Winter:శీతాకాలంలో కీళ్ల నొప్పులా? ఈ సహజమైన పద్ధతులతో చెక్ పెట్టండి!
Winter: చలి ఎక్కువగా ఉన్నప్పుడు అల్లం టీ లేదా పసుపు కలిపిన పాలు తాగడం వల్ల శరీరంలో వాపులు తగ్గి నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.
Winter
చలికాలం వచ్చిందంటే చాలు చాలామందిలో కీళ్ల నొప్పులు, ఒళ్లు నొప్పులు ఎక్కువవుతాయి. అయితే ఒకప్పుడు వయసు పైబడిన వారిలోనే కనిపించే ఈ సమస్య మిడిల్ ఏజ్ వాళ్లలో చివరకు యువతలో కూడా ఈ సమస్య కనిపిస్తోంది.
వాతావరణంలో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు తగ్గడం వల్ల కండరాలు బిగుసుకుపోయి, రక్త ప్రసరణ నెమ్మదించడం వల్ల ఈ నొప్పులు వస్తుంటాయి. ఈ సమయంలో కేవలం పెయిన్ కిల్లర్స్ వాడటం కంటే, ఆహారపు అలవాట్లు , కొన్ని జాగ్రత్తల ద్వారా వీటిని తగ్గించుకోవచ్చు.
ముందుగా ఏ వయసు వారయినా సరే ఒంటిని వెచ్చగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. చలి గాలి తగలకుండా స్వెటర్లు లేదా దళసరిగా ఉన్న బట్టలు ధరించాలి. దీనివల్ల శరీర ఉష్ణోగ్రత స్థిరంగా ఉండి కండరాలు ఫ్రీగా ఉంటాయి.

ఆహార విషయానికి వస్తే, ఈ కాలంలో నువ్వులు, బెల్లం, వేరుశనగలు తీసుకోవడం చాలా మంచిది. వీటిలో ఉండే పోషకాలు శరీరానికి వేడిని ఇస్తాయి. అలాగే ఎముకలను బలంగా ఉంచుతాయి.చలి ఎక్కువగా ఉన్నప్పుడు అల్లం టీ లేదా పసుపు కలిపిన పాలు తాగడం వల్ల శరీరంలో వాపులు తగ్గి నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.
ప్రతిరోజూ ఉదయం కనీసం 20 నిమిషాల పాటు అయినా ఎండలో ఉండటం వల్ల శరీరానికి విటమిన్ డి లభిస్తుంది. ఇది ఎముకల ఆరోగ్యానికి చాలా అవసరం. కీళ్ల నొప్పులు ఉన్నవారు వ్యాయామం చేయడం కష్టమని చాలామంది అనుకుంటారు. అందుకే వాటి గురించి ఆలోచన కూడా చేయరు. కానీ తేలికపాటి స్ట్రెచింగ్ వ్యాయామాలు వంటివి చేయడం వల్ల కీళ్లలో కదలికలు మెరుగుపడతాయి.
రాత్రి పడుకునే ముందు నువ్వుల నూనె కానీ ఆవనూనెను కానీ కొంచెం వేడి చేసి నొప్పులు ఉన్న చోట మెల్లగా మసాజ్ చేస్తే రక్త ప్రసరణ పెరిగి నొప్పి తగ్గుతుంది. నీరు ఎక్కువగా తాగడం మర్చిపోకూడదు. చలికాలంలో దాహం వేయకపోయినా శరీరానికి నీరు అవసరం అన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. ఈ చిన్న మార్పులు చేయడం ద్వారా శీతాకాలపు నొప్పుల నుంచి బయటపడొచ్చు.
America:అమెరికాలో తెలుగు యువతి హత్య.. నిందితుడు ఎక్కడ దొరికాడంటే.. ?



