Kavitha:కవిత కొత్త ప్రస్థానం..తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి మలుపు తీసుకుంటుంది?
Kavitha: కవిత కేవలం కేసీఆర్ కుమార్తెగానే కాకుండా, తెలంగాణ జాగృతి ద్వారా సాంస్కృతిక ఉద్యమాన్ని.. నడిపిన నాయకురాలిగా గుర్తింపు పొందారు.
Kavitha
రాజకీయాలు ఎప్పుడూ ఒకే మూసలో సాగవన్న విషయం తెలిసిందే. తెలంగాణలో అయితే ఈ మార్పులు కాస్త ఎక్కువే అని చెప్పొచ్చు. ఉద్యమ కాలం నుంచి ఇప్పటి వరకు ఇక్కడ సమీకరణాలు మారుతూనే ఉన్నాయి. ఇదే కోవలో తాజాగా కల్వకుంట్ల కవిత(Kavitha) తన తండ్రి స్థాపించిన పార్టీని వీడి, సొంతంగా కొత్త పార్టీని ప్రకటించబోతున్నారనే వార్త .. ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా పెను సంచలనాన్ని సృష్టిస్తోంది. ఇది కేవలం ఒక కుటుంబ కలహం కాదు.. తెలంగాణ పొలిటికల్ భవిష్యత్తును మార్చే ఒక భారీ మార్పుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
2014లో నిజామాబాద్ ఎంపీగా కవిత రాజకీయ ప్రయాణం అత్యంత వైభవంగా ప్రారంభమయింది. అప్పట్లో కవిత కేవలం కేసీఆర్ కుమార్తెగానే కాకుండా, తెలంగాణ జాగృతి ద్వారా సాంస్కృతిక ఉద్యమాన్ని.. నడిపిన నాయకురాలిగా గుర్తింపు పొందారు. పార్లమెంటులో తెలంగాణ సమస్యలపై కవిత చేసిన ప్రసంగాలు, మహిళా బిల్లు కోసం కవిత సాగించిన పోరాటం ఆమెను ఒక జాతీయ స్థాయి నాయకురాలిగా కూడా నిలబెట్టాయి.
అయితే, 2019 ఎన్నికల ఓటమి కవిత(Kavitha)నే కెరీర్‌లో మొదటి పెద్ద మలుపు అన్నట్లుగా మారిపోయింది. ఆ తర్వాత ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎదుర్కొన్న ఆరోపణలు, నెలల తరబడి జైలు జీవితం ఆమె రాజకీయ జీవితాన్నే కాదు.. ఆమె వ్యక్తిత్వాన్ని కూడా పూర్తిగా మార్చేశాయి. జైలు నుంచి బయటకు వచ్చిన కవిత, ఇప్పుడు ఒక ఫైటర్ ఇమేజ్‌తో, కుటుంబంతో పాటు పార్టీ నీడ నుంచి బయటపడి తనకంటూ ఒక సొంత అస్తిత్వాన్ని వెతుక్కుంటున్నారు.
మే నెల మొదటి వారంలో ఆమె కొత్త పార్టీపై ప్రకటన చేయనున్నారు. కవిత సొంత పార్టీ పెట్టడానికి ముఖ్యంగా మూడు కారణాలు కనిపిస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. బీఆర్ఎస్ పార్టీలో కేటీఆర్ వారసత్వానికి కేసీఆర్ ఇస్తున్న ప్రాధాన్యత మొదటిది. రాష్ట్ర రాజకీయాలు కంటే కుటుంబ రాజకీయాలు ఎక్కువ అవడం ఆమె జీర్ణించుకోలేకపోతున్నారు. అలా
పార్టీ పగ్గాలు మెల్లమెల్లగా కేటీఆర్ చేతికి వెళ్తుండటంతో , తనకంటూ ఒక ప్రత్యేక స్థానం ఉండాలని ఆమె భావిస్తున్నారు.
