Budget:బడ్జెట్ 2026 సామాన్యుడికి వరం అవుతుందా? భారం మిగులుస్తుందా?
Budget: పెరుగుతున్న ధరల మధ్య.. సామాన్యుడి జేబు ఖర్చులు తగ్గించేలా కేంద్రం ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతోంది? ఏవి చౌకవుతాయి? ఏవి ప్రియమవుతాయి అనే అంశాలపై చర్చ సాగుతోంది.
Budget
దేశవ్యాప్తంగా అందరి కళ్లు ఇప్పుడు ఢిల్లీ మీదే ఉన్నాయి. ఫిబ్రవరి 1వ తేదీ ఉదయం 11 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్( Budget)ను ప్రవేశపెట్టబోతున్నారు. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు అలాగే వేతన జీవులు ఈసారి బడ్జెట్‌పై కొండంత ఆశలు పెట్టుకున్నారు. పెరుగుతున్న ధరల మధ్య.. సామాన్యుడి జేబు ఖర్చులు తగ్గించేలా కేంద్రం ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతోంది? ఏవి చౌకవుతాయి? ఏవి ప్రియమవుతాయి అనే అంశాలపై చర్చ సాగుతోంది.
మధ్యతరగతి ఆశలు- ఆదాయపు పన్ను ఊరట ఉంటుందా లేదా?.. వేతన జీవుల ప్రధాన కోరిక ఇన్కమ్ ట్యాక్స్ (Income Tax) మినహాయింపు పరిమితిని పెంచడం. ఇప్పుడు ఉన్న స్టాండర్డ్ డిడక్షన్‌ను పెంచి, ట్యాక్స్ స్లాబుల్లో మార్పులు చేస్తేనే మధ్యతరగతి ప్రజల చేతిలో నాలుగు డబ్బులు మిగులుతాయి. అయితే పన్ను మినహాయింపు పరిమితిని రూ. 5 లక్షల వరకు పెంచే అవకాశం ఉందన్న వార్తలు ఈమధ్య మీడియాలో, సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. ఇదే కనుక జరిగితే సామాన్యుడికి ఇది పెద్ద దీపావళి అనే చెప్పొచ్చు.
గృహిణుల బడ్జెట్- వంటగదిపై వరాలు ఉంటాయా?..ఏడాది కాలంగా నిత్యావసర వస్తువులు, వంట గ్యాస్ ధరలు పెరుగుతూ సామాన్యుడిని బెంబేలెత్తిస్తున్నాయి. అయితే ఈ బడ్జెట్‌లో ఆహార సబ్సిడీలను పెంచి, వంట నూనెలు , పప్పు దినుసుల ధరలను నియంత్రించేలా చర్యలు ఉంటాయని ఇది గృహిణులకు శుభవార్త అని విశ్లేషకులు చెబుతున్నారు.మరోవైపు పెట్రోల్, డీజిల్ ధరలపై పన్నులు తగ్గినా కూడా.. రవాణా ఖర్చులు తగ్గి నిత్యావసరాల ధరలు దిగివచ్చే అవకాశం ఉంటుందన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
రైతులకు, నిరుద్యోగులకు ప్రాధాన్యత ఉంటుందా? ..మున్సిపల్ ఎన్నికలు , కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో రైతులకు ఇచ్చే కిసాన్ సమ్మాన్ నిధి మొత్తాన్ని పెంచే అవకాశముందన్న టాక్ కూడా వినిపిస్తోంది. అలాగే ఉపాధి హామీ పథకానికి నిధుల కేటాయింపు , కొత్త పరిశ్రమల స్థాపన ద్వారా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంపైన కూడా మోదీ ప్రభుత్వం దృష్టి సారించొచ్చన్న వార్తలు వినిపిస్తున్నాయి.

ఏవి చౌకగా మారవచ్చు- ఏవి ప్రియమవ్వచ్చు?..ప్రతి బడ్జెట్ లోనూ కొన్ని వస్తువుల ధరలు మారుతూ ఉండటం జరుగుతూనే ఉంటుంది. ఈసారి ఎలక్ట్రానిక్ వస్తువులు, మొబైల్ ఫోన్లు, విడిభాగాల మీద దిగుమతి సుంకాలు తగ్గిస్తే అవి చౌకయ్యే అవకాశముంది. అదే సమయంలో విదేశీ మద్యం, సిగరెట్లు, విలాసవంతమైన కార్లపై పన్నులు పెంచే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
మొత్తానికి ఫిబ్రవరి 1వ తేదీన అది కూడా ప్రత్యేకంగా ఆదివారం ప్రవేశపెట్టబోయే బడ్జెట్( Budget) మోదీ ప్రభుత్వానికి ఒక అగ్నిపరీక్ష వంటిదే. ఒకవైపు అభివృద్ధిని పట్టాలెక్కించాలి..మరోవైపు సామాన్యుడికి ఊరటనివ్వాలి. మరి ఈ రెండిటినీ ప్రభుత్వం ఎలా బ్యాలెన్స్ చేస్తుందో చూడాలి.
Non Vegetarian:భారతదేశంలో పెరుగుతున్న మాంసాహారులు. . ఎవరేం తినాలనేది ఎవరు డిసైడ్ చేస్తున్నారు??



