Live-in Relationship : ముందు సహజీవనం నచ్చితేనే పెళ్లి.. ఎక్కడో కాదు మన దగ్గరే..!
Live-in Relationship : ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ప్రాంతంలో నివసించే మురియా (Muria) తెగ వినూత్నమైన ఆచారం ఉంది. ఇక్కడ యువతీ యువకులు పెళ్లి(Marriage)కి ముందే కలిసి ఉండేలా పెద్దలు ప్రోత్సహిస్తారు.

Live-in Relationship : ఆధునిక సమాజంలో ‘లివ్-ఇన్ రిలేషన్‌షిప్’ అనేది పాశ్చాత్య ధోరణిగా చూస్తుంటాం. కానీ, మన భారతదేశంలోనే కొన్ని ప్రాచీన గిరిజన సమూహాలు దశాబ్దాలుగా ఈ విధానాన్ని తమ సంప్రదాయంలో భాగంగా పాటిస్తున్నాయి. ఒకరితో ఒకరు పూర్తిగా పరిచయం పెంచుకుని, సర్దుకుపోగలమని నమ్మకం కుదిరాకే పెళ్లి బంధంలోకి అడుగుపెట్టడం వీరి ప్రత్యేకత. ప్రేమకు, అనుబంధానికి సరికొత్త కోణాన్ని చూపే ఈ గిరిజన తెగల విశేషాలను తెలుసుకుందాం.
Live-in Relationship
పెళ్లికి ముందే కలిసి జీవించే జంట..మురియా తెగ (ఛత్తీస్‌గఢ్)
ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ప్రాంతంలో నివసించే మురియా (Muria) తెగ వినూత్నమైన ఆచారం ఉంది. ఇక్కడ యువతీ యువకులు పెళ్లి(Marriage)కి ముందే కలిసి ఉండేలా పెద్దలు ప్రోత్సహిస్తారు. వీరిద్దరి కోసం ‘ఘోతుల్’ అనే ప్రత్యేకమైన వెదురు గుడిసెను నిర్మిస్తారు. గ్రామంలోని అబ్బాయిలు, అమ్మాయిలు ఇక్కడ సమావేశమై, ఆటపాటల్లో మునిగిపోతారు. అబ్బాయిలు చేతి కళతో వెదురు దువ్వెనలు తయారుచేస్తే, నచ్చిన అబ్బాయి చేసిన దువ్వెనను అమ్మాయి దొంగిలిస్తుంది. ఇది ఆమె ప్రేమను సూచించే సంకేతం. ఆ తర్వాత ఈ జంట ‘ఘోతుల్’లోనే కొంతకాలం సహజీవనం సాగిస్తారు. ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాతే, పెద్దలు వారి పెళ్లికి ఆమోదం తెలుపుతారు. ఈ విధానం వల్ల వారి సమాజంలో విడాకులు చాలా అరుదుగా ఉంటాయని అంటారు.
ఆర్థిక భారం లేని జీవిత భాగస్వామ్యం..కోర్వా తెగ (జార్ఖండ్)
జార్ఖండ్‌లో విస్తరించి ఉన్న కోర్వా(Korwa) తెగ సంప్రదాయం కాస్త భిన్నంగా ఉంటుంది. ఇక్కడ పెళ్లి వేడుకల ఖర్చులు భరించలేక, చాలామంది జంటలు పెళ్లి చేసుకోకుండానే జీవితాంతం కలిసి జీవిస్తారు. దీన్ని వారు ‘ధుకు వివాహం’ అని పిలుస్తారు. జంటలు దశాబ్దాల తరబడి, చివరికి పిల్లలు పుట్టినా సరే, నిజమైన భార్యాభర్తల్లాగే బంధాన్ని కొనసాగిస్తారు. ఇంటి బాధ్యతలు, పిల్లల బాగోగులు అన్నీ కలిసి పంచుకుంటారు. ఆర్థిక కష్టాలు పీడిస్తున్నా, అనుబంధానికి విలువనిచ్చే వారి దృక్పథం ఆలోచింపజేస్తుంది.