అలాగే లిక్కర్ కేసు వంటి న్యాయపరమైన చిక్కుల నుంచి పార్టీని విడదీసి, తన ఒంటరి పోరాటాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా ‘క్లీన్ స్లేట్’తో రాజకీయాలు ప్రారంభించాలనుకోవడం రెండోది.
ఇక ప్రస్తుత బీఆర్ఎస్ పరిస్థితి పెద్దగా బాగోకపోవడం మూడో కారణం. 2023 ఓటమి తర్వాత బీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోతుండటంతో, అదే పార్టీలో ఉంటే భవిష్యత్తు ఉండదని భావించారు. కొత్త బ్రాండ్‌తో యువతను, మహిళలను ఆకట్టుకోవాలని కవిత కొత్త స్ట్రాటజీతో ముందుకు వస్తున్నారు.
తెలంగాణలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ దాదాపు 55% ఓటు షేర్‌తో బలంగా ఉంది. అయితే, నిరుద్యోగ క్యాలెండర్ ఆలస్యం కావడం, రైతు భరోసా అమలులో లోపాలు ప్రజల్లో కొంత వ్యతిరేకతను మూటగట్టుకున్నాయి.
మరోవైపు,బీఆర్ఎస్ పాత అభిమానంతో గ్రామీణ ప్రాంతాల్లో 25% ఓటు బ్యాంకుని కాపాడుకున్నా కూడా, పట్టణాల్లో మాత్రం మెల్లమెల్లగా పట్టు కోల్పోతోంది. ఇటు బీజేపీ, జనసేన కూటమి మెల్లమెల్లగా తమ బలాన్ని పెంచుకుంటూ 15% నుంచి 20% ఓటు షేర్ వైపు అడుగులు వేస్తున్నాయి. ముఖ్యంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో బీజేపీ బలం బాగానే పెరుగుతోంది.
ఇలాంటి సమయంలో కవిత కొత్త పార్టీ ప్రభావం ముఖ్యంగా కాంగ్రెస్ , బీఆర్ఎస్ ఓటు బ్యాంకులపై పడే అవకాశం ఉంది.

కవిత మహిళా సాధికారతతో పాటు యువతకు ఉపాధి అనే నినాదాలతో వస్తే, కాంగ్రెస్ వైపు ఉన్న యువత, మహిళా ఓటర్లు చీలిపోయే అవకాశముంది. సుమారు 10-15% ఓటు షేర్ ఆమె వైపు మళ్లితే కాంగ్రెస్ మెజారిటీకి గండి పడుతుంది.
అలాగే కేసీఆర్ కుటుంబంపై ఇంకా అభిమానం ఉన్న క్యాడర్, కేటీఆర్ లీడర్‌షిప్పును ఇష్టపడని వారు కవిత వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. దీనివల్ల బీఆర్ఎస్ మరింత బలహీనపడొచ్చు.
వీరిద్దరి వల్ల లౌకిక ఓట్లు చీలిపోవడం వల్ల పట్టణ ప్రాంతాల్లో బీజేపీకి, ఇప్పుడిప్పుడే తెలంగాణలోనూ పుంజుకుంటున్న జనసేనకు పరోక్షంగా లాభం చేకూరొచ్చు.
అయితే కవిత కొత్త పార్టీ మేనిఫెస్టోలో 50% టికెట్లు మహిళలకే ఇవ్వడంతో పాటు డిజిటల్ గవర్నెన్స్ వంటి అంశాలు హైలైట్‌గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అయితే, నిధుల సమీకరణే కాదు క్షేత్రస్థాయిలో కేడర్ నిర్మాణం కూడా కవితకు పెద్ద సవాలుగా మారనున్నాయి. 2028 అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె కింగ్ మేకర్‌గా ఎదగలేరు కానీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ ఓట్లను చీల్చడంలో మాత్రం సక్సెస్ అవుతారు. అయితే అవన్నీ కవిత పార్టీకే పడతాయన్న నమ్మకం లేదు.



