Digital Arrest:డిజిటల్ అరెస్ట్ చేస్తే మిమ్మల్ని మీరు ఇలా కాపాడుకోండి..!
Digital Arrest:మీరు ఎవరికీ ఫోన్ చేయకూడదని, గది నుంచి బయటకు వెళ్లకూడదని చెబుతూ మిమ్మల్ని కంగారు పెట్టేలా మాట్లాడుతూ మానసికంగా బందీ చేస్తారు.
Digital Arrest
టెక్నాలజీ పెరిగే కొద్దీ సైబర్ నేరగాళ్లు సామాన్యులను, అమాయకులను దోచుకోవడానికి సరికొత్త దారులను వెతుకుతున్నారు. అందులో ప్రస్తుతం దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్న కొత్తరకం క్రైమ్ ..డిజిటల్ అరెస్ట్(Digital Arrest).
అసలు పోలీసులకు లేదా దర్యాప్తు సంస్థలకు డిజిటల్ గా ఒక వ్యక్తిని అరెస్ట్(Arrest) చేసే అధికారం ఉందా? అంటే..కచ్చితంగా లేదని చట్టం చెబుతోంది. కానీ, కేటుగాళ్లు మాత్రం డిజిటల్ అరెస్ట్(Digital Arrest) పేరుతో భయపెట్టి లక్షలాది రూపాయలు కాజేస్తున్నారు. దీని గురించి ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్ వాడే ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఈ మోసం ఎలా జరుగుతుందంటే?..మొదట మీకు ఒక వీడియో కాల్ వస్తుంది.అందులో అవతలి వ్యక్తి పోలీస్ డ్రెస్ లోనో లేదా సీబీఐ, ఈడీ (ED) ఆఫీసర్ లానో కనిపిస్తాడు. మీ పేరు మీద ఒక డ్రగ్స్ పార్శిల్ పట్టుబడిందనో లేక మీ ఆధార్ కార్డు ఉపయోగించి ఎవరో తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడ్డారనో భయపెడతారు.
ఆపై మిమ్మల్ని వీడియో కాల్ లోనే ఉండాలని, ఫోన్ కట్ చేస్తే పోలీసులు ఇంటికి వచ్చి అరెస్ట్ చేస్తారని వాళ్లు బెదిరిస్తారు. మీరు ఎవరికీ ఫోన్ చేయకూడదని, గది నుంచి బయటకు వెళ్లకూడదని చెబుతూ మిమ్మల్ని కంగారు పెట్టేలా మాట్లాడుతూ మానసికంగా బందీ చేస్తారు. దీనినే డిజిటల్ అరెస్ట్(Digital Arrest) అని పిలుస్తారు. మీరు భయపడిపోయి, ఆ కేసు నుంచి బయటపడటానికి ఏం చేయాలని అడిగితే.. వెంటనే సెటిల్మెంట్ పేరుతో లక్షల రూపాయలు వారి అకౌంట్స్ లోకి తెలివిగా ట్రాన్స్ఫర్ చేయించుకుంటారు.

నిజానికి భారత చట్టాల ప్రకారం ఏ పోలీసు అధికారి కానీ దర్యాప్తు సంస్థ అధికారి కానీ వీడియో కాల్ లో మిమ్మల్ని విచారించరు .. అరెస్ట్ చేయరు. నిజంగా ఏదైనా కేసు ఉంటే వారు నేరుగా ఇంటికి వస్తారు లేదా రాతపూర్వకమైన నోటీసులు పంపిస్తారు. పోలీసులు ఎప్పుడూ వీడియో కాల్ లో డబ్బులు డిమాండ్ చేయరన్న విషయాన్ని ప్రతీ ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. సైబర్ నేరగాళ్లు స్క్రైప్ (Skype) లేదా వాట్సాప్ వీడియో కాల్స్ లో నకిలీ పోలీస్ స్టేషన్ సెటప్ ని క్రియేట్ చేసి మిమ్మల్ని నమ్మిస్తారు. ఇది పూర్తిగా ఫేక్ అని గుర్తుంచుకోవాలి.
మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలంటే..ఎప్పుడైనా మీకు గుర్తు తెలియని నెంబర్ నుంచి వీడియో కాల్ వచ్చి, వారు తాము పోలీసులమని చెబితే వెంటనే భయపడకండి. ముందుగా ఆ కాల్ కట్ చేసి వెంటనే మీ కుటుంబ సభ్యులకు లేదా స్నేహితులకు సమాచారం ఇవ్వాలి..
వారు మిమ్మల్ని ఒంటరిగా ఉన్నప్పుడే వాళ్లు టార్గెట్ చేస్తారు. వెంటనే ‘చక్షు’ (Chakshu) పోర్టల్ లో లేదా సైబర్ క్రైమ్ వెబ్‌సైట్ లో ఆ నెంబర్ ని రిపోర్ట్ చేయాలి. ఒకవేళ మీరు మోసపోయారని అనిపిస్తే, ఆలస్యం చేయకుండా 1930 నెంబర్ కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలి. టెక్నాలజీ ప్రపంచంలో అప్రమత్తంగా ఉండటమే మనకు అసలైన రక్షణ అన్న విషయాన్ని ఎప్పుడూ గుర్తు పెట్టుకోవాలి.
Indian Army : రాత పరీక్ష లేదు-నెలకు రూ.1.77 లక్షల జీతం..ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు గోల్డెన్ ఛాన్స్



