Shambhala: మిస్టరీ నగరం శంబాలా గురించి తెలుసా? ఇది హిమాలయాల్లో దాగి ఉన్న స్వర్గం!
Shambhala: భారతీయ, బౌద్ధ గ్రంథాలలో రాసిన దానిని బట్టి చూస్తే, బాహ్య ప్రపంచానికి తెలియని ఒక పవిత్ర లోకం హిమాలయాలలో ఉంది. దాని పేరే శంబాలా.

Shambhala
భారతదేశానికి పెట్టని కోటలా నిలిచిన హిమాలయాలు ఎన్నో అంతుచిక్కని రహస్యాలకు నిలయం. ఉత్తరాన హిమాలయాలు, దక్షిణాన నల్లమల అడవులు వంటి ప్రాంతాల లోతుల్లోకి ఇప్పటివరకు ప్రపంచంలోని ఏ ఒక్క వ్యక్తి కూడా పూర్తిగా ప్రవేశించలేకపోయాడు. ఈ ప్రాంతాల్లో ప్రతి పౌర్ణమికి చాలా విచిత్రమైన సంఘటనలు జరుగుతాయని పెద్దలు చెబుతుంటారు. అటువంటి వాటిలో అత్యంత ప్రముఖమైనది, అంతుపట్టని రహస్య నగరం “శంబాలా(Shambhala)”.
భారతీయ, బౌద్ధ గ్రంథాలలో రాసిన దానిని బట్టి చూస్తే, బాహ్య ప్రపంచానికి తెలియని ఒక పవిత్ర లోకం హిమాలయాలలో ఉంది. దాని పేరే శంబాలా. పాశ్చాత్యులు దీనిని “హిడెన్ సిటీ” (Hidden City) లేదా “ది ఫర్బిడెన్ ల్యాండ్” (The Forbidden Land), “ది ల్యాండ్ ఆఫ్ వైట్ వాటర్స్” అని కూడా అంటారు. చైనీయులకు కూడా శంబాలా గురించి తెలుసు.
ఈ నగరం వందలు, వేల మైళ్ల విస్తీర్ణంలో ఉన్న హిమాలయాలలోని, మనుషులు చేరుకోలేని ఎక్కడో ఒక చోట ఉంది. ఇది అందరికీ కనిపించదు. ఈ నగరం కనిపించాలన్నా, చేరుకోవాలన్నా మనం శారీరకంగా, మానసికంగా కష్టపడాలి. ముఖ్యంగా, దీనిని వీక్షించాలంటే కొంత యోగం కూడా ఉండాలంటారు. ఎందుకంటే ఇది అతి పవిత్రమైన ప్రదేశమని, దేవతలు సంచరిస్తారని, ఇక్కడ ధర్మం నాలుగు పాదాల మీద నడుస్తుందని పురాణాలు చెబుతున్నాయి.

శంబాలా (Shambhala)విశేషాలు.. సాక్షాత్తు శివుడు కొలువుండే మౌంట్ కైలాష్ పర్వతాలకు దగ్గరలో ఈ పుణ్యభూమి ఉంటుందని, ఆ ప్రాంతమంతా అద్భుతమైన సువాసనతో అలుముకొని ఉంటుందని నమ్మకం. పచ్చని ప్రకృతి నడుమ ఉండే శంబాలాను వీక్షించడం మధురానుభూతి కలిగిస్తుందని చెబుతారు.
నివాసితుల జీవనం.. బౌద్ధ గ్రంథాల ప్రకారం, శంబాలా చాలా ఆహ్లాదకరమైన చోటు. ఇక్కడ నివసించే వారు నిరంతరం సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవిస్తారు. వారి ఆయుర్దాయం సాధారణ ప్రజల కంటే రెట్టింపు ఉంటుందని, వారు మహిమాన్వితులు అని తెలుస్తోంది. అక్కడ నివసించేవారు దాదాపు పన్నెండు అడుగుల పొడవు ఉంటారని ఒక లామా మింగ్యుర్ డో న్డప్ చెప్పినట్టు చెబుతారు.
జ్ఞానం & కమ్యూనికేషన్.. శంబాలాలోని వారు టెలిపతితో ప్రపంచంలో ఎక్కడి వారితోనైనా సంభాషించగలరని, ఎక్కడ జరుగుతున్న అభివృద్ధి అయినా, విధ్వంసం అయినా క్షణాలలో వారికి తెలిసిపోతుందని పరిశోధకుడు డాక్టర్ లాయోసిన్ పేర్కొన్నారు.
