Decision paralysis:నిర్ణయం తీసుకోలేని నిస్సహాయత ..మీరూ డెసిషన్ పెరాలిసిస్ బాధితులేనా?
Decision paralysis: ఎంచుకోవడానికి ఎక్కువ అవకాశాలున్నప్పుడు మన మెదడు మొద్దుబారిపోయి, ఏ నిర్ణయమూ తీసుకోలేకపోతుంటాం.
Decision paralysis
ఒకప్పుడు మనం బట్టలు కొనాలంటే మనకు తెలిసిన రెండు , మూడు షాపులే ఉండేవి. దానిలో తక్కువ ధరకు, మంచి క్వాలిటీ ఉందని ఏ షాప్‌కు పేరుందో అక్కడకు వెళ్లి నచ్చిన బట్టలు కొని తెచ్చుకునేవాళ్లం. అయితే ఇప్పుడు ఒక ఆన్లైన్ షాపింగ్ యాప్స్ ఓపెన్ చేస్తే వేలల్లో ఆప్షన్లు కనిపిస్తాయి.
అలాగే ఒక సినిమా చూడాలని నెట్‌ఫ్లిక్స్‌లో సెర్చ్ చేయడం మొదలుపెడితే, ఏ మూవీ చూడాలో తేల్చుకోలేక గంట సేపు పైకి , కిందకు చూస్తూనే గడిపేస్తాం. చివరికి విసుగొచ్చి ఏ సినిమా చూడకుండానే క్లోజ్ చేస్తాం. దీనినే సైకాలజీలో డెసిషన్ పెరాలిసిస్ Decision paralysis)అంటారు. అంటే, ఎంచుకోవడానికి ఎక్కువ అవకాశాలున్నప్పుడు మన మెదడు మొద్దుబారిపోయి, ఏ నిర్ణయమూ తీసుకోలేకపోవడం అన్నమాట.
మన మెదడుకు ఒక లిమిట్ ఉంటుంది. ఎప్పుడైతే మనం పది రకాల ఆప్షన్ల మధ్య చిక్కుకుంటామో , మన మెదడు ప్రతి దానిని ఎంచడం మొదలుపెడుతుంది. ఇది చాలా ఎనర్జీని ఖర్చు చేసే ప్రక్రియ. ఒకవేళ నేను దీనిని ఎంచుకుంటే, రెండోది దీనికంటే బాగుంటుందేమోననే అనుమానం వెనక్కి లాగుతుంది.
అయితే దీనివల్ల మనం ఒక నిర్ణయం తీసుకున్నా కూడా, ఆ నిర్ణయం మీద పూర్తి సంతృప్తి ఉంటుందా అంటే ఉండదు. మనం వదిలేసిన మిగిలిన ఆప్షన్ల మీదనే ఇంకా మనసు ఉంటుంది. అయ్యో అదే తీసుకోవాల్సింది, అదే వేసుకోవాల్సింది అంటూ ఆలోచిస్తాం. దీనిని ఆపర్చునిటీ కాస్ట్ అంటారు. అంటే, ఒకటి పొందినందుకు మనం వదులుకుంది ఎక్కువ అని బాధపడటం.

అయితే ఈ సమస్య కేవలం వస్తువుల దగ్గరే ఉంటే బాగుండేదేమో ..కానీ కెరీర్ , రిలేషన్ షిప్స్ లో కూడా కనిపిస్తోంది. మన ముందు వేరువేరు రకాల దారులు ఉన్నప్పుడు, ఏ దారిలో వెళ్తే బాగుంటుందో అర్ధం కాక అక్కడే ఆగిపోతాం. పక్కవాడు ఇంకో దారిలో వెళ్లి సక్సెస్ అయ్యాడని తెలిస్తే..వెంటనే మనం వెళ్తున్న దారి తప్పు అనిపిస్తుంటుంది. ఈ అనవసరమైన పోలిక మనల్ని మానసిక గందరగోళంలోకి మరింతగా నెట్టేస్తుంది. ఎక్కువ ఆప్షన్లు ఉండటం అనేది ఫ్రీడమ్ అనుకుంటాం కానీ, అది నిజానికి మనల్ని బంధించే డెసిషన్ పెరాలసిస్ (Decision paralysis) ఒక మానసిక సంకెళ్లు అని అర్ధం చేసుకోలేకపోతున్నాం.
దీని నుంచి బయటపడాలంటే శాటిస్ఫైసింగ్ (Satisficing) అనే చిన్న సూత్రాన్ని పాటిస్తే సరిపోతుంది. అంటే, మనకు కావాల్సిన అవసరాలన్నిటినీ ఒక పేపర్ మీద రాసుకోవాలి. ఆ అవసరాలకు సరిపోయే ఆప్షన్ ఏదైనా ఒకటి కనిపించగానే దానికే ఫిక్స్ అయిపోవాలి. ఇంకా ఏదో ఏదో అద్భుతం దొరుకుతుందేమోనని టైమ్ వేస్ట్ చేసుకుని వెతకడం మానేయాలి. పర్ఫెక్ట్ నిర్ణయం కోసం గంటలు గంటలు టైమ్ వేస్ట్ చేసుకోవడటం కంటే, మంచి నిర్ణయం తీసుకుని ముందుకెళ్లడమే ముఖ్యం అని తెలుసుకోవాలి.



