Bullet Train : ముంబై టు హైదరాబాద్ జస్ట్ 3 గంటలే.. ప్రతిష్టాత్మక బుల్లెట్ ట్రైన్ డీపీఆర్ రెడీ
Bullet Train: రోడ్డు మార్గంలో వెళ్తే దాదాపు 13 గంటలు, సాధారణ రైళ్లలో సుమారు 15 గంటల పాటు సాగే సుదీర్ఘ ప్రయాణ సమయాన్ని ఈ బుల్లెట్ ట్రైన్ పూర్తిగా తగ్గించబోతోంది.
Bullet Train
తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు ఇండస్ట్రియల్ అండ్ బిజినెస్ రంగాల వారికి కేంద్ర ప్రభుత్వం ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్ నుంచి దేశ ఆర్థిక రాజధాని అయిన ముంబైకి తరచూ ప్రయాణించే వారి కలలను సాకారం చేస్తూ అత్యంత ప్రతిష్టాత్మకమైన హైస్పీడ్ బుల్లెట్ ట్రైన్(Bullet Train) కారిడార్ ప్రాజెక్టు పట్టాలెక్కడానికి సిద్ధమవుతోంది.
ప్రస్తుతం రోడ్డు మార్గంలో వెళ్తే దాదాపు 13 గంటలు, సాధారణ రైళ్లలో సుమారు 15 గంటల పాటు సాగే సుదీర్ఘ ప్రయాణ సమయాన్ని ఈ బుల్లెట్ ట్రైన్(Bullet Train) పూర్తిగా తగ్గించబోతోంది. గంటకు గరిష్టంగా 300 కిలోమీటర్ల సూపర్ స్పీడ్‌తో దూసుకెళ్లే ఈ ట్రైన్ ద్వారా హైదరాబాద్-పూణే-ముంబై నగరాల మధ్య జర్నీ టైమ్ కేవలం 3 గంటలకు తగ్గబోతోంది.
ఈ మెగా ప్రాజెక్టుకు సంబంధించిన క్షేత్రస్థాయి సర్వే పూర్తి కావడంతో పాటు, తాజాగా డీపీఆర్ అంటే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (Detailed Project Report) కూడా సిద్ధమైందని నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (NHSRCL) అఫీషియల్‌గా వెల్లడించింది. ఈ ట్రాక్ అందుబాటులోకి వస్తే ప్రయాణికులు కనిష్టంగా 2.55 గంటల నుంచి గరిష్టంగా 3.13 గంటల్లోనే ముంబై చేరుకోవచ్చు.
కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో దేశవ్యాప్తంగా ప్రకటించిన 7 హైస్పీడ్ రైలు కారిడార్లలో 3 కారిడార్లు హైదరాబాద్ కేంద్రంగానే ప్రతిపాదించడం విశేషం. అందులో హైదరాబాద్ టు చెన్నై, హైదరాబాద్ టు బెంగళూరు రూట్లు ప్రస్తుతం మొదటి సర్వే దశలో ఉండగా, హైదరాబాద్ టు పుణె టు ముంబై ప్రాజెక్టు మాత్రం డీపీఆర్ పూర్తి చేసుకుని నెక్ట్స్ అడుగులు వేస్తోంది.
ఈ కారిడార్ మొత్తం పొడవు 671 కిలోమీటర్లు ఉండగా.. దీనిలో తెలంగాణ పరిధిలో 93 కిలోమీటర్లు, కర్ణాటకలో 121 కిలోమీటర్లు, అత్యధికంగా మహారాష్ట్ర పరిధిలో 457 కిలోమీటర్ల వరకూ ట్రాక్ నిర్మిస్తారు. ఈ హైస్పీడ్ కారిడార్ నిర్మాణాన్ని మన హైదరాబాద్ మెట్రో రైలు లాగానే పిల్లర్లపై ఎలివేటెడ్ (ఆకాశ మార్గం) రూట్లో నిర్మించబోతున్నారు.
ఈ ప్రయాణాన్ని మరింత ఈజీ చేస్తూ మొత్తం రూట్లో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌తో కూడిన స్టేషన్లను ఏర్పాటు చేయబోతున్నారు. తెలంగాణ పరిధిలో హైదరాబాద్ కోకాపేట, వికారాబాద్‌లతో పాటు తాజాగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ సమీపాన్ని కూడా ఈ స్టేషన్ల జాబితాలో చేర్చారు.
