just AnalysisJust InternationalLatest News

Maduro:మదురో నుంచి సద్దాం వరకూ అదే చరిత్ర పునరావృతం..మదురో అరెస్ట్ వెనుక అసలేం జరిగింది?

Maduro: మదురో భద్రత మూడు అంచెల్లో ఉండేది. బయటి వలయంలో మిలిటరీ పోలీస్, మధ్యలో స్నిపర్లు, లోపలి వలయంలో తన ప్రాణాల కంటే ఎక్కువగా నమ్మే క్యూబన్ ఏజెంట్లను నియమించారు.

Maduro

ప్రపంచ చరిత్రలో ఎంతోమంది నియంతలు తాము నిర్మించుకున్న అభేద్యమైన కోటలే తమకు అసలైన శ్రీరామరక్ష అని భావించారు. కానీ తాజాగా వెనిజులా రాజధాని కరాకస్‌లోని మిరాఫ్లోరెస్ ప్యాలెస్ సాక్షిగా జరిగిన నికోలస్ మదురో(Maduro) అరెస్ట్ ఉదంతం మరోసారి ఒక చేదు నిజాన్ని బయటపెట్టింది.

చుట్టూ 2,000 మంది కరడుగట్టిన కమాండోలు, అత్యంత ఆధునిక యాంటీ డ్రోన్ సిస్టమ్స్, క్యూబా నుంచి వచ్చిన ప్రత్యేక నిఘా ఏజెంట్లు.. ఇవన్నీ ఉన్నా మదురోను అమెరికా సైన్యం.. ఒక సామాన్యుడిలా అరెస్ట్ చేసి దర్జాగా తమ దేశానికి తీసుకుని వెళ్లిపోయింది.

ఇంత పెద్ద ఘటన జరిగినా సరే..ఒక్క బుల్లెట్ కూడా ఎదురుకాలేదంటే, ఆ భద్రతా వలయం ఎంత దారుణంగా అమెరికాకు లొంగిపోయిందో ఈజీగా అర్థం చేసుకోవచ్చు. తుపాకుల గోడ తనను కాపాడుతుందని మదురో బలంగా నమ్మారు.. కానీ ఆ గోడలే ఆరోజు అమెరికా దళాలకు దారి చూపించాయి.

నిజానికి మదురో(Maduro) భద్రత మూడు అంచెల్లో ఉండేది. బయటి వలయంలో మిలిటరీ పోలీస్, మధ్యలో స్నిపర్లు, లోపలి వలయంలో తన ప్రాణాల కంటే ఎక్కువగా నమ్మే క్యూబన్ ఏజెంట్లను నియమించారు మదురో. ఇంత చేసినా కూడా నిఘాకు చిక్కకుండా ఉండటానికి ఆయన ప్రతీ రాత్రి కూడా పడక మార్చేవారు. ట్రాక్ చేయడానికి అవకాశం ఇస్తానేమో అన్నట్లుగా కనీసం స్మార్ట్‌ఫోన్ ముట్టుకోవడానికి కూడా భయపడేవారు.

మరి ఇంత జాగ్రత్తగా ఉన్న వ్యక్తి బెడ్‌రూమ్‌లోకి అమెరికా సైన్యం నేరుగా ఎలా వెళ్లగలిగింది అంటే.. ఇక్కడే లోపలి మనుషుల నమ్మకద్రోహం అనే అసలు సినిమా మొదలైంది.

Three individuals with obscured faces.
Maduro

యుద్ధ తంత్ర నిపుణుల అభిప్రాయం ప్రకారం.. అమెరికా కేవలం తన టెక్నాలజీతో మాత్రమే కాదు, మదురో అత్యంత సన్నిహితులయిన వారిని కూడా తన వైపు తిప్పుకోవడం ద్వారానే ఈస్థాయిలో విజయాన్ని సాధించింది. ట్రంప్ ప్రభుత్వం ఎవరికి ఎన్ని హామీలు ఇచ్చిందో, ఎంతమందిని కొనేసిందో కానీ, ఆ రాత్రి మదురో సొంత మనుషులే మూగ ప్రేక్షకుల్లా నిలబడిపోయారు.

