Bangladesh : చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. ఆస్ట్రేలియాకు మళ్లీ షాక్
Bangladesh : దేశ క్రికెట్ చరిత్రలో తొలిసారి బంగ్లాదేశ్ ఆసీస్‌పై తొలిసారి ద్వైపాక్షిక సిరీస్‌ను సొంతం చేసుకుంది
Bangladesh
బంగ్లాదేశ్ వన్డే జట్టు చరిత్ర సృష్టించింది. వన్డే వరల్డ్ కప్ ఛాంపియన్స్ కంగారూలకు దిమ్మతిరిగే షాకిచ్చింది. ఆ జట్టుపై తొలిసారి ద్వైపాక్షిక సిరీస్‌ను కైవసం చేసుకుంది. తొలి వన్డేలో కంగారూలను చిత్తు చేసిన బంగ్లాదేశ్(Bangladesh) తాజాగా రెండో మ్యాచ్‌లోనూ అదరగొట్టింది.
వర్షం చాలాసార్లు అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్ లో ఆసీస్ బ్యాటర్లు అట్టర్ ఫ్లాప్ అయ్యారు. స్కోరుబోర్డుపై కనీసం ఒక పరుగు కూడా లేకుండానే 3 కీలక వికెట్లు కోల్పోయారు. కనీసం అకౌంట్ తెరవకుండానే 3 వికెట్లు చేజార్చుకున్న జట్టుగా చెత్త రికార్డును మూటగట్టుకుంది.
మాథ్యూ షార్ట్ , కూపర్ కొన్నోలీ, మాథ్యూ రెన్షా డకౌటయ్యారు. కెప్టెన్ జాస్ ఇంగ్లీష్, అలెక్స్ క్యారీ కాసేపు ఆదుకునే ప్రయత్నం చేసినా బంగ్లా బౌలర్ల ఆధిపత్యం స్పష్టంగా కనిపించింది. దీంతో ఆసీస్ 81 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది.
ఇంగ్లీష్ (34), క్యారీ (13), కామెరాన్ గ్రీన్ (25) పరుగులకు ఔటయ్యారు. ఈ దశలో లబూషేన్, బార్ట్ లెట్ హాఫ్ సెంచరీలతో ఆదుకున్నారు. వీరిద్దరూ పోరాడకుంటే ఆసీస్ కథ 120 పరుగుల లోపే ముగిసిపోయి ఉండేది.
చివరికి ఆస్ట్రేలియా 42 ఓవర్లకు కుదించిన మ్యాచ్ లో 8 వికెట్లకు 174 పరుగులు చేసింది. బార్ట్ లెట్ 48 బంతుల్లో 52 (4 ఫోర్లు,2 సిక్సర్లు), లబుషేన్ 55 (3 ఫోర్లు) పరుగులు చేయగా… బంగ్లా బౌలర్లలో టస్కిన్ అహ్మద్ 3/33, ముస్తాఫిజుర్ రెహమాన్ 3/27, తన్వీర్ 2/45 రాణించారు.

తర్వాత మరోసారి వర్షం అడ్డుపడడంతో బంగ్లాదేశ్ టార్గెట్ ను 192 పరుగులుగా నిర్ణయించారు. ఛేజింగ్‌లో తొలి ఓవర్లోనే బంగ్లా వికెట్ కోల్పోయినా.. తర్వాత పుంజుకుంది. సౌమ్య సర్కార్ (42), నజ్ముల్ షాంటో (41) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌లు ఆడగా.. తౌహిద్ హృదయ్ (40), కెప్టెన్ మెహిది హసన్ మిరాజ్ (22) నాటౌట్‌గా నిలిచి బంగ్లాను గెలిపించారు.
దీంతో తమ దేశ క్రికెట్ చరిత్రలో తొలిసారి బంగ్లాదేశ్(Bangladesh) ఆసీస్‌పై తొలిసారి ద్వైపాక్షిక సిరీస్‌ను సొంతం చేసుకుంది. 2005లో మొదటిసారి ఆసీస్‌పై ఒక వన్డే గెలిచిన బంగ్లాదేశ్(Bangladesh) ఈసారి వరుసగా రెండు మ్యాచ్‌లతో ఏకంగా సంచలనం సృష్టించింది. ఆసీస్‌కు ఇది వరుసగా రెండో సిరీస్ ఓటమి కాగా.. ఇంతకుముందు పాక్ గడ్డపైనా ఆసీస్ ఓ వన్డే సిరీస్‌ను కోల్పోయింది.





