Just NationalJust TelanganaLatest News

Swachh Vayu Sarvekshan : ఢిల్లీ, ముంబైని వెనక్కి నెట్టిన భాగ్యనగరం..హైదరాబాద్ గాలి నిజంగానే స్వచ్ఛమా?

Swachh Vayu Sarvekshan : స్వచ్ఛ వాయు సర్వేక్షణ్‌లో హైదరాబాద్‌కు మంచి ర్యాంకు రావడం సంతోషించాల్సిన విషయమే. కానీ ఆ ర్యాంకు ఒక్కటే నగరంలోని గాలి పూర్తిగా కాలుష్యరహితమని నిరూపించదన్న వాదన వినిపిస్తోంది.

Swachh Vayu Sarvekshan

హైదరాబాద్‌లో బయటకు అడుగుపెడితే కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్‌ రద్దీ.. రోడ్లపై వాహనాల నుంచి గుప్పుమని భయటకు వచ్చే భరించరాని పొగ.. నిర్మాణ పనులతో ఎక్కడికక్కడ దుమ్ము.. ఇవన్నీ హైదరాబాద్‌ వాసులకు నిత్య అనుభవాలే. వేగంగా విస్తరిస్తున్న సిటీలో కాలుష్యం కూడా అంతే స్పీడ్‌గా పెరుగుతోందనే ఆందోళన చాలాకాలంగా ఉంది.

అయితే ఇలాంటి సమయంలో కేంద్ర ప్రభుత్వం తాజాగా రిలీజ్ చేసిన స్వచ్ఛ వాయు సర్వేక్షణ్‌(Swachh Vayu Sarvekshan)-2026 ఫలితాలు హైదరాబాద్‌కు ఒక మంచి గుర్తింపును తీసుకొచ్చాయి. దేశంలోని ప్రధాన మెట్రో నగరాలైన ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, కోల్‌కతాను వెనక్కి నెట్టి హైదరాబాద్‌ ముందంజలో నిలిచింది.

ఈ వార్త వినగానే భాగ్యనగర వాసులు సంతోష పడటం మాట పక్కన పెడితే ఒక్కసారిగా విస్తుపోతున్నారు . నిజంగానే హైదరాబాద్‌లో గాలి అంత స్వచ్ఛంగా మారిపోయిందా? ఉదయం, సాయంత్రం ట్రాఫిక్‌లో జర్నీ చేస్తూ పొగ, దుమ్ము సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నది అంతా అబద్ధమా అని డౌట్ పడుతున్నారు. లేక ఈ ర్యాంకింగ్‌ వెనుక మరో కోణం ఉందా అంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

కేంద్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నిర్వహించిన స్వచ్ఛ వాయు సర్వేక్షణ్‌(Swachh Vayu Sarvekshan)-2026లో పది లక్షలకు పైగా జనాభా ఉన్న సిటీ కేటగిరీలో హైదరాబాద్‌ 19వ స్థానాన్ని దక్కించుకుంది. మొత్తం 200 మార్కులకు గాను 174.2 పాయింట్లు సాధించింది. గతేడాదితో పోలిస్తే ఏకంగా మూడు స్థానాలు మెరుగుపరుచుకోవడం మరో విశేషంగా నిలిచింది.

ఇక దేశంలోని మెయిన్ మెట్రో సిటీల ర్యాంకులను పరిశీలిస్తే.. ఢిల్లీ 21వ ప్లేస్‌లో, ముంబై 28వ ప్లేస్‌లో, బెంగళూరు 32వ ప్లేస్‌లో, చెన్నై 35వ స్థానంలో, కోల్‌కతా 38వ ప్లేస్‌లో నిలిచాయి. అంటే ఈ 6 ప్రధాన మెట్రో నగరాల్లో హైదరాబాద్‌ టాప్ ప్లేస్‌ను సాధించింది.

అయితే ఇక్కడే ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. హైదరాబాద్‌ దేశంలోనే ఫస్ట్ ప్లేసులో నిలవలేదు. పది లక్షలకు పైగా జనాభా ఉన్న సిటీల నేషనల్ లిస్ట్‌లో 19వ ర్యాంకు సాధించింది. కానీ ప్రధాన మెట్రో నగరాలతో పోలిస్తే మాత్రం ముందుంది.

