Vijayasai Reddy : విజయసాయి కొత్త పార్టీ వెనుక కమలం స్కెచ్ ఉందా? రూట్ చేంజ్ వెనుక ఉన్న సీక్రెట్ అదేనా?
Vijayasai Reddy : వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఆప్తుడిగానే కాదు నమ్మినబంటుగా కూడా విజయసాయికి బాగా పేరుండేది.
Vijayasai Reddy
ఏపీ పాలిటిక్స్ ఎప్పుడు ఎలాంటి టర్న్ తీసుకుంటాయో చెప్పడం కష్టమే కానీ.. ఇప్పుడు జరుగుతున్న తాజా పరిణామాలు చూస్తుంటే మాత్రం కథ మామూలుగా ఉండదన్న విషయం క్లియర్ కట్‌గా అర్థం అయిపోతోంది. వైఎస్సార్సీపీకి ఒకప్పుడు బ్యాక్ బోన్‌లా, వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కుడి భుజంలా ఉంటూ వచ్చిన విజయసాయి రెడ్డి కొన్ని నెలల కిందట స్వరం మార్చి పార్టీకి బై చెప్పేశారు.
అయితే ఇప్పుడు కొత్త రాజకీయ పార్టీ పెడుతున్నానని, దసరా మర్నాడు పార్టీ వివరాలు వెల్లడిస్తానని విజయసాయి రెడ్డి చెప్పడమే ఆలస్యం.. స్టేట్ మొత్తం ఒకటే చర్చ సాగుతోంది. అసలు ఈ నిర్ణయం వెనుకున్న అసలు మాస్టర్ మైండ్ ఎవరు? ఆయనే సొంతంగా అడుగులు వేస్తున్నారా లేక హస్తినలో ఉన్న కమలం పెద్దలే వెనుకుండి పొలిటికల్ స్టోరీని నడిపిస్తున్నారా అన్న టాక్ నడుస్తోంది. జగన్‌ను, ఆ పార్టీని వీక్ చేయడమే దీని వెనుకున్న అసలు స్కెచ్చా అంటూ పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్‌గా రౌండ్లు కొడుతోంది.
అయితే విజయసాయి రెడ్డి(Vijayasai Reddy) పొలిటికల్ హిస్టరీని ఒకసారి రివైండ్ చేస్తే కనుక.. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఆప్తుడిగానే కాదు నమ్మినబంటుగా కూడా విజయసాయికి బాగా పేరుండేది. కేవలం ఆడిటర్‌గానే కాదు.. అక్రమాస్తుల కేసుల్లో ఏ2గా చేరి జగన్‌లా జైలు జీవితాన్ని కూడా గడిపారు.
పార్టీ పురిటినొప్పి పడుతున్న సమయంలో వైఎస్సార్సీపీ( YSRCP ) తొలి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టింది కూడా ఆయనే. 2014లో వైఎస్సార్సీపీ ఓడిపోయిన తర్వాత, అంతా తానై వ్యవహారాలు చక్కబెట్టి జగన్ కుడిభుజం అన్న పేరు తెచ్చుకున్నారు.
ముఖ్యంగా హస్తిన స్థాయిలో బీజేపీతో సత్సంబంధాలు మెయిన్‌టెయిన్ చేయడంలోనూ అలాగే పార్టీకి కావాల్సిన లాబీయింగ్ చేయడంలోనూ విజయసాయి రెడ్డి రోల్ చాలా కీలకమనే చెప్పాలి. పవర్లోకి వచ్చాక కేంద్రంతో డీలింగ్స్ అన్నీ ఆయనే చూసుకునేవారు.
అలాగే నిమ్మగడ్డ రమేష్‌తో రచ్చ నడుస్తున్నప్పుడు కూడా జగన్‌కు గట్టి సపోర్ట్‌గా నిలిచారు. అమరావతిని పక్కనపెట్టి 3 రాజధానుల గేమ్ ప్లాన్ వెనుకున్న కన్సల్టెన్సీ రిపోర్టును హ్యాండిల్ చేసింది కూడా ఈయనే అన్న వార్తలు కూడా అప్పట్లో గట్టిగానే వినిపించాయి.
