GST 2.0: జీఎస్టీ 2.0తో సామాన్యులకు భారం తగ్గుతుందా పెరుగుతుందా?
GST 2.0: ఇదివరకు ఉన్న నాలుగు-స్లాబ్‌ల వ్యవస్థ స్థానంలో, ఇప్పుడు కేవలం రెండు ప్రధాన రేట్లతో సరికొత్త జీఎస్టీ విధానం అమలులోకి రానుంది.

GST 2.0
ఆగస్టు 15, 2025న కేంద్రం తీసుకున్న నిర్ణయం నిజంగా సంచలనం సృష్టిస్తుంది. దేశీయ వ్యాపార, వినియోగ రంగాల్లో వేగవంతమైన మార్పులకు నాంది పలికిన ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. చాలాకాలంగా చర్చనీయాంశంగా ఉన్న జీఎస్టీ (GST 2.0)రేట్ల సరళీకరణకు కేంద్ర ప్రభుత్వం తుది రూపు ఇచ్చింది.
ఇదివరకు ఉన్న నాలుగు-స్లాబ్‌ల వ్యవస్థ స్థానంలో, ఇప్పుడు కేవలం రెండు ప్రధాన రేట్లతో సరికొత్త జీఎస్టీ విధానం అమలులోకి రానుంది. ఈ మార్పులు దేశంలోని సామాన్య ప్రజల నుంచి లగ్జరీ వస్తువులను వాడే ధనికుల వరకు అందరిపైనా ప్రభావం చూపనున్నాయి.
నూతన రేటింగ్ విధానం ప్రకారం, అత్యవసరమైన ఆహార పదార్థాలు, మందులు, కిరాణా సరుకులపై గతంలో ఉన్న 5% రేటు కొనసాగనుంది. ఇది సామాన్య వినియోగదారులకు ఒక ఊరటగా చెప్పవచ్చు. అయితే, ఎక్కువ మంది వినియోగించే సేవలు, సౌకర్యవంతమైన వస్తువులపై ఇప్పుడు 18% జీఎస్టీ వర్తిస్తుంది.
గతంలో ఉన్న నాలుగు రేట్ల వ్యవస్థ కన్నా ఇది సులభంగా ఉంటుందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. ఈ మార్పు చిన్న, మధ్యస్థ వ్యాపారులకు ఎంతో మేలు చేస్తుందని, వ్యాపార ప్రక్రియ సులభతరం అవుతుందని అంచనా వేస్తున్నారు. చిన్న వ్యాపారులకు గతంలో ఉన్న రూ. 20 లక్షల వరకు టర్నోవర్‌పై కంప్లయన్స్ భారం తగ్గే అవకాశం ఉంది.
ఈ కొత్త విధానంలో అందరి దృష్టిని ఆకర్షించిన అంశం కొత్తగా ప్రవేశపెట్టిన 40% స్లాబ్. లగ్జరీ కార్లు, ఖరీదైన దిగుమతి చేసుకున్న మద్యం, ధనికులు ఎక్కువగా వినియోగించే సేవలు, వస్తువులపై ఈ భారీ పన్ను విధించనున్నారు.
లగ్జరీ మార్కెట్‌పై దృష్టి పెట్టి, పన్ను ఆదాయాన్ని పెంచుకోవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీనివల్ల ధనవంతుల నుంచి పన్ను రూపంలో ఎక్కువ ఆదాయాన్ని సేకరించి, ఆ నిధులను అభివృద్ధి కార్యక్రమాలకు ఉపయోగించవచ్చని కేంద్రం ఆలోచన.

ఈ మార్పులపై అటు వ్యాపార వర్గాల నుంచి, ఇటు పారిశ్రామికవేత్తల నుంచి భిన్న స్పందనలు వ్యక్తమవుతున్నాయి. పన్నుల వ్యవస్థ సరళీకరణ వల్ల దీర్ఘకాలంలో పన్ను రాబడి పెరుగుతుందని, దేశ ఆర్థిక వ్యవస్థకు ఇది మంచిదని టాక్స్ కన్సల్టింగ్ గ్రూపులు అభిప్రాయపడుతున్నాయి.
అదే సమయంలో, ఈ కొత్త వ్యవస్థ పూర్తి స్థాయిలో అమలులోకి వచ్చేవరకు మార్కెట్‌లో ఎలాంటి మార్పులు వస్తాయో గమనించాలని సూచిస్తున్నాయి. చిన్న వ్యాపారులు, స్టార్టప్‌లు కూడా ఈ కొత్త విధానంతో కంప్లయన్స్ భారం తగ్గుతుందని ఆశిస్తున్నారు. అయితే, 40% లగ్జరీ స్లాబ్ వల్ల లగ్జరీ ఉత్పత్తుల అమ్మకాలు తగ్గే అవకాశం కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు.
మొత్తంగా, ఈ కొత్త జీఎస్టీ (GST 2.0) సమీకరణ దేశ పన్నుల వ్యవస్థలో ఒక విప్లవాత్మక మార్పును తీసుకురానుంది. పారదర్శకతను పెంచి, ఆర్థిక వ్యవస్థను మరింత పటిష్టం చేయాలనే లక్ష్యంతో ఈ విధానాన్ని తీసుకొచ్చారు. అయితే, నిర్దిష్ట మార్గదర్శకాలు, అమలు తేదీలు ఇంకా వెల్లడి కావాల్సి ఉంది.
Also Read: Gold price: 2030 నాటికి బంగారం రూ. 2 లక్షలు దాటిపోతుందా?