RTI :దేశాన్ని మార్చిన చట్టం.. సమాచార హక్కు చట్టం 20 సంవత్సరాలు పూర్తి
RTI :సమాచార హక్కు చట్టానికి ప్రస్తుతం 20 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, ఆ వ్యవస్థాపక వ్యక్తులను మనం తప్పక అభినందించాలి.

RTI
ఈ చిత్రంలో కనిపిస్తున్న ముగ్గురు వ్యక్తులు చేసిన అలుపెరుగని పోరాట ఫలితమే సమాచార హక్కు చట్టం (RTI) – 2005. ఈ చట్టానికి ప్రస్తుతం 20 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, ఆ వ్యవస్థాపక వ్యక్తులను మనం తప్పక అభినందించాలి.
శ్రీమతి అరుణా రాయ్ (మధ్యలో)..ఈమె ఒక ఐఏఎస్ (IAS) అధికారిణి. ఉద్యోగ నిర్వహణలో ఉన్నప్పుడు, పేదలకు మరియు అణగారిన వర్గాలకు ప్రభుత్వ పథకాలు సరిగా దక్కడం లేదని గమనించారు.
పేదల తరపున గళం వినిపించాలనే ఉద్దేశంతో, తన ఐఏఎస్ ఉద్యోగానికి స్వచ్ఛంద పదవీ విరమణ (Voluntary Retirement) చేసి, ప్రజా సేవలో ముందు నిలిచారు.
శంకర్ సింగ్ (ఎడమవైపు)..ఈయన ఒక ప్రముఖ సామాజిక కార్యకర్త (Social Activist). RTI ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు.
నిఖిల్ డే (కుడివైపు..ఈయన ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లారు. అయితే, గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలపై పోరాడాలనే తీవ్ర తపనతో విదేశీ విద్యను స్వస్తి చెప్పి స్వదేశానికి తిరిగి వచ్చి ఉద్యమంలో భాగమయ్యారు.

మజ్దూర్ కిసాన్ శక్తి సంఘటన్ (MKSS) స్థాపన.. ఈ ముగ్గురు మహనీయులు కలిసి 1987 మే 1న (మే డే) రాజస్థాన్‌లోని దేవదుంగ్రి గ్రామంలో ‘మజ్దూర్ కిసాన్ శక్తి సంఘటన్’ (MKSS) అనే సంస్థను స్థాపించారు. ఈ సంస్థ ఆధ్వర్యంలో వారు ప్రారంభించిన ఉద్యమమే చివరికి 2005 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం సమాచార హక్కు చట్టం (RTI) ను తీసుకురావడానికి దారితీసింది.
ఈ చట్టం ప్రభుత్వ అధికారులకు, రాజకీయ నాయకులకు, విద్యార్థులకు, పత్రికా విలేఖరులకు, సామాజిక కార్యకర్తలకు, శ్రామికులకు – అందరికీ ఒక శక్తివంతమైన సాధనంగా ఉపయోగపడుతుంది.
సమాచార హక్కు చట్టం 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, ఈ ఉద్యమానికి కారణమైన అరుణా రాయ్, శంకర్ సింగ్, నిఖిల్ డేలతో పాటు..ఈ చట్టం ద్వారా లబ్ది పొందుతున్న పౌరులందరికీ శుభాకాంక్షలు.
One Comment