Just Andhra PradeshLatest News

Chandrababu: నోబెల్ ప్రైజ్ సాధిస్తే రూ. 100 కోట్ల బహుమతి.. చంద్రబాబు సంచలన ప్రకటన

Chandrababu :దేశంలోనే తొలిసారిగా వేలాది మంది టెక్ విద్యార్థులతో ఆన్‌లైన్‌లో 'క్వాంటమ్ టాక్' నిర్వహించి, అమరావతిని 'క్వాంటమ్ వ్యాలీ'గా మారుస్తామని చంద్రబాబు ప్రకటించారు.

Chandrababu

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని టెక్నాలజీ హబ్‌గా మార్చడమే కాదు, రాబోయే 20 ఏళ్లలో ప్రపంచం ఏ టెక్నాలజీని వాడుతుందో దానిని ఇప్పుడే ఏపీలో ప్రవేశపెట్టడం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి(Chandrababu) విజన్. ఒకప్పుడు సైబరాబాద్‌తో ఐటీ విప్లవాన్ని తెచ్చిన ఆయన, ఇప్పుడు అమరావతి వేదికగా ‘క్వాంటమ్ విప్లవానికి’ శ్రీకారం చుట్టారు.

దేశంలోనే తొలిసారిగా వేలాది మంది టెక్ విద్యార్థులతో ఆన్‌లైన్‌లో ‘క్వాంటమ్ టాక్’ నిర్వహించి, అమరావతిని ‘క్వాంటమ్ వ్యాలీ’గా మారుస్తామని చంద్రబాబు (Chandrababu)ప్రకటించారు. ఈ సదస్సు ద్వారా ఏపీ విద్యార్థుల నైపుణ్యాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం ఒక భారీ రోడ్ మ్యాప్‌ను సిద్ధం చేసింది.

అమెరికాకు సిలికాన్ వ్యాలీ ఎలాగో, భారతదేశానికి అమరావతి ‘క్వాంటమ్ వ్యాలీ’గా ఉండబోతోందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది ప్రస్తుతం మనం వాడుతున్న సూపర్ కంప్యూటర్ల కంటే లక్షల రెట్లు వేగంగా పనిచేస్తుంది. ఇది కేవలం ఐటీ రంగానికి మాత్రమే పరిమితం కాదు, వ్యవసాయం, వైద్యం, అంతరిక్ష పరిశోధనలు, రక్షణ రంగాల్లో పెనుమార్పులు తీసుకువస్తుంది. అమరావతిలో ఒక ప్రత్యేక ‘ఎకో సిస్టమ్’ను తయారు చేయడం ద్వారా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిశోధకులను, ఐటీ దిగ్గజాలను ఇక్కడికి రప్పించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. దీనివల్ల ఏపీ కేవలం సేవలను అందించే రాష్ట్రంగా కాకుండా, కొత్త టెక్నాలజీని సృష్టించే కేంద్రంగా మారుతుంది.

Chandrababu
Chandrababu

ఈ క్వాంటమ్ విద్యాసదస్సులో ఒక కీలక అంకె బయటకు వచ్చింది. రాష్ట్రం నుంచి ఏకంగా ఒక లక్ష మంది క్వాంటమ్ నిపుణులను తయారు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రోగ్రామ్ కోసం ఇప్పటికే 50 వేల మంది విద్యార్థులు, ఐటీ ఉద్యోగులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇందులో విశేషమేమిటంటే, రిజిస్టర్ చేసుకున్న వారిలో 51 శాతానికి పైగా మహిళా టెక్ విద్యార్థులే ఉండటం విశేషం. మహిళా సాధికారతకు ఇది ఒక గొప్ప సంకేతమని సీఎం కొనియాడారు. అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన 3 వేల మందికి తదుపరి స్థాయి శిక్షణ ఇస్తామని, మరో వంద మందికి ఐబీఎం (IBM), టీసీఎస్ (TCS) , సీడాక్ (C-DAC) వంటి అగ్రశ్రేణి సంస్థల్లో శిక్షణ పొందే అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు.

