Just SpiritualLatest News

Hanuman : పనులు జరగాలా? శత్రువుల పీడ వీడాలా? హనుమంతుడికి ఈ ఒక్కటి సమర్పిస్తే చాలు..

Hanuman : ఆంజనేయుడికి తమలపాకులంటే అంత ఇష్టం ఎందుకు? అసలు హనుమంతుడికి తమలపాకుల మాల ఎందుకు వేస్తారనే దాని వెనుకున్న ఆసక్తికరమైన చరిత్ర చాలామందికి తెలీదు.

Hanuman

శ్రీరామ భక్తుడైన ఆంజనేయుడిని కొలిస్తే చాలు.. ఎలాంటి కష్టాలైనా మెల్లగా మాయమైపోతాయి. ఎంతటి కష్టమైన పని అయినా సరే తేలిగ్గా పూర్తవుతుంది. ఇక శత్రువుల భయం అసలే ఉండదు. పరమశివుడి అంశతో జన్మించిన హనుమంతుడు, తన ఆరాధ్య దైవమైన శ్రీరాముడిలాగే చాలా సింపుల్‌గా ఉండటానికి ఇష్టపడతాడు.

అందుకే ఆయనకు ఏ ఆలయంలో అయినా పెద్ద పెద్ద ఆడంబరాలు కనిపించవు. కాస్త సింధూరం, కొన్ని తమలపాకులతో అంజన్నను పూజిస్తే చాలు.. మురిసిపోయి భక్తులకు ఆశీస్సులు కురిపిస్తాడు. అయితే ఆంజనేయుడికి తమలపాకులంటే అంత ఇష్టం ఎందుకు? అసలు హనుమంతుడికి తమలపాకుల మాల ఎందుకు వేస్తారనే దాని వెనుకున్న ఆసక్తికరమైన చరిత్ర చాలామందికి తెలీదు.

మన హిందూ సంప్రదాయంలో తమలపాకులకు చాలా స్పెషల్ ప్లేస్ ఉంది. తమలపాకులను నాగవల్లి అని కూడా పిలుస్తారు. పూజలు, పెళ్లిళ్లు, శుభకార్యాలు.. ఇలా సందర్భం ఏదైనా సరే తమలపాకు ఉండాల్సిందే అన్నంతగా తెలుగువారు తమలపాకుతో అనుబంధాన్ని పెంచుకున్నారు. ఆధ్యాత్మికంగానే కాదు, హెల్త్ పరంగా కూడా తమలపాకులో బోలెడన్ని బెనిఫిట్స్ ఉన్నాయి.

ఈ తమలపాకులకు, హనుమంతుడికి ఉన్న బంధం వెనుక ఒక అందమైన కథ ఉంది. రావణాసురుడు సీతాదేవిని అపహరించినప్పుడు, శ్రీ రాముడు సీతాన్వేషణను మొదలుపెడతాడు. ఆ సమయంలో కిష్కింధలో ఆంజనేయుడిని కలవడం, సుగ్రీవుడితో స్నేహం కుదరడం జరిగిపోతాయి.

సుగ్రీవుడు తన వానర సైన్యంతో సీతాదేవి జాడ కనిపెడతానని రాముడికి మాట ఇస్తాడు. ఆ బాధ్యతను అత్యంత బలవంతుడు అయిన హనుమంతుడికి అప్పగిస్తాడు. దీనిలో భాగంగా ఆంజనేయుడు లంకలోని అశోకవనానికి చేరుకుని సీతాదేవిని కలుసుకుంటాడు. రాముడి సమాచారం అందించి, రావణాసురుడిని హెచ్చరించి , లంకాదహనం చేసి తిరుగుపయనం అవుతాడు.

అయితే సీతమ్మను కలిసిన ఆ సమయంలో ఆంజనేయుడిని ఆశీర్వదించాలని అనుకుంటుంది. కానీ అశోకవనంలో ఆమెకు అందుబాటులో పూలు ఏమీ ఉండవు. దాంతో పక్కనే ఉన్న తమలపాకులను తుంచి, హనుమంతుడి తలపై ఉంచి మనసారా దీవిస్తుంది. అప్పటి నుంచి స్వామివారికి తమలపాకులంటే అంత ప్రీతి అని చెబుతారు.

Hanuman
Hanuman

ఇది మాత్రమే కాదు, ఇంకో ఇంట్రెస్టింగ్ కథ కూడా ప్రచారంలో ఉంది. లంక నుంచి తిరిగొస్తూ ఆంజనేయుడు ఆకాశంలో గట్టిగా హుంకరిస్తాడు. ఆ శబ్దం వినగానే హనుమంతుడు వానర సైన్యానికి సీతమ్మ జాడ కనిపెట్టాడనే విషయం అర్థమైపోతుంది. ఆయన రాక కోసం వేయి కళ్లతో ఎదురుచూసిన వానరులు, అంజన్న రాగానే సంతోషంతో తమలపాకుల తీగలతో ఆయనను ఘనంగా సన్మానిస్తారు. ఆ ఆత్మీయతకు ఆంజనేయుడు ఎంతో సంతోషిస్తాడు. ఆరోజు నుంచి తమలపాకు అనేది విజయానికి, సంతోషానికి చిహ్నంగా మారింది.

హనుమంతుడు జ్యోతి స్వరూపుడు. ఆయనను మనసారా తలుచుకుంటే చాలు అవరోధాలన్నీ తొలగిపోతాయి. అందుకే ప్రతి మంగళవారం, శనివారాల్లో హనుమంతుడికి ప్రత్యేక పూజలు చేస్తుంటారు. ఈ రోజుల్లో స్వామికి తమలపాకుల మాలను సమర్పించి, హనుమాన్ చాలీసా పారాయణం చేస్తే కోరుకున్న కోరికలన్నీ నెరవేరతాయని భక్తులు నమ్ముతారు.

America : ఇరాన్ ఆర్థిక నడుము విరిచేలా అమెరికా ప్లాన్.. చైనా ఎలా రియాక్టవుతుంది?

Related Articles

Back to top button