Latest News

KCR:సిట్ ముందుకు రేపు కేసీఆర్..రాష్ట్రవ్యాప్త నిరసనలకు బీఆర్ఎస్ పిలుపు.. సిట్ ప్రశ్నావళిలో ఏముంది?

KCR: ఫిబ్రవరి 1, ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు నందినగర్‌లోని తన నివాసంలోనే ఆయన సిట్ అధికారుల ప్రశ్నలకు సమాధానం ఇవ్వబోనున్నారు.

KCR

తెలంగాణను కొన్నాళ్లుగా కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ ఇప్పుడు తుది దశకు చేరుకుంటుంది. ఈ కేసులో విచారణ ఎదుర్కోవాలని ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) పంపిన నోటీసులకు సంబంధించి నాలుగు రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్(KCR) సిట్ విచారణకు హాజరు కావాలని సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఫిబ్రవరి 1, ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు నందినగర్‌లోని తన నివాసంలోనే ఆయన సిట్ అధికారుల ప్రశ్నలకు సమాధానం ఇవ్వబోనున్నారు.

అయితే కేసీఆర్‌ను విచారణకు పిలవడాన్ని రాజకీయ కక్షసాధింపుగా మొదటినుంచి కూడా బీఆర్ఎస్ చెబుతోంది . ఈ చర్యను నిరసిస్తూ ఆదివారం రాష్ట్రవ్యాప్త నిరసనలకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు ఇచ్చారు. 12 వేలకు పైగా గ్రామాల్లో ప్రభుత్వ దిష్టిబొమ్మల దహనం, నియోజకవర్గ కేంద్రాల్లో బైక్ ర్యాలీలు, నల్లజెండాలతో నిరసనలు తెలపాలని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు ఆదేశాలు జారీ చేశారు.

ముఖ్యంగా పోలీసులు, ప్రభుత్వ వైఖరిని ఎండగట్టాలని, అయితే ఈ నిరసనలు శాంతియుతంగా జరగాలని పార్టీవర్గాలు నిర్ణయించుకున్నాయి. హైదరాబాద్‌లోని నేతలు భారీ సంఖ్యలో తెలంగాణ భవన్‌కు తరలిరావాలని పిలుపు ఇవ్వడంతో అక్కడ ఇప్పటికే ఏర్పాట్లు ముమ్మరమయ్యాయి.

కేసీఆర్‌ను విచారించడానికి సిట్ అధికారులు ఇప్పటికే సుదీర్ఘ ప్రశ్నావళిని సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ప్రధానంగా..ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ1గా ఉన్న ప్రభాకర్ రావు పునర్నియామకం వెనుక ఉన్న కారణాలేంటి అని అడగనున్నారు. నిబంధనలకు విరుద్ధంగా రిటైర్డ్ అధికారిని ఇంటెలిజెన్స్ ఓఎస్డీగా నియమించాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించబోతున్నట్లు తెలుస్తోంది.

నోట్ ఫైల్స్ ఆమోదం, అధికారులకు అందిన ఆదేశాల వెనుక రాజకీయ ప్రమేయం ఉందా? అనే కోణాల్లో అధికారులు కేసీఆర్ ప్రశ్నించే అవకాశం ఉంది. ఇప్పటికే హరీశ్ రావు, కేటీఆర్, సంతోష్ రావులను విచారించిన సిట్.. ఇప్పుడు కేసీఆర్(KCR) నుంచి మరింత కీలక సమాచారాన్ని సేకరించాలని భావిస్తోంది.

KCR
KCR

ఒకవైపు సిట్ విచారణ, మరోవైపు బీఆర్ఎస్ నిరసనలతో ఆదివారం తెలంగాణ రాజకీయాలు వేడెక్కబోతున్నాయి. రాజకీయ కక్షసాధింపా లేక చట్టం తన పని తాను చేసుకుపోతుందా అనేది చూడాలి మరి. మరోవైపు ఈ పరిణామాలు రాబోయే మున్సిపల్ ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపుతాయో అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

 

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button