ఫెయిర్’లోనే ప్రేమ, బంధానికి ఓ పరీక్ష. గరాసియా తెగ (రాజస్థాన్, గుజరాత్)
రాజస్థాన్, గుజరాత్ సరిహద్దుల్లో నివసించే గరాసియా(Garasia) తెగలో ప్రేమకు ఒక ప్రత్యేకమైన వేదిక ఉంది. ఇక్కడ అమ్మాయిలు తమ భాగస్వామిని ఒక ప్రత్యేకమైన జాతరలో ఎంపిక చేసుకుంటారట. రెండు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవంలో యువతీ యువకులు కలిసి సరదాగా గడుపుతారు. ఒకరికొకరు నచ్చితే, వారు పెళ్లికి ముందే కొంతకాలం సహజీవనం చేస్తారు. ఈ సహజీవనానికి ముందు, వరుడి కుటుంబం వధువు కుటుంబానికి కొంత కట్నం ఇస్తుంది. ఈ ‘ట్రయల్’ పీరియడ్‌లో జంటలు బాగా దగ్గరైతే వివాహం చేసుకుంటారు. ఒకవేళ ఇష్టపడకపోతే, పిల్లలు పుట్టినా విడిపోవడానికి వారికి స్వేచ్ఛ ఉంటుంది. విడిపోయిన అమ్మాయి మరోసారి సంతలో కొత్త భాగస్వామిని ఎంచుకోవచ్చు. ఈ ఆచారం వల్ల వరకట్న వేధింపులు, గృహహింస వంటి సమస్యలు తగ్గాయని ఈ తెగ ప్రజలు చెబుతారు.
మహిళా సాధికారతకు అసలు సిసలు నిదర్శనంగా ..ఖాసీ తెగ (మేఘాలయ)
సాధారణంగా పెళ్లయ్యాక వధువు అత్తవారింటికి వెళ్తుంది. కానీ మేఘాలయలోని ఖాసీ(Khasi) తెగలో ఇది తలకిందులు. ఇక్కడ అబ్బాయే అమ్మాయి ఇంటికి వెళ్లి, ఆమె ఇంట్లోనే సహజీవనాన్ని ప్రారంభిస్తారు. పెళ్లి చేసుకున్నా, చేసుకోకపోయినా జీవితాంతం అమ్మాయి ఇంట్లోనే ఉంటారు. ఈ తెగలో ఇంటి బాధ్యతలు, ఆస్తిపాస్తులు, చివరికి ఇంటి పేరు కూడా ఆడవాళ్ల పేరు మీదే ఉంటాయి. మగవారు ఇల్లరికపు అల్లుళ్లుగా స్థిరపడతారు. ఈ మాతృస్వామ్య (Matriarchal) వ్యవస్థ వల్ల ఈ తెగలో గృహహింస, మహిళలపై అఘాయిత్యాలు చాలా తక్కువగా ఉంటాయని విశ్లేషణలు చెబుతున్నాయి.
ఈ గిరిజన తెగల సహజీవన పద్ధతులు కేవలం బంధాలకు తొలిమెట్టుగా మాత్రమే కాకుండా, మహిళలకు స్వేచ్ఛ, ఎంపిక చేసుకునే హక్కును కల్పిస్తూ, వారిని వివక్ష నుంచి కాపాడే సామాజిక విధానాలుగా నిలుస్తున్నాయి. ఆధునిక సమాజం ఇంకా అనేక అసమానతలతో సతమతమవుతున్న వేళ, నిరక్షరాస్యులైన ఈ గిరిజన తెగలు తమదైన రీతిలో మహిళా సాధికారతను చాటిచెబుతున్న తీరు ఎంతో స్ఫూర్తిదాయకం.