Just NationalJust Andhra PradeshJust PoliticalJust TelanganaLatest News

Free scheme:ఉచితాలపై సుప్రీంకోర్టు హెచ్చరిక.. మారాల్సింది ఎవరు? రాజకీయనాయకుడా? ఓటరా?

Free scheme: రేపు ఎవరైనా సరే నేను ఉచితాలు అందించను కేవలం రాష్ట్రాన్ని బాగు చేయడానికే నిధులన్నీ వాడతామని ఎన్నికల హామీలలో చెబితే ఎంత మంది ఆ నాయకుడికి ఓటేస్తారు?

Free scheme

ప్రస్తుతం భారతదేశం ఒక విచిత్రమైన సంక్షోభంలో ఉందన్న విషయం బాగా గమనిస్తేనే కానీ అర్ధం కాదు. ఒకవైపు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో వేగంగా దూసుకుపోతుంటే, మరోవైపు ఉచితాల మత్తులో(Free scheme )రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలు మెల్లమెల్లగా కుప్పకూలుతున్నాయి .
ఫిబ్రవరి 19, 2026న సుప్రీంకోర్టు ధర్మాసనం ఉచితాలపై చేసిన వ్యాఖ్యలు.. రాజకీయ పార్టీలకే కాదు, ప్రతి ఓటరుకు ఒక వేక్ అప్ కాల్ అనుకోవాలి. ఎందుకంటే భూస్వాములు కూడా ఫ్రీ కరెంట్ వాడుతున్నారు.. పన్ను కట్టేవాడి డబ్బు వృథా అవుతోందని సిజేఐ సూర్యకాంత్ అన్న మాటలు నిజంగానే అక్షర సత్యాలు కాబట్టి.

నిజానికి రాజకీయాల్లో పొపులిజం (ప్రజాకర్షక పథకాలు) అనేది ఇప్పుడు మెల్లమెల్లగా ఒక మహమ్మారిలా మారింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో అయితే ఈ పరిస్థితి మరీ ఆందోళనకరంగా ఉంది.

ఆర్థిక గణాంకాలు చూసుకుంటే తెలంగాణలో ఆరు గ్యారంటీలు, ఏపీలో సూపర్ సిక్స్ వంటి పథకాలకు ఏటా రూ. 1 లక్ష కోట్ల నుంచి 2 లక్షల కోట్ల వరకు ఖర్చవుతోంది.ఒక్కో రాష్ట్రానికి కేంద్రం ఇచ్చే రాష్ట్ర బడ్జెట్‌లో 15% నుంచి 20% వరకు కేవలం ఉచిత పథకాలకే పోతే, ఇక రోడ్లు, హాస్పిటల్స్, పాఠశాలల వంటి నిర్మాణానికి నిధులు ఎక్కడ ఉంటాయి?

అంతేకాదు ఉచితాలు ఇవ్వడానికి రాష్ట్రాలు చేస్తున్న అప్పులు జీఎస్‌డీపీలో 35% నుంచి 45% కి చేరుకున్నాయి. అంటే, మనం ఈరోజు తీసుకునే ఉచితాల డబ్బుకు, రేపు మన పిల్లలు వడ్డీలు కట్టాల్సి వస్తుంది.

అంతెందుకు ఇక్కడే మనల్ని మనం ఒకటి ప్రశ్నించుకోవాలి. మనం ఎప్పుడూ నాయకులు అవినీతిపరులు, మంచి వారు రావాలని కోరుకుంటాం. కానీ ఒక ఓటరుగా మనం ఎంతవరకు బాధ్యతగా ఉంటున్నాం? రేపు ఎవరైనా సరే నేను ఉచితాలు(Free Scheme) అందించను కేవలం రాష్ట్రాన్ని బాగు చేయడానికే నిధులన్నీ వాడతామని ఎన్నికల హామీలలో చెబితే ఎంత మంది ఆ నాయకుడికి ఓటేస్తారు? అలా ఓటేసేవాళ్లు 10 శాతం మంది కూడా ఉండరు.

