DSC:నిరుద్యోగులకు ఉగాది కానుక రెడీ..మరో డీఎస్సీకి రంగం సిద్ధం
DSC: గత డాది 16,347 డీఎస్సీ పోస్టులకు ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వగా, అందులో మెజారిటీ పోస్టులు భర్తీ అయిపోయాయి.
DSC
ఏపీలో ఉపాధ్యాయ కొలువు కోసం వేచి చూస్తున్న నిరుద్యోగులందరికీ కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించింది. ప్రతి ఏటా డీఎస్సీ (Annual DSC) నిర్వహిస్తామని చెప్పిన ఎన్నికల హామీని నిలబెట్టుకుంటూ వస్తుంది. దీనిలో భాగంగానే 2026 సంవత్సరానికి గాను కొత్త డీఎస్సీ(DSC) నోటిఫికేషన్ రిలీజ్ చేయడానికి కసరత్తును ముమ్మరం చేసింది విద్యాశాఖ.
వచ్చే నెలలో జరుపుకోబోయే ఉగాది పర్వదినం సందర్భంగా ఈ నోటిఫికేషన్‌ను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గత ఏడాది భారీ స్థాయిలో పోస్టులను భర్తీ చేసిన కూటమి ప్రభుత్వం, ఈ ఏడాది కూడా ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తూ.. విద్యావ్యవస్థను బలోపేతం చేయడానికి నిర్ణయం తీసుకుంది.
పాఠశాల విద్యాశాఖ క్షేత్రస్థాయి నుంచి వినిపిస్తున్న ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఈ విడతలో సుమారు 3,600 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది.
ప్రభుత్వ, పంచాయతీరాజ్, మున్సిపల్ స్కూల్స్‌కు దాదాపు 1,700 పోస్టులు భర్తీ చేయనుండగా ..సంక్షేమ శాఖ స్కూల్స్, ఆదర్శ పాఠశాలలు (Model Schools), రెసిడెన్షియల్ స్కూల్స్‌లో దాదాపు 1,200 పోస్టులు ఉన్నాయి. అలాగే స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లలో దాదాపు 700 పోస్టులు ఇప్పుడు భర్తీ చేయడానికి కసరత్తు చేస్తున్నారు.
గత డాది 16,347 డీఎస్సీ (DSC)పోస్టులకు ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వగా, అందులో మెజారిటీ పోస్టులు భర్తీ అయిపోయాయి. అందులో మిగిలిపోయిన బ్యాక్‌లాగ్ పోస్టులను కూడా ఈ కొత్త నోటిఫికేషన్‌లో కలిపే అవకాశం ఉంది.

ఈసారి డీఎస్సీలో అభ్యర్థులకు మరింత ఈజీగా ఉండేలా ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. గత ఏడాది అమలు చేసిన సిలబస్ , మార్గదర్శకాలనే ఇప్పుడు కూడా కొనసాగించాలని భావిస్తున్నారు. దీనివల్ల అభ్యర్థులు కొత్తగా సిలబస్ మారిందన్న గురించి ఆందోళన చెందకుండా పాత ప్రిపరేషన్‌ను కొనసాగించొచ్చు.
ఇప్పటికే అధికారిక వెబ్‌సైట్‌లో కూడా ఈ సిలబస్ అందుబాటులో ఉంచారు. అలాగే, ఎంతో కాలంటా కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేస్తున్న ఉపాధ్యాయులకు.. ఈ డీఎస్సీలో వెయిటేజీ ఇవ్వడానికి ప్రభుత్వం ఆలోచిస్తోంది. సుప్రీంకోర్టు ఆదేశాలతో వారికి మినిమం టైమ్ స్కేల్ అమలు చేయాలనే నిర్ణయం కూడా ఉండటంతో వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఉగాది సమయంలో నోటిఫికేషన్ వస్తే, మే లేదా జూన్ నెలల్లో ఈ ఎగ్జామ్స్ నిర్వహించే అవకాశం ఉంటుంది. ఈ లోపు టెట్ (TET) పరీక్షపై కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉందని అభ్యర్థులు భావిస్తున్నారు. కూటమి ప్రభుత్వం ప్రతి ఏటా క్యాలెండర్ ప్రకారం..ఇలా ఉద్యోగాల భర్తీ చేపడుతుండటంతో నిరుద్యోగుల్లో నమ్మకం పెరుగుతోంది.



