Just National

Kalyani Shinde : ఎవరీ కళ్యాణీ షిండే.. నాన్న కష్టాన్ని ఎలా తీర్చింది? 

Kalyani Shinde : కంప్యూటర్ ఇంజినీరింగ్ విద్యార్థిని అయిన కళ్యాణి, తన డిగ్రీ పూర్తయ్యే వరకూ కూడా వెయిట్ చేయలేదు.

Kalyani Shinde : ఎవరైనా ఊరికే ఫేమస్ అవరు. దాని వెనుక వారి ఆలోచన, కష్టం, శ్రమ, పట్టుదల ఎన్నో ఉంటాయి. కుటుంబంలో కష్టమో.. తాను పర్సనల్‌గా ఎదుర్కొన్న నష్టమో.. సొసైటీలో ఫేస్ చేస్తున్న సమస్యో.. ఏదైనా సరే, తనదిగా భావించి, దాని కోసం కృషి చేసినప్పుడే ఆ ఫలితం దక్కుతుంది. నలుగురి కష్టాన్ని పంచుకుని, తానొక వినూత్న పరిష్కారం చూపినప్పుడే వారి విలువ అందరికీ తెలుస్తుంది. దానివల్ల వారికి లాభం దక్కకపోయినా, చరిత్రలో వారి పేరు శాశ్వతంగా నిలిచిపోతుంది. ఇలాంటి కోవకు చెందిన యువతే కళ్యాణీ షిండే(Kalyani Shinde) నాన్న కోసం పడిన తపన వల్ల ఇప్పుడు అక్కడ ఎంతోమంది రైతులు నిత్యం ఆమె పేరు చెప్పుకునేలా చేసింది.

Kalyani Shinde

ప్రతి ఏటా తన తండ్రి పంటలో సగానికి సగం కోల్పోవడం కళ్యాణిని చిన్నప్పటి నుంచీ కలిచివేసింది. లక్షల టన్నుల ఉల్లి (onion) పంట, కోసిన తర్వాత కుళ్లిపోవడాన్ని చూసిన ఆమె గుండె తల్లడిల్లింది. ఇది కేవలం తన కుటుంబ సమస్య కాదు. ఏటా రూ.40,000 కోట్ల నష్టాన్ని కలిగించే జాతీయ స్థాయి సమస్య అని ఆమె గుర్తించింది.

మన ఇళ్లలో ఒక ఉల్లిపాయ కుళ్లిపోతే పెద్ద నష్టం అనిపించదు. కానీ రైతులకు, అది జీవన్మరణ (life-or-death) సమస్య. పొలంలో పడిన కష్టం మొత్తం వృధా అయిపోతుంది.  మహారాష్ట్రలో, తన తండ్రి చేసే వ్యవసాయంలో పాత పద్ధతుల్లో, ఉల్లి కుళ్లిన వాసన ముక్కుకు తగిలేసరికి, సగం పంట అప్పటికే చేజారిపోయేది. అప్పటి వరకు చేసిన శ్రమ, పడిన పెట్టుబడి అంతా నీటి పాలవుతుండేది. ఇదంతా చూసిన కళ్యాణి అందరిలా ఆ సమస్య చూసి బాధ పడుతూ కూర్చోలేదు.

అంతెందుకు కంప్యూటర్ ఇంజినీరింగ్ విద్యార్థిని అయిన కళ్యాణి, తన డిగ్రీ పూర్తయ్యే వరకూ కూడా వెయిట్ చేయలేదు. సమస్యను పరిష్కరించాలని త వెంటనే రంగంలోకి దిగింది. ఆమె లాసల్‌గావ్‌కు వెళ్లింది, ఇది ఆసియాలోనే అతిపెద్ద ఉల్లి మార్కెట్. అక్కడ రైతులతో, వ్యాపారులతో మాట్లాడి, సమస్యను లోతుగా అర్థం చేసుకుంది. కేవలం రూ. 3 లక్షల ఫండింగ్‌తో, ఆమె మొట్టమొదటి స్మార్ట్ ఉల్లిపాయ మానిటరింగ్ డివైజ్‌ని (smart onion monitoring device) తయారు చేసింది. దీనికి గోదామ్ సెన్స్ (Godaam Sense) అని పేరు పెట్టింది.

గోదామ్ సెన్స్ ఉల్లి గిడ్డంగిలో ఒక సైలెంట్ గార్డియన్‌లా పనిచేస్తుంది. అది ఉష్ణోగ్రత, తేమ, కుళ్లిపోయే ముందు విడుదలయ్యే గ్యాస్ ఎమిషన్స్‌ను రియల్ టైమ్‌లో (real-time) ట్రాక్ చేస్తుంది.. పర్యవేక్షిస్తుంది. కేవలం 1% స్టాక్ పాడవడం మొదలైన క్షణం, అది రైతులకు తమ మొబైల్ ఫోన్‌లకు అలర్ట్‌లు (alerts) పంపుతుంది.

దీనివల్ల నష్టం జరిగిన తర్వాత బాధపడే రైతులు ఇప్పుడు దాన్ని ముందుగానే తెలుసుకుంటున్నారు. పాడవడం మొదలైన ఉల్లిపాయలను వెంటనే వేరుచేసి, మిగిలిన పంటను కాపాడుకోగలుగుతున్నారు. దీనివల్ల రైతులు 20-30% ఎక్కువ ఉల్లిపాయలను కాపాడుకోగలుగుతున్నారు. అంతకుముందు అవి ఎవరికీ తెలియకుండా కుళ్లిపోయేవి. గ్రామీణ ప్రాంతాల్లో టెక్నాలజీ (technology at the grassroots level) లేకపోవడం వల్ల వ్యవసాయం చాలా నష్టపోతుందని కళ్యాణి కేంద్రం దృష్టికి తీసుకువెళ్లింది.

కళ్యాణి కథ కేవలం ఒక ఆవిష్కరణ గురించి కాదు. అది దృఢ సంకల్పానికి, ఆలోచనకు ప్రతీక. తన తండ్రి దశాబ్దాలుగా పంటలు పండించి, వాతావరణం, నిల్వ సమస్యల వల్ల నిస్సహాయంగా నష్టపోవడాన్ని ఆమె చూసింది. ఆ కష్టాన్ని కాపాడాలని ఆమె కోరుకుంది. కళ్యాణి ఆవిష్కరణ ఇంజినీరింగ్ (engineering) నైపుణ్యాన్ని, ఎంపథీని (empathy), ఆధునిక డేటా విశ్లేషణను, సాంప్రదాయ వ్యవసాయ జ్ఞానాన్ని ఒకచోట చేర్చింది. అత్యంత ముఖ్యంగా, ఇది టెక్నాలజీ (technology) పట్ల రైతుల విశ్వాసాన్ని పెంచింది.

కళ్యాణి షిండే కేవలం ఒక డివైజ్‌ని తయారు చేయలేదు. ఆమె లక్షలాది మంది రైతుల జీవితాలను మార్చేసింది. కోట్లాది రూపాయల జాతీయ నష్టాన్ని ఆపింది. తన తండ్రికి గర్వకారణంగా నిలవడమే కాకుండా, యావత్ భారతదేశానికి ఆదర్శంగా మారింది. ఆమె చూపిన మార్గం, గ్రామీణ యువతకు, సమస్యలను అవకాశాలుగా మలుచుకోవడానికి స్ఫూర్తినిస్తుంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button