Tholi Ekadashi : తొలి ఏకాదశి ఉపవాస మహిమ తెలుసా..శయన ఏకాదశి వెనుక ఉన్న కథేంటి?
Tholi Ekadashi : దేవశయని ఏకాదశి రోజు నుంచి ఆధ్యాత్మిక సాధనకు చాలా అనుకూలమైన కాలం మొదలవుతుంది. ఈరోజు శ్రీహరి యోగనిద్రలోకి వెళ్తారని, తిరిగి కార్తీక మాసంలో వచ్చే ప్రబోధిని ఏకాదశికి మేల్కొంటారని భక్తుల విశ్వాసం.
Tholi Ekadashi
మన హిందూ ధర్మంలో ఏకాదశి తిథికి ఎంతో విశిష్టమైన స్థానం ఉంటుంది. అందులోనూ ఆషాఢ మాసంలో శుక్ల పక్షంలో వచ్చే మొదటి ఏకాదశిని దేవశయని ఏకాదశి, శయన ఏకాదశి లేదా పద్మ ఏకాదశి అని పిలుచుకుంటారు. హిందూ సంప్రదాయంలో ఈ రోజు అత్యంత పవిత్రమైన పండుగగా జరుపుకొంటారు. శ్రీమహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పంపై యోగనిద్రలోకి వెళ్లే పవిత్ర సమయమిదేనని పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజుతోనే అత్యంత ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగిన చాతుర్మాస్య వ్రతం ప్రారంభం అవుతుంది.
దేవశయని ఏకాదశి రోజు నుంచి ఆధ్యాత్మిక సాధనకు చాలా అనుకూలమైన కాలం మొదలవుతుంది. ఈరోజు శ్రీహరి యోగనిద్రలోకి వెళ్తారని, తిరిగి కార్తీక మాసంలో వచ్చే ప్రబోధిని ఏకాదశికి మేల్కొంటారని భక్తుల విశ్వాసం. ఈ 4 నెలల కాలాన్ని చాతుర్మాస్యంగా పరిగణించి, మునులు, సాధువులు , భక్తులు.. ఉపవాసాలు, జపాలు, ధ్యానం వంటి నిష్ఠాగరిష్టమైన నియమాలు పాటిస్తారు. ఈ సమయంలో ఉపవాస దీక్షలు చేపట్టడం వల్ల మనిషి, మనసు శుద్ధితో పాటు మానసిక ప్రశాంతత సమకూరుతుంది.
పురాణ కథనాల ప్రకారం మాంధాత అనే మహారాజు..అతని రాజ్యంలో ఏర్పడిన తీవ్రమైన కరవు కాటకాల నుంచి ప్రజలను రక్షించడానికి అంగీరస మహర్షి సూచనలతో ఆషాఢ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తాడు. రాజా మాంధాత నిష్ఠతో చేసిన పూజకు సంతోషించిన శ్రీమహావిష్ణువు వానలు కురిపించి, రాజ్యాన్ని సుభిక్షం చేశాడని నమ్ముతారు. అందుకే ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే సకల పాపాలు తొలగిపోయి, కోరిన కోరికలు నెరవేరుతాయని, సంతోషకరమైన జీవితం దొరుకుతుందని నమ్ముతారు.
తొలి ఏకాదశి(Tholi Ekadashi) రోజున భక్తులు వేకువజామునే లేచి పవిత్ర స్నానాలు ఆచరించి, విష్ణుమూర్తి విగ్రహానికి అలంకారం చేస్తారు. రోజంతా ఉపవాస దీక్షను పాటించి, విష్ణు సహస్రనామ పారాయణ , ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్ర జపంలో గడుపుతారు. పండ్ల రసాలను కానీ పండ్లను కానీ స్వీకరించి సాయంత్రం దివ్యమైన హారతి ఇస్తారు. మర్నాడు ద్వాదశి ఘడియల్లో బ్రాహ్మణులకు లేదా పేదలకు అన్నదానం చేసిన తర్వాత మాత్రమే తమ ఉపవాసాన్ని విరమిస్తారు.

భౌతికపరమైన విలాసాల కంటే ఆధ్యాత్మిక ఆలోచనలకు ప్రాధాన్యమిచ్చే ఈ ఏకాదశి వ్రతం మనిషిలో క్రమశిక్షణను, భక్తిభావాన్ని పెంపొందిస్తుంది. అందుకే ఆషాఢ శుక్ల ఏకాదశిని కేవలం ఒక పండుగగా మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరూ తమలోని ప్రతికూల ఆలోచనలను తొలగించుకుని, సన్మార్గంలో నడవడానికి లభించే ఒక దివ్యమైన అవకాశంగా భావిస్తారు.
Delhi Protest : వీధి పోరాటాలు, వేల కోట్ల నష్టాలు.. ఢిల్లీ ఆందోళనల వెనుక ఊహించని ఆర్థిక సంక్షోభం..