టెక్నాలజీ రంగంలో యువతను ప్రోత్సహించడానికి చంద్రబాబు (Chandrababu)ఒక సంచలన ప్రకటన చేశారు. క్వాంటమ్ టెక్నాలజీ రంగంలో ఎవరైనా పరిశోధనలు చేసి ‘నోబెల్ ప్రైజ్’ సాధిస్తే, వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున రూ. 100 కోట్లు నజరానాగా అందజేస్తామని ప్రకటించారు. దీని ద్వారా పరిశోధనల పట్ల విద్యార్థుల్లో ఉన్న ఆసక్తిని పెంచాలని ఆయన భావిస్తున్నారు. భవిష్యత్తులో పర్సనల్ మెడిసిన్ (వ్యక్తిగత ఔషధాలు), ప్రివెంటివ్ హెల్త్ కేర్ వంటివి క్వాంటమ్ అప్లికేషన్ల ద్వారా సాధ్యమవుతాయని, రోగాలు రాకముందే పసిగట్టే టెక్నాలజీ మన దగ్గర ఉండాలని ఆయన ఆకాంక్షించారు.

రాష్ట్రంలోని ఇతర నగరాలను కూడా టెక్ హబ్‌లుగా మారుస్తున్నట్లు సీఎం వివరించారు. విశాఖపట్నంలో గూగుల్ సంస్థ అతిపెద్ద డేటా సెంటర్ ఏర్పాటు చేయబోతోందని, భవిష్యత్తులో వైజాగ్ నాలెడ్జ్ ఎకానమీకి చిరునామాగా మారుతుందని చెప్పారు. అలాగే ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో ‘స్పేస్ సిటీ’ (అంతరిక్ష నగరం) ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. అనంతపురం ,కడప జిల్లాలను ఎలక్ట్రానిక్స్ , ఏరోస్పేస్ కేంద్రాలుగా అభివృద్ధి చేస్తామని, విశాఖ-చెన్నై ,చెన్నై-బెంగళూరు పారిశ్రామిక కారిడార్లు రాష్ట్ర రూపురేఖలను మార్చేస్తాయని ధీమా వ్యక్తం చేశారు.

దాదాపు 30 ఏళ్ల క్రితం “ప్రతి కుటుంబం నుంచి ఒక ఐటీ నిపుణుడు ఉండాలి” అని తాను ఇచ్చిన పిలుపు వల్ల ఈరోజు లక్షలాది మంది తెలుగు వారు ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగంలో స్థిరపడ్డారని చంద్రబాబు (Chandrababu)గుర్తు చేసుకున్నారు. ప్రపంచంలోని ప్రతి నలుగురు ఐటీ నిపుణుల్లో ఒకరు భారతీయుడైతే, అందులో మెజారిటీ మంది ఏపీకి చెందిన వారే ఉండటం గర్వకారణమని చెప్పారు. ఇప్పుడు అదే విజన్‌తో క్వాంటమ్ టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని, ‘ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్’ (ముందుగా మొదలుపెట్టే లాభం) మన రాష్ట్రానికి ఉండాలని పిలుపునిచ్చారు. 2047 నాటికి భారత్ 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని, అందులో ఆంధ్రప్రదేశ్ సింహభాగం వహించాలని ముఖ్యమంత్రి తన ఆకాంక్షను వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో వైసర్, క్యూబిక్ సంస్థల ప్రతినిధులతో పాటు ఐఐటీ చెన్నై, తిరుపతి డైరెక్టర్లు కూడా పాల్గొన్నారు. ఏపీలో క్వాంటమ్ టెక్నాలజీ కోసం జరుగుతున్న కృషిని వారు ప్రశంసించారు. కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ కూడా ఏపీలోని ఇంజినీరింగ్ కళాశాలల్లో టీచింగ్ ల్యాబ్‌ల ఏర్పాటుకు సహకారం అందిస్తామని హామీ ఇచ్చింది. మొత్తం మీద, చంద్రబాబు మార్క్ టెక్నాలజీ విజన్ తో అమరావతి క్వాంటమ్ వ్యాలీగా మారి ప్రపంచాన్ని శాసించే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఈ విద్యాసదస్సు నిరూపించింది.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button