డాక్టర్ లాయోసిన్ పరిశోధన ప్రకారం, శంబాలా(Shambhala) ఎనిమిది రేకుల భారీ కలువ పువ్వు ఆకారంలో ఉంటుందట.అయితే మన పురాణాల ప్రకారం, హనుమంతుడు కూడా హిమాలయాలలో “యతి” రూపంలో ఉన్నట్టు తెలుస్తుంది. శంబాలానే “శ్వేత దీపం” అని లేదా ధ్రువ లోకం అని భారతీయ గ్రంథాలలో పేర్కొన్నారు. విష్ణువు పదవ అవతారమైన కల్కి కూడా శంబాలా నుంచే వస్తాడు అని చెబుతారు.
గోబీ ఎడారికి దగ్గరలో ఉన్న శంబాలా(Shambhala)నే రాబోయే రోజుల్లో ప్రపంచాన్ని పాలించే కేంద్ర స్థానం అవుతుందని బుద్ధుడు కాలచక్రంలో రాశాడు అంటారు. పాశ్చాత్యులు దీనిని “Planets of Head Center” అని అంటారు.
ఈ మహిమాన్విత విషయాలు తెలుసుకున్న రష్యా 1920లలో శంబాలా రహస్యాన్ని ఛేదించడానికి తన మిలటరీ ఫోర్స్‌ను పంపి పరిశోధనలు చేయించింది.
దీనిని తెలుసుకున్న నాజీ నేత హిట్లర్ కూడా 1930లలో ప్రత్యేక బృందాలను పంపాడు. ఆ బృందానికి నాయకత్వం వహించిన హేన్రిచ్ హిమ్లర్ ఈ పుణ్యభూమి భువి పైన ఏర్పడ్డ స్వర్గం అని హిట్లర్‌కు చెప్పాడు.
హిట్లర్ ప్రపంచాన్ని తన ఆధీనం లోకి తెచ్చుకోవడానికి శంబాలా ఆధ్యాత్మిక వేత్తల సహయం తీసుకోవాలని ప్రయత్నించాడు. అయితే, శంబాలా గురువులు అతని పన్నాగాన్ని అడ్డుకున్నారు, దాంతో హిట్లర్ వట్టి చేతులతో వెనక్కి తిరిగాడని ప్రాచీన విజ్ఞాన శాస్త్రవేత్త బ్లావెస్కి వెల్లడించారు. హిట్లర్ స్వస్తిక్ ముద్రను వాడటం, సంస్కృతం నేర్చుకోవడం వెనుక కూడా శంబాలా గ్రంథాల అధ్యయనమే కారణమని చెబుతారు.
ఫ్రాన్స్‌కు చెందిన చారిత్రక పరిశోధకురాలు, ఆధ్యాత్మిక వేత్త అలెగ్జాండ్రా డేవిడ్ నీల్ (Alexandra David-Néel) తన జీవితాన్ని ఈ పరిశోధనలకే అంకితం చేశారు. ఆమె 56 ఏళ్ల వయసులో టిబెట్‌కు వచ్చి లామాలను కలుసుకుని, వారి ఆశీస్సులు పొందడం వల్లనే 101 సంవత్సరాలు జీవించిందని అంటారు. ఆమె టిబెట్‌లో కాలుమోపిన తొలి యూరోపియన్ మహిళ.
మామూలుగా కనిపించని శంబాలాకి చేరుకోవడానికి బౌద్ధ గ్రంథాలలో కొన్ని ఆధారాలు ఇవ్వబడ్డాయి. ఆ మార్గంలో తొలుత అంతు దరి లేని ఎడారి (గోబీ ఎడారి) వస్తుంది. దానిని దాటిన తరువాత పర్వతాలు, వాటిని దాటి హిమాలయాల నడిబొడ్డుకు రావాలి. అయితే, ఆధ్యాత్మిక ధోరణి లేని వారికి, పాప కర్మల ఫలం అనుభవిస్తున్న వారికి ఆ ప్రాంతంలో కేవలం మంచు దిబ్బలు, దట్టమైన మేఘాలు, కొండలు, కోనలు మాత్రమే కనిపిస్తాయి. అక్కడి అసాధారణ వాతావరణం వలన వారికి మృత్యువు సంభవించే ప్రమాదం కూడా ఉందని బౌద్ధ గ్రంథాలు హెచ్చరిస్తున్నాయి. శంబాలా టిబెట్ హిమాలయాలలోని కున్లున్ పర్వత సమూహంతో కలిసి ఉండొచ్చని కొంతమంది చరిత్రకారులు భావిస్తున్నారు.