Gold Monetization Scheme: మళ్లీ తెరపైకి గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్..అసలేంటీ స్కీమ్? అప్పుడెందుకు ఆగింది?
Gold Monetization Scheme: బంగారం దిగుమతి సుంకం పెంపు, కరెంట్ అకౌంట్ లోటు నేపథ్యంలో ప్రధాని మోదీ బంగారం కొనుగోళ్లు వాయిదా వేయాలని సూచించారు. దీంతో గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ (GMS)కు ప్రాధాన్యం పెరిగింది
Gold Monetization Scheme
భారతదేశంలో అకేషన్ ఏదయినా సరే బంగారం కొనడం అనేది ఒక సెంటిమెంట్,సాంప్రదాయం అనేలా జనాలు గోల్డ్ కొంటూ ఉంటారు. అటువంటిది ఒక ఏడాది పాటు బంగారం కొనడం ఆపేయాలని స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు ఇటీవల విజ్ఞప్తి చేయడం హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే.
ఇరాన్, అమెరికా రెండు దేశాల మధ్య నడుస్తున్న ఉద్రిక్తతల వల్ల భారత దేశ విదేశీ మారక నిల్వలను కాపాడుకోవడానికి, అలాగే అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి విలువ పడిపోకుండా ఉండటానికి ప్రధానమంత్రి మోదీ ఈ వినూత్నమైన పిలుపునిచ్చారు.
అయితే భారతీయులు తమ సంపాదనలో చాలా భాగాన్ని బంగారంపైనే ఇన్వెస్ట్ చేస్తుంటారు. దీంతో మోదీ ప్రతిపాదనపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మరోవైపు ఈ నిర్ణయం వల్ల దేశంలోని సుమారు మూడున్నర కోట్ల మంది జ్యువెలరీ, స్వర్ణకారుల జీవనోపాధి దెబ్బతింటుందని వ్యాపార వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
ఇదే సమయంలో రూపాయిని బలోపేతం చేస్తూనే, పసిడి దిగుమతులను తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం గోల్డ్ మానిటైజేషన్ పాలసీ(Gold Monetization Scheme) అనే స్మార్ట్ ప్లాన్‌తో ముందుకు వస్తుంది. మన ఇళ్లు, లాకర్లలో వాడకుండా పడి ఉన్న బంగారాన్ని బయటకు తీసి, దాని ద్వారానే ప్రజలకు వడ్డీ వచ్చేలా చేయడం ఈ స్కీమ్ ముఖ్య ఉద్దేశంగా తెలుస్తోంది.
ప్రస్తుతం భారతదేశంలో అందరి ఇళ్లలో సుమారు ముప్పై వేల టన్నుల బంగారం నిల్వలు ఉన్నట్లు ఒక అంచనా. దీనిలో కనీసం పది గ్రాముల బంగారం ఉన్నవారైనా సరే బ్యాంకులో డిపాజిట్ చేసుకోవచ్చు. దీనిపై ఏటా రెండు నుంచి రెండున్నర శాతం వరకు ఇంట్రస్ట్ ఇస్తారు. ఈ పాలసీ ద్వారా ప్రజల నుంచి ఒక రెండు వేల టన్నుల బంగారం బ్యాంకుల్లోకి వస్తే, రాబోయే మూడేళ్ల వరకు మన దేశానికి విదేశాల నుంచి అసలు బంగారం దిగుమతి చేసుకోవాల్సిన అవసరమే ఉండదని ఆర్థిక నిపుణులు లెక్కేస్తున్నారు.
నిజానికి ఈ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్(Gold Monetization Scheme) కొత్తదేమీ కాదు. కేంద్ర ప్రభుత్వం దీనిని 2015లోనే తీసుకువచ్చింది. కానీ, ప్రజల నుంచి ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాకపోవడం, అలాగే కొన్ని టెక్నికల్ రీజన్స్ వల్ల గతేడాది అంటే 2025 మార్చిలో దీనిలోని లాంగ్ టర్మ్ డిపాజిట్ ఆప్షన్లను ఆపేసి.. కేవలం షార్ట్ టర్మ్ డిపాజిట్లను మాత్రమే ఉంచారు.
అప్పట్లో జ్యువెలరీ రూపంలో ఉన్న బంగారాన్ని కరిగించి బిస్కెట్లుగా మార్చడానికి ప్రజలెవరూ పెద్దగా ఇష్టపడలేదు. ఆ సెంటిమెంట్ అడ్డు రావడం వల్లే గతంలో ఈ స్కీమ్ సక్సెస్ కాలేదు. అయితే, ఇప్పుడు అంతర్జాతీయంగా యుద్ధ వాతావరణం ఉండటంతో పాటు, దేశ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెరుగుతుండటంతో కొన్ని కొత్త మార్పులు చేసి, ప్రజలకు మరింత లాభదాయకంగా ఉండేలా ఈ పాలసీని తీసుకువస్తున్నారు.
ఈ స్కీమ్ వర్కింగ్ ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. ప్రజలు తమ బంగారాన్ని గుర్తింపు పొందిన టెస్టింగ్ సెంటర్లకు తీసుకెళ్లాలి. అక్కడ వాళ్లు మన ముందే ఆ జ్యువెలరీని కరిగించి, అందులో ఉన్న రాళ్లను వేరు చేసి, కేవలం ప్యూర్ గోల్డ్‌ను మాత్రమే బిస్కెట్లుగా కానీ బార్లుగా కానీ మారుస్తారు.

ఆ పుత్తడి స్వచ్ఛతను 99.5 ఫైన్ నెస్ లెక్కగట్టి మనకు వాళ్లు ఒక అఫీషియల్ సర్టిఫికేట్ ఇస్తారు. ఆ సర్టిఫికేట్‌ను బ్యాంకులో సబ్మిట్ చేస్తే.. అప్పుడు బ్యాంక్ మన పేరు మీద గోల్డ్ డిపాజిట్ అకౌంట్ ఓపెన్ చేసిస్తుంది. ఒకటి నుంచి మూడు సంవత్సరాల టెంపరరీ డిపాజిట్లకు ఆయా బ్యాంకులు వడ్డీ రేట్లను డిసైడ్ చేస్తాయి.
అదే ఐదు నుంచి పదిహేనేళ్ల లాంగ్ టర్మ్ డిపాజిట్లు అయితే ఆర్బీఐతో సంప్రదించి కేంద్ర ప్రభుత్వమే డైరెక్టుగా వడ్డీని భరిస్తుంది. ఇలా సేకరించిన గోల్డ్‌ను బ్యాంకులు నగల వ్యాపారులకు లోన్ రూపంలో ఇస్తాయి. అంటే ఇళ్లలోనూ, లాకర్‌కు పరిమితమైన బంగారం, ఈ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్(Gold Monetization Scheme) స్కీమ్ ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థకు బూస్ట్‌లా మారుతుందన్నమాట. త్వరలోనే కేంద్ర ఆర్థిక శాఖ ఈ రూల్స్ పై పూర్తి స్పష్టత ఇవ్వబోతోంది.





