T20 Captain : టీ20 పగ్గాలు ఎవరికో ?..రేసులో శ్రేయాస్, ఇషాన్, తిలక్
T20 Captain : టీ20 జట్టు కెప్టెన్సీని యువ ఆటగాళ్లలో ఒకరికి అప్పగించాలని బీసీసీఐ భావిస్తోంది. దీనికి సంబంధించి రెండు రోజుల్లో కీలక ప్రకటన వెలువడే అవకాశముంది. ప్రస్తుతం టీ20 కెప్టెన్సీ రేసులో మూడు పేర్లు వినిపిస్తున్నాయి
T20 Captain
భారత టీ20 జట్టుకు కొత్త కెప్టెన్ రాబోతున్నాడు. ప్రస్తుత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ను తప్పించడం లాంఛనమే. సారథిగా విజయవంతమైనా వ్యక్తిగత ఫామ్ కోల్పోయాడు. దాదాపు ఏడాదిన్నర కాలంగా వరుస వైఫల్యాలతో సతమతమవుతున్నాడు. కెప్టెన్ కాబట్టే జట్టులో కొనసాగుతున్నాడన్న అభిప్రాయం కూడా వినిపించింది. ఇటీవల ఐపీఎల్ లోనూ సూర్యకుమార్ తీవ్రంగా నిరాశపరిచాడు.
మిస్టర్ 360గా అభిమానులు పిలుచుకునే సూర్యకుమార్ నుంచి అలాంటి ఇన్నింగ్స్ వచ్చి చాలా నెలలే అయింది. పైగా వయసు మీద పడుతున్న నేపథ్యంలో టీ20 జట్టు కెప్టెన్సీని(T20 Captain) యువ ఆటగాళ్లలో ఒకరికి అప్పగించాలని బీసీసీఐ భావిస్తోంది. దీనికి సంబంధించి రెండు రోజుల్లో కీలక ప్రకటన వెలువడే అవకాశముంది. ప్రస్తుతం టీ20 కెప్టెన్సీ(T20 Captain) రేసులో మూడు పేర్లు వినిపిస్తున్నాయి.
శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్ తో పాటు తెలుగు కుర్రాడు తిలక్ వర్మ రేసులో ఉన్నారు. ఈ ముగ్గురిలో శ్రేయాస్ అయ్యర్ కాస్త ముందున్నాడు. సారథిగా శ్రేయాస్ కు మంచి రికార్డుంది. ఐపీఎల్ లో కోల్ కతా నైట్ రైడర్స్ ను ఛాంపియన్ గా నిలిపిన అయ్యర్ గత ఏడాది పంజాబ్ కింగ్స్ ను ఫైనల్ కు చేర్చాడు.
జట్టును నడిపించడంలో శ్రేయాస్ కు మంచి మార్కులే పడ్డాయి. పైగా కెప్టెన్సీ ఒత్తిడి లేకుండా బ్యాటర్ గానూ రాణిస్తున్నాడు. ఇది కూడా శ్రేయాస్ ను కెప్టెన్సీలో రేసులో ముందు నిలబెట్టింది. ఇటీవల ముగిసిన ఐపీఎల్ సీజన్ లో శ్రేయాస్ 170కి పైగా స్ట్రైక్ రేట్ తో 498 పరుగులు చేశాడు.

ఈ సానుకూల అంశాలతోనే బీసీసీఐ సెలక్షన్ కమిటీ శ్రేయాస్ వైపే మొగ్గుచూపుతున్నట్టు సమాచారం. అయితే దీనిపై హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తో ఏకాభిప్రాయం కుదర్లేదని తెలుస్తోంది. గంభీర్ శ్రేయాస్ కంటే సంజు శాంసన్, ఇషాన్ కిషన్ పేర్లు ప్రతిపాదించినట్టు వార్తలు వస్తున్నాయి. హైదరాబాదీ బ్యాటర్ తిలక్ వర్మ పేరు కూడా చర్చకు వచ్చినట్టు బోర్డు వర్గాలు తెలిపాయి.
దీనికి అజిత్ అగార్కర్ సారథ్యంలోని సెలక్షన్ కమిటీ అంగీకరించలేదనీ, శ్రేయాస్ ను ఎంపిక చేద్దామని చెప్పినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో గంభీర్ తో మళ్లీ చర్చించి శనివారం అధికారిక ప్రకటన చేసే అవకాశాలున్నాయి. వచ్చే టీ20 ప్రపంచకప్ ను దృష్టిలో ఉంచుకునే సారథిని ఎంపిక చేయనున్నట్టు తెలుస్తోంది. పదే పదే కెప్టెన్ ను మార్చడం జట్టులో ఉన్న మంచి వాతావరణంపై ప్రభావం చూపిస్తుందని సెలెక్టర్లు భావిస్తున్నారు.
HDFC : హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డ్ యూజర్లకు షాక్..జులై 1 నుంచి మారనున్న ఈ రూల్స్





