SRH vs RCB : ఉప్పల్ లో సన్ రైజ్..ఆర్సీబీపై విజయం
SRH vs RCB : సన్ రైజర్స్ హైదరాబాద్ ఆర్సీబీపై గెలిచినా రన్ రేట్ లేకపోవడంతో మూడో స్థానానికే పరిమితమైంది
SRH vs RCB
ఐపీఎల్ 19వ సీజన్ లీగ్ స్టేజ్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ విజయంతో ముగించింది. హోంగ్రౌండ్ లో మరోసారి బ్యాటర్లు చెలరేగిపోయిన వేళ డిఫెండింగ్ ఛాంపియన్ బెంగళూరును చిత్తు చేసింది. అభిషేక్, ఇషాన్ , క్లాసెన్ విధ్వంసం సృష్టించగా.. బౌలింగ్ లోనూ రాణించింది. అయితే ఈ మ్యాచ్ లో గెలిచినా రన్ రేట్ లేకపోవడంతో మూడో స్థానానికే పరిమితమైంది.
సొంతగడ్డపై చివరి మ్యాచ్ లో టాస్ గెలిచిన సన్ రైజర్స్ హైదరాాబాద్ బ్యాటింగ్ ఎంచుకుంది. ప్రత్యర్థి ముందు భారీ లక్ష్యాన్ని ఉంచడమే లక్ష్యంగా చెలరేగిపోయింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ, హెడ్ రెచ్చిపోయారు. భారీ షాట్లతో విరుచుకుపడ్డారు. తొలి వికెట్ కు కేవలం 4 ఓవర్లలోనే 45 పరుగులు జోడించారు. హెడ్ (26) ఔటైనా.. అభిషేక్ , ఇషాన్ కిషన్ మరింత దూకుడుగా ఆడారు.
ఆర్సీబీ బౌలర్లను ఎడాపెడా బాదేశారు. వీరిద్దరూ కేవలం 26 బంతుల్లోనే 52 పరుగులు జోడించారు. అభిషేక్ శర్మ ఈ సీజన్ లో మరో హాఫ్ సెంచరీ సాధించాడు. 22 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 56 పరుగులు చేసిన అభిషేక్ రెండో వికెట్ గా వెనుదిరిగాడు. అయితే ఫామ్ లో ఉన్న క్లాసెన్ , ఇషాన్ కిషన్ తో కలిసి స్కోర్ బోర్డును పరిగెత్తించాడు.
వీరిద్దరూ కేవలం 48 బంతుల్లోనే 113 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ క్రమంలో ఇద్దరూ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. క్లాసెన్ 24 బంతుల్లో 51 (2 ఫోర్లు, 5 సిక్సర్లు) పరుగులకు ఔటవగా..తర్వాత క్రీజులోకి వస్తూనే నితీశ్ కుమార్ రెడ్డి వరుసగా రెండు సిక్సర్లు బాదాడు. అటు ఇషాన్ కిషన్ కూడా దూకుడుగా ఆడడంతో సన్ రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 255 పరుగులు చేసింది.
ఇషాన్ కిషన్ 46 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 79 రన్స్ కు చివరి బంతికి ఔటయ్యాడు. నితీశ్ రెడ్డి 12 బంతుల్లో 29 (1 ఫోర్, 3 సిక్సర్లు) నాటౌట్ గా నిలిచాడు. ఆర్సీబీ బౌలర్లో భువనేశ్వర్ , హ్యాజిల్ వుడ్ తో సహా అందరూ భారీగా పరుగులు సమర్పించుకున్నారు. రసిక్ సలామ్ దార్ 2 , కృనాల్, సుయాశ్ శర్మ ఒక్కో వికెట్ పడగొట్టారు.
తర్వాత ఛేజింగ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా దూకుడుగానే ఆడింది. ఓపెనర్ గా వచ్చిన వెంకటేశ్ అయ్యర్ రెచ్చిపోయాడు. బౌండరీలు, ,సిక్సర్ల వర్షం కురిపించాడు. కేవలం 19 బంతుల్లోనే 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 44 పరుగులకు ఔటయ్యాడు. తొలి వికెట్ కు వెంకటేశ్ అయ్యర్, కోహ్లీ 4.3 ఓవర్లలో 60 పరుగులు జోడించారు.

అయితే కోహ్లీ(15) నిరాశపరిచాడు. కాసేపటికే పడిక్కల్ (21) కూడా వెనుదిరగడంతో ఆర్సీబీ 3 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో పటిదార్, కృనాల్ పాండ్యా ఆదుకునే ప్రయత్నం చేశారు. వీరిద్దరూ మూడో వికెట్ కు 84 పరుగుల పార్టనర్ షిప్ నెలకొల్పారు. సాధించాల్సిన రన్ రేట్ పెరిగిపోవడంతో ఆర్సీబీ టాప్ ప్లేస్ లో నిలవడమే టార్గెట్ గా ఆడింది.
178 పరుగుల స్కోరును దాటడంతో అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. చివరికి ఆర్సీబీ 4 వికెట్లకు 200 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో గెలిచినా సన్ రైజర్స్ మూడో స్థానానికే పరిమితమై ఎలిమినేటర్ ఆడబోతోంది. అటు ఓడినా టాప్ ప్లేస్ నిలుపుకున్న బెంగళూరు క్వాలిఫైయర్ 1లో గుజరాత్ తో తలపడుతుంది.
America – Iran : అమెరికా, ఇరాన్ శాంతి చర్చలు..కొద్ది గంటల్లో కీలక ప్రకటన ?





