని గుర్తించాలి.

Delimitation Bill : ఇకపై 543 కాదు 850 సీట్లు…డీలిమిటేషన్ పై కేంద్రం ప్రతిపాదనలు

Related Articles

Back to top button