ఎందుకంటే 20 ఏళ్ల పాటు ఉండే రోడ్డు కంటే, రేపు పొద్దున్నే అకౌంట్‌లో పడే డబ్బులకే ఓటరు విలువ ఇస్తున్నాడు. లేకపోతే ఐదెకరాల భూమి ఉన్న రైతు కూడా రైతు భరోసా కావాలని కోరుకోవడం ఏంటి? ధనవంతులు కూడా ఫ్రీ కరెంట్ కోసం పాకులాడటం ఏంటి?

పని చేయకుండా డబ్బు చేతికందుతుంటే, ఇక పని ఎవరు చేస్తారు? అందుకే గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కూలీల కొరత ఏర్పడుతోంది. పని చేసే శక్తి ఉన్నవారు కూడా ఉచిత పథకాలపై ఆధారపడటం వల్ల లేజీనెస్ పెరిగి ప్రొడక్టివిటీ పడిపోతోంది.

రాజకీయ నాయకులు ఓటర్ల బలహీనతను ఎప్పుడో కనిపెట్టారు. అభివృద్ధి గురించి మాట్లాడితే ఓట్లు రావని అర్ధం చేసుకున్నారు. ఎందుకంటే జనాలు ఎప్పుడో ఉచితాలకు అలవాటు పడిపోయారు. అందుకే ఫ్రీ అంటేనే జనం వెనుక వస్తారని పొలిటికల్ లీడర్స్ నమ్ముతున్నారు.

నిజమైన పేదవాడికి సాయం చేయాలన్న కాన్సెప్ట్ పోయి.. కులాలు, మతాలు ఆధారంగా ఉచితాలను ఇవ్వడం తప్పన్న విషయాన్ని కూడా పట్టించుకోవడం మానేశారు.

Free scheme
Free scheme

ఉదాహరణకు ఒక విమానాశ్రయం కట్టాల్సిన డబ్బుతోనే ఉచిత బస్సు ప్రయాణాలను కల్పిస్తున్నారని అనుకుంటే..లాంగ్ టర్మ్‌లో ఆ ప్రాంతం పారిశ్రామికంగా వెనుకబడిపోతుందనే కదా అర్ధం. ఈ నిజాన్ని నాయకులు చెప్పరు, ఓటర్లకు అసలే అక్కర్లేదు.

సుప్రీంకోర్టు జోక్యంతో ఇప్పటికైనా అందరిలో మార్పు రావాలి.దీని కోసం ఎన్నికల ముందు ప్రకటించే ప్రతీ పథకానికి నిధులు ఎక్కడి నుంచి వస్తాయో పార్టీలు స్పష్టం చేయాలి.అర్హులకే సాయం అందించాలి.

సింగపూర్ వంటి దేశాలు ఉచిత పథకాలు వంటివి ఏమీ లేకుండానే అగ్రరాజ్యాలుగా ఎదిగాయి. కానీ మన దగ్గర అభివృద్ధి అంటే ఫ్రీగా డబ్బులు పంచడం అనే స్థాయికి దిగజారిపోతున్నాం.

నిజానికి నాయకులు మారాలంటే మారరు. ఎందుకంటే ముందు మార్చుకోవాల్సింది మారాల్సింది ఓటరు మైండ్‌సెట్ . ఇకనైనా నాకు ఫ్రీ పథకం(Free scheme )వద్దు.. మా పిల్లలకు మంచి ఉద్యోగం, నా ఊరికి మంచి రోడ్డు కావాలని ఓటరు అడిగిన రోజే అసలైన ప్రజాస్వామ్యం వచ్చినట్లు అని ప్రతీ ఒక్కరూ అర్ధం చేసుకోవాలి.

మరిన్ని నేషనల్ న్యూస్అప్ డేట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Leave a Reply

Back to top button