Bhogi:భోగి,సంక్రాంతి, కనుమ తేదీలపై క్లారిటీ.. ఏ రోజు ఏం చేస్తారు?
Bhogi:జనవరి 15, గురువారం రోజు కనుమ పండుగను జరుపుకుంటారు. వ్యవసాయానికి తోడ్పడిన పశువులను పూజించడం ఈ రోజు ప్రత్యేకత.
Bhogi
భారతీయ సంస్కృతిలో మకర సంక్రాంతికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. సూర్యుడు ధనూ రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించే ఈ సమయాన్ని మకర సంక్రమణమని పిలుస్తారు. ఈ రోజు నుంచి సూర్యుడు ఉత్తరాయణ పుణ్యకాలంలోకి ప్రవేశిస్తాడు. ఇది దేవతలకు పగలుతో సమానమని మన పురాణాలు చెబుతుంటాయి.
ఈ ఏడాది సంక్రాంతి పండుగ తేదీల విషయంలో కొందరిలో అనుమానం ఏర్పడింది. అయితే పంచాంగ గణన ప్రకారం జనవరి 14న సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. విశేషమేమిటంటే, ఈసారి మకర సంక్రాంతి పర్వదినం రోజే ఏకాదశి తిథి కూడా కలిసి రావడంతో ఈ రోజుకు ఆధ్యాత్మిక ప్రాముఖ్యత మరింత పెరిగింది. అందుకే ఇది భక్తులకు రెట్టింపు పుణ్యఫలాన్ని ఇచ్చే అరుదైన సందర్భంగా పండితులు చెబుతున్నారు.
ముందుగా మూడు రోజుల పండుగ తేదీలను గమనిస్తే.. జనవరి 13, మంగళవారం రోజు భోగి ( Bhogi)పండుగను జరుపుకోవాలి. ఆరోజు తెల్లవారుజామునే భోగి( Bhogi) మంటలు వేసి, పాత సామాగ్రిని దహనం చేసి, కొత్త వెలుగులతో పండుగను ప్రారంభించాలి. ఆరోజు ఇంటికి వచ్చే చుట్టాలు, కుటుంబసభ్యుల కోసం పిండివంటలు చేస్తారు.

ఇక జనవరి 14, బుధవారం రోజు మకర సంక్రాంతి ప్రధాన పండుగ. సూర్యుడు మధ్యాహ్నం 3 గంటల 13 నిమిషాలకు మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ సమయంలో మకర సంక్రాంతి పుణ్యకాలం మధ్యాహ్నం 3:13 నుంచి సాయంత్రం 5:45 వరకు ఉంటుందని పండితులు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా ‘మహా పుణ్యకాలం’ అనేది మధ్యాహ్నం 3:13 నుంచి సాయంత్రం 4:58 వరకు ఉంటుంది. ఈ రెండు గంటల 32 నిమిషాల వ్యవధిలో చేసే పవిత్ర స్నానాలు, సూర్య ఆరాధన, దానధర్మాలు అత్యంత శక్తివంతమైన ఫలితాలను ఇస్తాయని పండితులు చెబుతున్నారు.
సంక్రాంతి పండుగ కేవలం ఆధ్యాత్మికమే కాదు. ఇది ప్రకృతికి కృతజ్ఞత తెలిపే పండుగ కూడా. రైతులు పండించిన పంట చేతికి వచ్చే సమయం కావడంతో పల్లెల్లో ఆనందాలు మిన్నంటుతాయి. ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు, గొబ్బెమ్మలు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల ఆటలతో వాతావరణం అంతా కోలాహలంగా మారుతుంది.
పండుగలో భాగంగా నువ్వులు, బెల్లం కలిపి తయారు చేసిన వంటకాలను స్వీకరించడం వెనుక ఆరోగ్య రహస్యం కూడా ఉంటుంది. చలికాలంలో శరీరానికి అవసరమైన వేడిని, శక్తిని ఇవి అందిస్తాయి.
ఇక జనవరి 15, గురువారం రోజు కనుమ పండుగను జరుపుకుంటారు. వ్యవసాయానికి తోడ్పడిన పశువులను పూజించడం ఈ రోజు ప్రత్యేకత. కొంతమంది ముక్కనుమను కూడా జరుపుకొంటారు
ఈ ఏడాది సంక్రాంతి పుణ్యకాలం మధ్యాహ్నం సమయంలో రావడం వల్ల, పవిత్ర నదీ స్నానాలు చేసేవారు, దానాలు ఇచ్చేవారు ఆ సమయాన్ని కచ్చితంగా పాటించాలని శాస్త్రాలు చెబుతున్నాయి.
ముఖ్యంగా పితృ దేవతలకు తర్పణాలు వదలడానికి, ధాన్యం లేదా బట్టలను దానాలు చేయడానికి మధ్యాహ్నం 3 గంటల తర్వాత సమయం అత్యంత శ్రేష్టమైనది. కొత్త అల్లుళ్ల రాకతో, పిండివంటల ఘుమఘుమలతో ప్రతీ తెలుగిల్లు ఈ సంక్రాంతికి ఒక కొత్త వెలుగును సంతరించుకోబోతోంది. ప్రకృతిని ప్రేమిస్తూ, సంప్రదాయాలను గౌరవిస్తూ జరుపుకునే ఈ సంక్రాంతి ప్రతీ ఒక్కరి జీవితాల్లో సుఖశాంతులను నింపాలని కోరుకుందాం.
Venezuela:మదురో అరెస్ట్ తర్వాత చమురు దేశంలో మూడు ముక్కల యుద్ధం



