Just LiteratureLatest News

Literature : మనిషి సంగతులు

Literature  :  గెలిచినోడు,ధనవంతుడు అక్కడితో ఆగిపోడు..ఓడినోడు,పేదవాడు అడుగైనా కదలలేడు...

Literature

ఆకలి మస్తిష్కందైతే ..
కుక్షి నిండి ఆగగలడా..?
జగతి అంతా వెతికి చూస్తే
మనిషి కన్నా మించినంశం
లేదు ఎక్కడ..
మనిషికెన్ని వేషాలో
అతని తీరుకెన్ని కోణాలో..

వనం నుంచి వేరు చేసే
అమితమైన తెలివి నాడు,
వికృతంగా వేయి తలలై
విషపు బీజాలు మొలచె నేడు…

సృజన శీలై ,సృష్టికర్తై
అడుగడుగు ఎదిగినాడు
స్వార్థపరతను నీరు పోసి
ఆసాంతం పెంచినాడు…

రెండు వైపులా పదును ఉన్న
జ్ఞానమనెడి కత్తి తోటి
వికాసమనే వేషమేసి
ధ్వంస రచన చేసినాడు…

అహంకారం అగ్నిలాగా
ఆత్మనందు రగులుతుంటే
మతమనెడి ముసుగు వేసి
విషమెంతో కక్కినాడు…

కులం గోడ, భాష గోడ
గోడలెన్నో కట్టుకుంటూ
తనకు తాను రక్షణంటూ
ఆయుధాలు పట్టినాడు..

చావు మీద గెలుపు కోసం
పరిశోధనలెన్నో చేసినాడు
మరణమునే గెలిచినోడు
ఒక్కడైనా కానరాడు…

అయినా ఆశ మనిషి తీరు
ఆగదు ఆదిపత్య పోరు
ఆకలి మస్తిష్కందైతే
కుక్షి‌ నిండి ఆగగలడా…

వందలాది దేవుళ్లను
లోకమంతా నిలిపాడు
భక్తి అనే విత్తు వేసి
మాయలోన మునిగాడు..

స్వర్గం, నరకం సృష్టించి
మంచి,చెడులు చెప్పాడు
శాంతి కపోతాలెగరేస్తూ
రణ నాదం ఊదాడు…

గగనమంతా వెతుక్కుంటూ
విశ్వ వేదికెక్కాడు
పక్కవాడిని తొక్కుకుంటూ
విజయమనుకున్నాడు…

అడవి గుండె చీల్చుతూ
అవనిని గెలిచామంటూ
అంతులేని కాలుష్యం
లోకమంతా పరిచినాడు…

కన్నీటి నది పారుతుంటే
కరుణ సాగరమెండుతుంది
కాఠిన్యం మనసు చుట్టూ
కాపలాగా పెట్టాడు…

సంపదలివ్వని సాగు కన్నా
సాంకేతికత మిన్నంటే
కృత్రిమైన మేధతో
క్షుద్బాధనెలా తీర్చగలడు..

గెలిచినోడు,ధనవంతుడు
అక్కడితో ఆగిపోడు
ఓడినోడు,పేదవాడు
అడుగైనా కదలలేడు…

కోట్ల మంది మనుషులు
భూగోళం చుట్టూరా
కోట్ల కొద్దీ ఆశా జ్వాలల
రగిలే తపన ఆగేదేనాడు..? 

…..ఫణి మండల

మరిన్ని లిటరేచర్ సమాహారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

17 Comments

  1. మనిషి మనిషి మనిషి .. మనిషి మాత్రమే అంతా
    తనదే ….. సృష్టి ..
    తనదే విద్వంశం
    చాలా చక్కగా నిక్కచ్చిగా చెప్పారు ..
    KEEP IT UP PHANI SIR
    EE కవిత మనసు నుంచి povatledhu

  2. మనిషి నైజం ఎప్పటికీ మారని తీరును ఎండగట్టిన విధం బాగుంది. మన నాగరికం ఎదిగాము అనుకుంటున్నా, ఎంత అనాగరికం గా ఉన్నామో ప్రతిబింబం ఈ కవిత. గెలుపుకోసం తపన మానవత్వం నీ హత్యచేస్తుంది,పోరాటం లో కూడా హేయమైన మానవజీవిత నిజం ఈ కవిత. అర్ధవం తమైన పదవిన్యాసం గొప్పగా ఉంది.

  3. ఫణి మీరు చాలా బాగా రాస్తున్నారు నీలో మరో కోణం చూస్తున్నాను.

  4. రచన బావుంది…*కన్నీటి నది పారుతుంటే*
    *కరుణ* *సాగరమెండుతుంది*
    *కాఠిన్యం మనసు చుట్టూ*
    *కాపలాగా పెట్టాడు*👏👏🙏
    ఓ మాస్టారు కామెంట్..పేరు కృష్ణ గారు

  5. ఫణి మండల గారు,
    మనిషి నైజం గురించి విశదీకరించిన విధానం చాల బాగుంది.
    మనిషి తను ఎంతగా వైజ్ఞానికంగా ఏదిగినప్పటికీ వేసే ప్రతి అడుగు ప్రకృతి వినాశనం వైపు దారితీస్తోంది.ఒక పక్క శాంతి మంత్రాన్ని జపిస్తూ మరో పక్క యుద్ధాలు చేస్తూ స్వార్థాధిపత్యం కొరకు దేశదేశాల మధ్య చిచ్చు రాజేస్తున్నాడు.ఈ తీరు ఎప్పటికీ మారేనో కాలమే నిర్ణయించాలి.మీరు సంధించిన ఈ అస్త్రం ప్రతి స్వార్థ,క్రోధ పూరిత మనిషికి కనువిప్పు కలగాలని ఆశిస్తూ..

  6. మనిషే ప్రపంచం.
    మనసును కఠినత్వం కాపలా పెట్టుకొని
    నిమిషం కూడా తీరిక లేని యంత్రంలా
    విధ్వంస సృష్టిస్తూ ఎటు వెళ్తున్నాడో..
    చివరకు ఏమైపోతాడో.. వివరణ చాలా బాగుంది

    కవిత చాలా బాగుంది
    ఎన్నిసార్లు చదివినా
    కళ్ళను మళ్లీ మళ్లీ పదాల వెంట నడిపిస్తుంది

  7. నీ కలం నుంచి జాలువారే ప్రతి అక్షరం మనసుని తట్టి లేపుతోంది. నీ ఈ ఒరవడిని కొనసాగించు మిత్రమా! నీ కలం బలం భగవంతుడు నీకు ఇచ్చిన వరం. సామాజిక స్పృహని , నైతికతను తట్టి లేపుతున్న నీకు హృదయపూర్వక అభినందనలు మిత్రమా! నీ ప్రతి కవితలోనూ అక్షర కెరటాల పులకింతలతో అబ్బురపరిచే నీ తీరు అమోఘం అద్భుతం గురువర్యా

  8. జీవితం లో మానవత్వం అనే పదం మరిచి మనిషి గురించి చాలా చక్కగా రాసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button