చరిత్ర పుటలు తిరగేస్తే ఇలాంటి ఉదంతాలు చాలానే మనకు కనిపిస్తాయి. 1989లో పానామా డిక్టేటర్ మాన్యూల్ నోరియేగా పరిస్థితి కూడా ఇలాగే అయింది. తన సొంత సైన్యం తన కోసం ప్రాణాలిచ్చేంతగా పోరాడుతుందని ఆయన నమ్మారు. కానీ అమెరికా దాడులు మొదలవగానే అతని చుట్టూ ఉన్న బలగాలు పోరాటం ఆపేసి లొంగిపోయాయి.

అలాగే ఇరాక్ పాలకుడు సద్దాం హుస్సేన్ కథ కూడా ఇందుకు భిన్నం ఏమీ కాదు. డజన్ల కొద్దీ సేఫ్ హౌస్‌లు, సీక్రెట్ బంకర్లు ఉన్నా, చివరకు ఆయన ఎక్కడున్నారో అమెరికాకు తెలిసిపోయింది కేవలం ఆయన అత్యంత విశ్వసనీయ వర్గంలోని వ్యక్తి ఇచ్చిన లీక్ వల్లనే. భార్యాపిల్లల భద్రత లేదా భారీ నగదు ఆఫర్ ముందు విశ్వసనీయత ఎంతటి విలువలేనిదో సద్దాం ఘటన ప్రూవ్ చేసింది.

అటు లిబియా నియంత ముఅమర్ గద్దాఫీ విషయంలో కూడా ఇదే జరిగింది. నాటో వైమానిక దాడుల కంటే, ఆయన సొంత భద్రతా వ్యవస్థలో వచ్చిన చీలికే ఆయన పతనానికి కారణంగా మారింది. తన కింద పనిచేసే జనరల్స్ .. తిరుగుబాటుదారులతో చేతులు కలపడంతో గద్దాఫీ కోట నిమిషాల్లోనే కూలిపోయింది.

అంతెందుకు చివరకు పాకిస్తాన్‌లోని అబ్బొటాబాద్‌లో ఒసామా బిన్ లాడెన్ అరెస్ట్ వెనుక కూడా.. మానవ నిఘానే (Human Intelligence) కీలక పాత్ర పోషించింది. 18 అడుగుల గోడలు, రేజర్ వైర్ల కంటే, ఆ గోడల మధ్య ఎవరు తిరుగుతున్నారో తెలిసిన లాడెన్ మనుషులే అమెరికాకు పిన్ పాయింట్ లోకేషన్ ఇచ్చారు.

వెనిజులాలో మదురో(Maduro) విషయంలో అయితే అమెరికా ఆపరేషన్ సదరన్ స్పియర్ పేరుతో ఒక పక్కా ప్లాన్ అమలు చేసింది. కేవలం రాడార్లను జామ్ చేయడం, కమ్యూనికేషన్ కట్ చేయడం మాత్రమే కాకుండా..మదురో ప్రైవేట్ పైలట్,సెక్యూరిటీ స్టాఫ్‌తో నెలల ముందే రహస్య ఒప్పందాలు కుదుర్చుకుని మరీ ప్లాన్ వర్కవుట్ చేసింది. అంతేకాదు మేము మీ కోసం రాలేదు.. కేవలం మదురో కోసమే వచ్చాం, అడ్డు పడకుండా ఉంటే మీరూ, మీతో పాటు మీ ఫ్యామిలీ సేఫ్ అనే సైకలాజికల్ గేమ్ ఆడి మిగిలిన కమాండోలను కూడా నిర్వీర్యం చేశారు.

కోట గోడలు ఎంత ఎత్తుగా కట్టినా సరే.. తాళం చేయి నీకు నమ్మక ద్రోహం చేసే వాడి చేతిలో ఉంటే ఏం లాభం అనే పెద్దల మాట ఈ సందర్బంగా గుర్తు చేసుకోవచ్చు. ఎందుకంటే చరిత్ర నుంచి నేటి వరకూ ఇదే జరుగుతూ వస్తుంది.

మరోవైపు మదురో అరెస్ట్ ప్రపంచంలోని మిగిలిన నియంతలకు కూడా ఒక బలమైన హెచ్చరిక అనే చెప్పాలి. భయం, దౌర్జన్యం మీద నిర్మించిన ఏ భద్రతా వలయమైనా సరే అవతలి వారి స్వప్రయోజనం ముందు పేకమేడలా కూలిపోతుందనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి.

PF wage: పీఎఫ్ వేతన పరిమితి పెంపుపై సుప్రీంకోర్టు సీరియస్.. కోర్టు చెబితే కానీ కేంద్రానికి అర్థం కాదా?

Related Articles

Back to top button