ఇక కర్ణాటకలో కలబురగి.. మహారాష్ట్రలో విఖ్రోలి, థానే, నవీ ముంబై, లోనావాలా, పింప్రి -చించ్వాడ్, పూణే, బారామతి, పంఢర్పురం, సోలాపూర్ ప్రాంతాలలో స్టేషన్లను ప్రతిపాదించారు. ఈ బుల్లెట్ రైలు స్టేషన్లను భారీ పార్కింగ్, మోడ్రన్ కమర్షియల్ ఫెసిలిటీలతో అద్భుతంగా డిజైన్ చేయనున్నారు. దీనికోసం ఒక్కో స్టేషన్ ప్రాంగణానికి ఏకంగా 247 ఎకరాల భారీ భూమి అవసరమవుతుందని అంచనా వేసి, ఆ ల్యాండ్‌ను కేటాయించమని కోరుతూ NHSRCL.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది.
టెక్నికల్‌గా ఈ ప్రాజెక్టు ఒక ఇంజనీరింగ్ అద్భుతంగా నిలవబోతోంది. మహారాష్ట్ర పరిధిలోని మూడు ప్రధాన ప్రాంతాలలో మొత్తం 35.30 కిలోమీటర్ల వరకూ భూగర్భ మార్గాన్ని (అండర్‌గ్రౌండ్ ట్రాక్) నిర్మిస్తారు. ముఖ్యంగా పశ్చిమ కనుమల్లోని ప్రకృతి రమణీయమైన ఖండాల ఘాట్ ప్రాంతంలో మొత్తం 13 చోట్ల కొండలను తొలిచి, 24 కిలోమీటర్ల పొడవైన సొరంగ మార్గాలను (Tunnels) ఏర్పాటు చేయబోతున్నారు.
ఈ రూట్లో జర్నీ చేసే ప్రయాణికులకు ఇది ఒక సరికొత్త హాలీవుడ్ రేంజ్ అనుభూతిని ఇస్తుంది. దీనితో పాటు ఈ హైస్పీడ్ కారిడార్ మార్గంలో మొత్తం 101 వంతెనలను నిర్మించబోతున్నారు. దీనిలో 13 అత్యాధునిక స్టీల్ బ్రిడ్జిలు కాగా, ప్రధాన నదులపై 29 భారీ బ్రిడ్జిలను ప్రతిపాదించారు. దీనిలో ములా-ముఠా నదిపై 360 మీటర్లు, భీమా నదిపై 280 మీటర్లు, బోరి నదిపై 225 మీటర్ల పొడవైన వంతెనలు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవనున్నాయి.
ఈ బుల్లెట్ ట్రైన్(Bullet Train) అందుబాటులోకి వస్తే ప్రయాణికుల రద్దీ భారీగా ఉండబోతుందని అంచనాలు చెబుతున్నాయి.2033 నుండి 2035 మధ్య కాలంలో పూర్తవబోయే ఈ ప్రాజెక్టుకు.. ప్రతీ రోజుకు దాదాపు 63,494 మంది ప్రయాణిస్తారని, 2041 నాటికి అది 95,050 కి, అలాగే 2061 నాటికి ప్రయాణికుల సంఖ్య రోజుకు ఏకంగా 1,52,092కు పెరుగుతుందని అధికారులు లెక్కలు వేస్తున్నారు.

ఈ కారిడార్‌లో నడిచే ఒక్కో బుల్లెట్ ట్రైన్లో 16 లేటెస్ట్ బోగీలు ఉంటాయి. ఒకేసారి మొత్తం 1,215 మంది కూర్చుని ప్రయాణించేలా అధునాతన సీటింగ్ కెపాసిటీ ఉంటుంది. ఈ మెగా ప్రాజెక్ట్ నిర్వహణతో పాటు రైళ్ల మరమ్మత్తుల కోసం మహారాష్ట్రలోని థానేలో ఒక భారీ బుల్లెట్ ట్రైన్ల(Bullet Train) మెయిన్ డిపో, వర్క్‌షాప్‌ను ఏర్పాటు చేయనున్నారు.
అలాగే మన హైదరాబాద్‌లో మరో సపోర్టింగ్ డిపోను నిర్మించబోతున్నారు. ఈ ప్రాజెక్టు కనుక పూర్తయితే రెండు రాష్ట్రాల మధ్య ప్రయాణాలతో పాటు వ్యాపార లావాదేవీలు కూడా ఊహించని రేంజ్‌కు దూసుకుపోవడం ఖాయమని నిపుణులు అంచనా వేస్తున్నారు.
Four Day Work: దేశంలో 4 రోజుల పని విధానం.. పెరగనున్న బేసిక్ పే..తగ్గనున్న చేతికొచ్చే జీతం





