Indiramma House: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల స్టేటస్ ఇకపై ఆన్లైన్లోనే..స్పందన ఎలా ఉంది?
Indiramma House: మీ ఇల్లు మంజూరైందా లేదా, ఏ జాబితాలో ఉంది, బిల్లు ఏ దశలో ఉంది వంటి అన్ని అంశాలు ఈ వెబ్సైట్లో చూడొచ్చు.

Indiramma House
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల (Indiramma House) పథకం లబ్ధిదారులకు శుభవార్త. ఇకపై మీ ఇంటి బిల్లు స్టేటస్‌ను సులభంగా ఆన్లైన్లో తెలుసుకోవచ్చు. దీనికోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండానే, మీ బిల్లు ఏ దశలో ఉంది, ఎందుకు ఆగిపోయింది వంటి పూర్తి సమాచారాన్ని ఇప్పుడు మీ ఇంటి నుంచే పొందవచ్చు.
స్టేటస్ ఎలా తెలుసుకోవాలంటే..ఈ సేవను ఉపయోగించడం చాలా సులభం. లబ్ధిదారులు తమకు సంబంధించిన ఏదైనా ఒక నంబర్‌తో ముందుగా ఇందిరమ్మ ఇళ్ల అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేసి https://indirammaindlu.telangana.gov.in/applicantSearch లాగిన్ అవ్వాలి.
ఫోన్ నంబర్, ఆధార్ నంబర్ , రేషన్ కార్డు నంబర్, అప్లికేషన్ నంబర్.. ఈ వివరాల్లో ఏదో ఒకటి ఎంటర్ చేసి ‘Go’ పై క్లిక్ చేయగానే, మీ దరఖాస్తుకు సంబంధించిన పూర్తి వివరాలు కనిపిస్తాయి. మీ ఇల్లు మంజూరైందా లేదా, ఏ జాబితాలో ఉంది, బిల్లు ఏ దశలో ఉంది వంటి అన్ని అంశాలు ఈ వెబ్సైట్లో చూడొచ్చు. మీకు ఏమైనా అభ్యంతరాలు ఉన్నా, వాటిని కూడా ఇదే వెబ్సైట్ ద్వారా ప్రభుత్వానికి తెలియజేయవచ్చు.
తెలంగాణలో ఇప్పటివరకు 3 లక్షల ఇళ్లను ఇందిరమ్మ(Indiramma House) పథకం కింద మంజూరు చేశారు. ప్రతి లబ్ధిదారుడికి రూ. 5 లక్షల ఆర్థిక సహాయం నాలుగు విడతలలో అందిస్తున్నారు. ఈ పథకంపై ప్రజల్లో సంతృప్తితో పాటు, కొన్ని సవాళ్లు కూడా కనిపిస్తున్నాయి.
ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన ఆన్లైన్ బిల్లు స్టేటస్ సదుపాయం ప్రజల నుంచి మంచి స్పందన పొందుతోంది. దీనివల్ల లబ్ధిదారులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం తగ్గింది. ఫోన్ నంబర్, ఆధార్ నంబర్ లేదా రేషన్ కార్డు నంబర్‌తో లాగిన్ అయ్యి తమ బిల్లు ఏ దశలో ఉందో సులభంగా తెలుసుకోవడం పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారు.
అయితే, పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వచ్చినా, అర్హత ప్రమాణాల కారణంగా చాలామంది అనర్హులుగా మారడంపై కొంతమందిలో అసంతృప్తి కనిపిస్తోంది. ముఖ్యంగా సొంత స్థలం ఉన్నా.. పట్టణ ప్రాంతాల్లో ఇంటి నిర్మాణం కష్టంగా ఉన్నవారికి పథకం వర్తించకపోవడంపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
సంతృప్తి, అసంతృప్తి రెండూ ఉన్నప్పటికీ… తెలంగాణ ప్రభుత్వం ఈ పథకాన్ని రాష్ట్రంలోని 20 లక్షల ఇళ్లను(Indiramma House) నిర్మించాలనే లక్ష్యంతో కొనసాగిస్తోంది. దీనికి రూ. 22,500 కోట్లు కేటాయించింది. ప్రజల ఆకాంక్షలు, ఎదురవుతున్న సవాళ్లను సమన్వయం చేస్తూ ఈ పథకాన్ని ముందుకు తీసుకువెళ్లాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.