అయితే మెల్లమెల్లగా పార్టీలో సజ్జల రామకృష్ణారెడ్డి హవా అనూహ్యంగా పెరిగిపోవడం, ఆయనకే ఎక్కువ ఇంపార్టెన్స్ దక్కడంతో విజయసాయికి ఎక్కడో తేడా కొట్టడంతో మెల్లగా అసంతృప్తి మొదలైంది. ఒక దశలో జగన్ హస్తిన పర్యటనల్లో విజయసాయి ఆ అపాయింట్మెంట్లను అడ్డుకున్నారన్న నెపంతో ఆయనను పక్కన పెట్టినా, వైఎస్ భారతి ఎంట్రీతో మళ్లీ పాత బాధ్యతలు ఆయనకు తిరిగి వచ్చాయి. కానీ, ఆ తర్వాత అదే భారతి సపోర్ట్‌తోనే సజ్జల పార్టీపై పూర్తిగా పట్టు సాధించారు.
ఆ తర్వాతే అనకాపల్లి ఫ్యాక్టరీ గ్యాస్ లీక్ ఘటన టైమ్‌లో జగన్‌తో పాటు వెళ్లాలనుకున్న విజయసాయి(Vijayasai Reddy)ని వద్దని చెప్పడంతో, పార్టీలో ఆయన ప్రాధాన్యం తగ్గిందన్న విషయం క్రిస్టల్ క్లియర్‌గా అందరికీ అర్థం అయిపోయింది. ఆ తర్వాత నెల్లూరు లోక్‌సభ టికెట్ ఇచ్చినా కూడా, పార్టీ ఓటమి పాలయ్యాక జగన్ చుట్టూ ఉన్న ఇన్నర్ సర్కిల్‌పై విజయసాయి రెడ్డి ఓపెన్‌గానే విమర్శలు చేయడం మొదలెట్టారు.
ఇదే సమయంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్, ఏపీ మద్యం వివాదాల్లో విజయసాయి(Vijayasai Reddy) పేరు బయటకొచ్చినా కూడా, ఆయనపై పెద్దగా చట్టపరమైన చర్యలు లేకపోవడం అందరినీ ఆలోచనలో పడేసింది. ఆయన అప్రూవర్‌గా మారిపోయారని, కమలం పెద్దలు చెప్పినట్లే ఆయన వింటున్నారనే ఊహాగానాలు బలంగా వినిపించాయి.
సరిగ్గా ఇలాంటి టైమ్‌లోనే యాక్టివ్ పాలిటిక్స్ నుంచి తాను రిటైర్ అవుతున్నట్లు ప్రకటించిన విజయసాయి, సడన్‌గా లైన్ కూడా మార్చి హిందుత్వంపై ఎక్కువ మాట్లాడటం మొదలెట్టారు. అంతేకాదు జగన్ హిందూ వ్యతిరేకి అని కామెంట్లు కూడా చేశారు.

అయితే కాపు సామాజిక వర్గాన్ని జనసేన పార్టీ వైపు, రెడ్డి సామాజిక వర్గాన్ని విజయసాయి రెడ్డి పెట్టబోయే కొత్త పార్టీ వైపు తిప్పి వైసీపీ ఓటు బ్యాంకును చీల్చాలి అనేదే బీజేపీ స్ట్రాటజీ కావొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకవేళ ఈ ప్లాన్ వర్కవుట్ అయి జగన్ మోహన్ రెడ్డి గ్రాఫ్ తగ్గిపోతే.. ఇకపై కమలం పెద్దలకు జగన్‌తో పని ఉండదు. లేదంటే మళ్లీ జగన్ వైపే చూడాల్సిన పరిస్థితి వస్తుంది.
నాడు జగన్ కుడిభుజంగా ఉన్న లీడర్.. అదే జగన్ మోహన్ రెడ్డి సామ్రాజ్యానికి నేడు శత్రువుగా మారుతున్నారా అన్న టాక్ నడుస్తోంది. లేదంటే ఢిల్లీ పెద్దలు రాసిన పెద్ద స్క్రిప్ట్‌లో కేవలం ఒక రోల్ పోషిస్తున్నారా అన్న అనుమానాలు కూడా వినిపిస్తున్నాయి. మొత్తానికి విజయసాయి రెడ్డి(Vijayasai Reddy) వేసే రాజకీయ అడుగులను బట్టి ఇదంతా కొద్ది రోజుల్లోనే తేలిపోతుంది.
Shopping Bill : షాపింగ్ బిల్లులు కొన్ని రోజులకే మాయమవుతున్నాయా? మరి గ్యారంటీ, వారంటీ మాటేంటి?





