Boss:మీ బాస్ ఏ రకం? మీ కొలీగ్స్ ఏ టైప్?..ఇలా తెలుసుకోండి!
Boss: DISC ప్రొఫైల్ అనేది కేవలం ఒక పరీక్ష కాదు, అది మనుషుల మధ్య వంతెన వంటిది. ఒక టీమ్‌లో ఈ నలుగురు వ్యక్తులు ఉన్నప్పుడే ఆ టీమ్ సక్సెస్ అవుతుంది.
Boss
నిన్న మనం DISC అంటే ఏమిటో (Dominance, Influence, Steadiness, Conscientiousness) వివరంగా తెలుసుకున్నాం. అయితే, ఈ కేటగిరీల గురించి కేవలం తెలుసుకోవడమే కాదు, వీటిని మన ప్రొఫెషనల్ లైఫ్‌లో ఎలా వాడుకోవాలో తెలియడం ముఖ్యం. ఎందుకంటే మనం ఆఫీసులో కలిసే బాస్ (Boss), మనతో పనిచేసే సహోద్యోగులు ఒక్కో రకమైన మనస్తత్వంతో ఉంటారు. వారిని అర్థం చేసుకుంటే సగం సమస్యలు తీరిపోతాయి.

మీ బాస్(Boss) లేదా టీమ్ లీడర్ ‘D’ (Dominance) టైప్ అయితే.. మీ బాస్(Boss) చాలా సీరియస్‌గా ఉంటూ, వెంటనే రిజల్ట్స్ కావాలని కోరుకుంటున్నారా? అయితే ఆయన కచ్చితంగా ‘D’ టైప్. ఇలాంటి వారితో మాట్లాడేటప్పుడు సోది లేకుండా సూటిగా పాయింట్‌కే రావాలి. వీరికి సమస్యల కంటే పరిష్కారాలు (Solutions) అంటే ఇష్టం. మీరు ఏదైనా ఐడియా చెబితే అది కంపెనీకి ఎంత లాభం చేకూరుస్తుందో గణాంకాలతో సహా వివరించాలి. వీరికి గౌరవం ఇవ్వడం కంటే, వీరి పనిని వేగంగా పూర్తి చేయడం ముఖ్యం అని అనుకుంటారు.
మీ టీమ్ మెంబర్ ‘I’ (Influence) టైప్ అయితే.. మీ పక్కన కూర్చునే మీ కొలీగ్ ఎప్పుడూ నవ్వుతూ, కబుర్లు చెబుతూ ఉత్సాహంగా ఉంటున్నారా? ఆయన ‘I’ టైప్. అంటే వీరితో పని చేయించుకోవాలంటే వారిని అభినందించడం (Appreciation) ముఖ్యం. వీరికి అందరిలో గుర్తింపు కావాలని కోరుకుంటారు. వీరికి బోర్ కొట్టే పనులు అప్పగిస్తే త్వరగా అలసిపోయినట్లు కనిపిస్తారు. కాబట్టి, వీరిలోని కమ్యూనికేషన్ స్కిల్స్ వాడేలా ప్రెజెంటేషన్లు లేదా మీటింగ్స్ బాధ్యత ఇస్తే అద్భుతంగా చేస్తారు.
మీ కొలీగ్ ‘S’ (Steadiness) టైప్ అయితే: ఆఫీసులో సైలెంట్‌గా తన పని తను చేసుకుపోయే వ్యక్తి ‘S’ టైప్. వీరు చాలా మంచి సపోర్టర్స్. ఏదైనా కొత్త మార్పు ఆఫీసులో వస్తే వీరు కొంచెం భయపడిపోతారు. కాబట్టి, ఏదైనా కొత్త విషయం వీరికి చెప్పేటప్పుడు ఎంతో సహనంతో, ఓపికగా వివరించాలి. వీరు గొడవలకు ఇష్టపడరు కాబట్టి, టీమ్ మధ్యలో గ్యాప్ రాకుండా వీరు కీలక పాత్ర పోషిస్తుంటారు. వీరిపై హడావిడి చేస్తే వీరు పనిలో తప్పులు చేసే అవకాశం ఉంది.
మీ పక్కన ఉన్న వ్యక్తి ‘C’ (Conscientiousness) టైప్ అయితే.. ప్రతి చిన్న విషయంలోనూ రూల్స్ మాట్లాడేవారు, పర్ఫెక్షన్ కోరుకునేవారు ‘C’ టైప్. వీరికి డీటెయిల్స్ అంటే పిచ్చి. మీరు ఏదైనా రిపోర్ట్ ఇస్తే.. అందులో చిన్న స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నా వీరు ఒప్పుకోరు. వీరితో డీల్ చేసేటప్పుడు మనం కూడా పక్కాగా ఉండాలి. ఊహాగానాలు కాకుండా, కచ్చితమైన సమాచారం (Data) తో వీరిని ఒప్పించాలి. వీరు ఒంటరిగా పని చేయడానికి ఇష్టపడతారు, కాబట్టి అనవసరమైన కబుర్లతో వీరి టైమ్ వేస్ట్ చేయకూడదని అనుకుంటారు.
DISC ప్రొఫైల్ అనేది కేవలం ఒక పరీక్ష కాదు, అది మనుషుల మధ్య వంతెన వంటిది. ఒక టీమ్‌లో ఈ నలుగురు వ్యక్తులు ఉన్నప్పుడే ఆ టీమ్ సక్సెస్ అవుతుంది. ఒకరు ప్లాన్ చేస్తే (C), ఇంకొకరు నడిపిస్తారు (D), మరొకరు అందరినీ కలుపుతారు (I), ఇంకొకరు పనిని పూర్తి చేస్తారు (S). మీ చుట్టూ ఉన్నవారు ఏ కేటగిరీకి చెందుతారో ఈరోజు గమనించి వారికి తగ్గట్లు మిమ్మల్ని మీరు కూడా కాస్త మార్చుకోగలిగితే.. రేపటి నుంచి వారితో మీ బంధం ఇంకా బాగుంటుంది.



