Ind VS Afg : ఆరంభం అదరాలి.. ఆఫ్ఘనిస్తాన్‌తో భారత్ తొలి వన్డే
Ind VS Afg : ఐపీఎల్ లో రాణించిన పలువురు యువ ఆటగాళ్లకు మాత్రం ఈ సిరీస్ మంచి అవకాశం. హర్ష్ దూబే, ప్రిన్స్ యాదవ్ వంటి ప్లేయర్స్ అరంగేట్రం ఖాయమైనట్టే
Ind VS Afg
సొంతగడ్డపై ఏకైక టెస్టులో ఆఫ్ఘనిస్తాన్ ను చిత్తు చేసిన టీమిండియా ఇప్పుడు వైట్ బాల్ సిరీస్ కు సిద్ధమైంది. మూడు వన్డేల సిరీస్ లో భాగంగా తొలి మ్యాచ్ శనివారం ధర్మశాల వేదికగా జరగబోతోంది. వన్డే ప్రపంచకప్ 2027కు సన్నాహకాలను మొదలుపెట్టిన భారత్ ఇప్పటి నుంచే తుది జట్టు కాంబినేషన్లపై ఫోకస్ పెట్టనుంది. ఈ క్రమంలో పలువురు యువ ఆటగాళ్లను పరీక్షించబోతోంది. కోహ్లీ, హార్దిక్ పాండ్యా ఈ సిరీస్ కు దూరం కావడం అభిమానులకు నిరాశ కలిగించే అంశం.
అయితే ఐపీఎల్ లో రాణించిన పలువురు యువ ఆటగాళ్లకు మాత్రం ఈ సిరీస్ మంచి అవకాశం. హర్ష్ దూబే, ప్రిన్స్ యాదవ్ వంటి ప్లేయర్స్ అరంగేట్రం ఖాయమైనట్టే. అలాగే ఆల్ రౌండర్ కోటాలో నితీశ్ కుమార్ రెడ్డి తన సత్తాను నిరూపించుకునేందుకు అద్భుతమైన అవకాశంగా చెప్పొచ్చు.
ఎందుకంటే నితీశ్ రెడ్డి బంతితో ఇప్పటి వరకూ పెద్దగా చెప్పుకోదగిన విధంగా రాణించలేదు. అయినా సరే సెలక్టర్లు మాత్రం అతనిపై పూర్తి కాన్ఫిడెంట్ గా ఉన్నారు. మరిన్ని అవకాశాలు ఇస్తామని గతంలోనే చీఫ్ సెలక్టర్ అగార్కర్ చెప్పిన సందర్భంగా ఆఫ్ఘనిస్తాన్ తో సిరీస్ లో తన ఆల్ రౌండ్ పెర్ఫార్మెన్స్ ఇస్తాడేమో చూడాలి.
ఇదిలా ఉంటే రోహిత్ , గిల్ ఇన్నింగ్స్ ఆరంభించనుండగా.. కోహ్లీ లేకపోవడంతో వన్ డౌన్ లో ఇషాన్ కిషన్ ను దింపే అవకాశముంది. సూపర్ ఫామ్ లో ఉన్న ఇషాన్ కిషన్ సరిగ్గా మూడేళ్ల క్రితం ఆఫ్ఘనిస్తాన్ పైనే సిరీస్ ఆడాడు. అటు జైస్వాల్ బెంచ్ కే పరిమితమయ్యే అవకాశాలున్నాయి.
శ్రేయాస్ అయ్యర్ , కేఎల్ రాహుల్ వన్డేల్లో అద్భుతమైన బ్యాటర్లు. ఐపీఎల్ ఫామ్ కంటిన్యూ చేసేందుకు ఎదురుచూస్తున్నారు. హర్ష్ దూబే , కుల్దీప్ యాదవ్ స్పిన్నర్లుగా ఉంటారు. అటు పేస్ ఎటాక్ లో బుమ్రా లేకపోవడంతో అర్షదీప్ సింగ్, ప్రసిధ్ కృష్ణలతో పాటు ప్రిన్స్ యాదవ్ కు చోటు దక్కొచ్చు. ఇటీవలి ఐపీఎల్ సీజన్ లో ప్రిన్స్ యాదవ్ అద్భుతంగా రాణించాడు.

పదునైన యార్కర్లతో బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు. మన పేస్ విభాగాన్ని మరింత బలంగా మార్చే పనిలో ఉన్న గంభీర్ ప్రిన్స్ యాదవ్ కు వరుస అవకాశాలివ్వడం ఖాయం. మరోవైపు ఏకైక టెస్టులో తేలిపోయిన ఆఫ్ఘనిస్తాన్ వన్డే సిరీస్ లో మాత్రం గట్టిపోటీనివ్వాలని ఎదురుచూస్తోంది. హష్మతుల్లా షాహిది సారథ్యంలోని ఆఫ్ఘన్ జట్టులోకి మహ్మద్ నబీ, రషీద్ ఖాన్ వంటి సీనియర్లు రావడం వారి కాన్ఫిడెన్స్ పెంచేదే.
అలాగే గుర్బాజ్, ఒమర్జాయ్ , జడ్రాన్ , రహమతుల్లా వంటి యువ ఆటగాళ్లు కూడా సత్తా చాటేందుకు ఎదురుచూస్తున్నారు. దీంతో ఆఫ్ఘన్ ను మరీ తేలిగ్గా తీసుకున్నా ప్రమాదమే. ఇక మ్యాచ్ కు ఆతిథ్యమిస్తున్న ధర్మశాల పిచ్ ఛేజింగ్ జట్లకు అనుకూలంగా ఉంటుంది. మ్యాచ్ సాగే కొద్దీ మంచు ప్రభావం ఉండడం, బౌలర్లకు అంత గ్రిప్ లభించే అవకాశాలు లేకపోవడంతో బ్యాటర్లు స్వేఛ్చగా ఆడొచ్చు.
Leo : రాజులాంటి మనస్తత్వం.. సింహరాశి వారికి ఉన్న పెద్ద మైనస్ ఏంటి?





