RSV:హైదరాబాద్‌లో RSV అలర్ట్: ఈ వైరస్ విజృంభణపై డాక్టర్ల సూచనలు ఇవే
RSV: RSV అనేది శ్వాసకోశంపై ప్రభావం చూపే ఒక వైరస్. ఇది ముఖ్యంగా పిల్లలలో శ్వాసకోశ వ్యాధులకు ప్రధాన కారణంగా మారుతోంది.
RSV
హైదరాబాద్‌లో ఇటీవల వాతావరణంలో వచ్చిన ఆకస్మిక మార్పుల కారణంగా పిల్లలతో పాటు పెద్దలలో కూడా RSV (Respiratory Syncytial Virus) ఇన్ఫెక్షన్ తీవ్రంగా పెరుగుతోందని డాక్టర్లు స్పష్టంగా హెచ్చరిస్తున్నారు. ఈ వైరస్ వ్యాప్తి, దాని ప్రభావం,తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆరోగ్య నిపుణులు దృష్టి సారిస్తున్నారు. హాస్పిటలైజేషన్లు పెరుగుతున్న ఈ క్లిష్ట సమయంలో, ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రత, మాస్క్ వాడకం వంటి నివారణ చర్యలు పాటించడం అత్యంత అవసరం అని చెబుతున్నారు
RSV అంటే ఏమిటి? RSV అనేది శ్వాసకోశంపై ప్రభావం చూపే ఒక వైరస్. ఇది ముఖ్యంగా పిల్లలలో శ్వాసకోశ వ్యాధులకు ప్రధాన కారణంగా మారుతోంది. ఈ వైరస్ పెద్దలలోనూ, వృద్ధులలోనూ కూడా తీవ్రమైన శ్వాస సంబంధ సమస్యలను కలిగించే అవకాశం ఉంది.
చిన్నారులలో ఎక్కువగా జలుబు,దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, అలసట కనిపిస్తాయి. కొన్ని సందర్భాలలో ఊపిరితిత్తులలో ‘వీజింగ్’ (Wheezing – పిల్లి కూతలు) లేదా శ్వాస తీసుకోవడం కష్టంగా మారడం, ఆకలి తగ్గడం, నిద్రలో ఆటంకం వంటివి ఉంటాయి.
పెద్దలు , వృద్ధులలో జలుబు, దగ్గు, తలనొప్పి, తక్కువ శక్తి , అలసట వంటి లక్షణాలు ఉంటాయి.

చిన్న పిల్లలలో ఈ వైరస్ కారణంగా శ్వాసనాళాల వాపు (బ్రాంకైటిస్), ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ (న్యుమోనియా) వంటి తీవ్రమైన సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అందుకే, శ్వాస తీసుకోవడంలో కష్టం, తీవ్రమైన జ్వరం వంటి లక్షణాలు ఉంటే వేగంగా వైద్య సహాయం తీసుకోవడం చాలా అవసరం. ముఖ్యంగా గుండె లేదా ఊపిరితిత్తుల సమస్యలు ఉన్న వృద్ధులు మరింత ప్రమాదంలో ఉంటారు.
హైదరాబాద్‌లో ఇటీవల వాతావరణ మార్పుల తర్వాత RSV, ఫ్లూ, ఇతర శ్వాస సంబంధ వ్యాధుల కారణంగా పిల్లల హాస్పిటలైజేషన్లు పెరిగాయని వైద్య సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దివాలీ (దీపావళి) తర్వాత గాలిలో మార్పులు, పెరిగిన కాలుష్యం కూడా ఈ వైరస్‌ల వ్యాప్తికి దోహదపడుతున్నాయి.
హైదరాబాద్‌లో ఈ కొన్ని వారాల్లోనే RSV, ఫ్లూ ఇతర శ్వాస సంబంధ వ్యాధులతో ఆసుపత్రి పాలైన చిన్న పిల్లలు మరియు పెద్దల సంఖ్య 5,000 నుంచి 10,000 మధ్య ఉండొచ్చని ఆరోగ్య నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ సంఖ్యలు వైరస్ వ్యాప్తి తీవ్రతను స్పష్టం చేస్తున్నాయి.
RSV వంటి వైరల్ ఇన్ఫెక్షన్ల ప్రభావాన్ని తగ్గించడానికి ఆరోగ్య నిపుణులు క్రింది నివారణ చర్యలు తప్పనిసరిగా పాటించాలని సూచిస్తున్నార.
వ్యక్తిగత శుభ్రత (హైజీన్).. చేతులు తరచుగా సబ్బుతో కడుక్కోవడం, శుభ్రపరిచే ద్రావణాలను (శానిటైజర్లు) ఉపయోగించడం తప్పనిసరి. ఇంట్లో పరిసరాల శుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి.
సామాజిక దూరం.. చిన్న పిల్లలు మరియు రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వ్యక్తులను, జలుబు లేదా దగ్గు ఉన్న వ్యక్తుల నుంచి దూరంగా ఉంచడం ఉత్తమం. అనారోగ్యంగా ఉన్నవారు ఇతరులకు దూరంగా ఉండాలి.
మాస్క్ వాడకం.. ముఖ్యంగా రద్దీగా ఉండే పబ్లిక్ ప్లేసులు, బహిరంగ ప్రదేశాలలో తప్పనిసరిగా N95 లేదా నాణ్యమైన మాస్కులను ఉపయోగించడం అత్యంత కీలకం.
ఆహారం & హైడ్రేషన్.. మంచి పోషకాహారం తీసుకోవడం, రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాలను డైట్‌లో చేర్చడం, మరియు ద్రవ పదార్థాలు (ఫ్లూయిడ్స్) పుష్కలంగా తీసుకోవడం అత్యవసరం.
టీకాలు (Vaccination).. ఇన్ఫ్లుఎంజా (ఫ్లూ),ఇతర శ్వాస సంబంధ టీకాలు (అందుబాటులో ఉంటే) సమయం వచ్చినప్పుడు వేయించుకోవడం అనివార్యం. ఇది వైరస్ తీవ్రతను తగ్గిస్తుంది.
సకాలంలో వైద్య సహాయం.. శ్వాస తీసుకోవడంలో కష్టం, అధిక జ్వరం, లేదా నీరసం వంటి తీవ్రమైన లక్షణాలు ఉన్నప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలి. సొంత చికిత్సకు బదులుగా సరైన మెడికల్ సపోర్ట్ తీసుకోవడం ముఖ్యం.
శుభ్రత, మాస్కుల వాడకం , టీకాలపై దృష్టి పెట్టి, వెంటనే వైద్య సాయం పొందడం ద్వారా RSV వంటి వైరల్ ఇన్ఫెక్షన్ల ప్రభావం నుంచి పిల్లలు, పెద్దలు సురక్షితంగా ఉండొచ్చు.




One Comment