నిజానికి స్వచ్ఛ వాయు సర్వేక్షణ్‌(Swachh Vayu Sarvekshan) అనేది సిటీలోని గాలిలో కాలుష్యం ఎంత ఉందో కొలిచి ర్యాంకులు ఇచ్చే టెస్ట్ మాత్రమే కాదు. కాలుష్యాన్ని తగ్గించడానికి నగర పాలక సంస్థలు, గవర్నమెంట్ విభాగాలు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాయి? వాటిని ఎంత సమర్థంగా అమలు చేస్తున్నాయనే అంశాలకూ దీనిలో ప్రాధాన్యం ఉంటుంది.

రోడ్లపై పేరుకుపోయే దుమ్మును కంట్రోల్ చేయడం, నిర్మాణ వ్యర్థాల నిర్వహణ, వెహికల్స్ అలాగే ఇండస్ట్రియల్ నుంచి వెలువడే కాలుష్యాన్ని తగ్గించే చర్యలు, చెత్త నిర్వహణ, ప్రజల్లో అవగాహన పెంచడం వంటి అంశాలను పరిశీలిస్తారు. అంటే సిటీలు పొల్యూషన్ సమస్యను ఎదుర్కోవడానికి ఎంతవరకు రెడీగా ఉన్నాయి. తీసుకున్న చర్యలు ఎంతవరకు అమలవుతున్నాయనే అంశాలు కూడా ర్యాంకింగ్‌లో కీలక పాత్ర పోషిస్తాయి.

కాకపోతే కొన్ని ప్రమాదకర కాలుష్య కారకాల స్థాయిలు ఇతర మెయిన్ మెట్రో సిటీలతో పోలిస్తే హైదరాబాద్‌లో తక్కువగా ఉన్నాయని తేలింది. నిజానికి హైదరాబాద్‌ కూడా కాలుష్య సమస్యల నుంచి పూర్తిగా బయటపడలేదు. పెరుగుతున్న వాహనాల సంఖ్య, నిర్మాణ రంగం, రోడ్లపై ఎగిరే దుమ్ము, పారిశ్రామిక కార్యకలాపాలు నగర గాలి నాణ్యతపై ప్రభావం చూపే అంశాలుగానే ఉన్నాయి.

ఈ సర్వేలో తెలంగాణకు హైదరాబాద్‌తో పాటు మరో రెండు నగరాలు కూడా మంచి ఫలితాలు సాధించాయి. 3 లక్షల కంటే తక్కువ జనాభా ఉన్న సిటీల విభాగంలో సంగారెడ్డి 186.8 పాయింట్లతో ఎనిమిదో స్థానాన్ని దక్కించుకుంది. అదే విభాగంలో నల్గొండ 185.8 పాయింట్లతో పదో స్థానంలో నిలిచింది.

ఇటు ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి నగరాల కంటే బెస్ట్ ర్యాంకు సాధించడం హైదరాబాద్‌కు గర్వకారణమే. అయితే ఈ ర్యాంకును చూసి హైదరాబాద్‌లో పొల్యూషన్ సమస్య పూర్తిగా పరిష్కారమైందని అనుకోకూడదు. సిటీలో ఏ ప్రాంతంలో ఎయిర్ క్వాలిటీ ఎలా ఉంది? రోజువారీగా పొల్యూషన్ లెవెల్స్ ఎలా మారుతున్నాయి? ప్రమాదకరమైన సూక్ష్మ ధూళి కణాల స్థాయిలు ఎంతవరకు ఉన్నాయి వంటివి కూడా నిరంతరం పరిశీలించాలి.

కాగా హైదరాబాద్‌కు ఇప్పుడు వచ్చిన 19వ ర్యాంకు ఒక మంచి గుర్తింపు మాత్రమే.. కాలుష్యంపై సాధించిన విజయం మాత్రం కాదు. ఈ ఫలితాలను చూసి సంబరపడుతూనే మరింత బాధ్యతగా వ్యవహరించాలి. ఎందుకంటే సిటీకి అసలైన గౌరవం ర్యాంకింగ్స్‌లో వచ్చే ప్లేస్‌తో కాదు.. ఇక్కడ నివసించే ప్రతీ ఒక్కరూ ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్యూర్ ఎయిర్‌ను పీల్చుకోగలిగినప్పుడే నిజమైన స్థానం దక్కినట్లు అనుకోవాలి.

Rumours : రూమర్స్ ఎవరు స్ప్రెడ్ చేస్తారు? దీనిపై సైకాలజిస్టులు ఏం చెబుతున్నారు?

Related Articles

Back to top button